కొత్త సీఎస్ రామకృష్ణారావు?
ABN , First Publish Date - 2023-01-11T03:15:37+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు నియమితులు కానున్నారా.
సోమేశ్ స్థానంలో ఆయనకే చాన్స్?
అర్వింద్‌కుమార్ నుంచి గట్టి పోటీ
రామకృష్ణారావుకు కేసీఆర్‌తో సాన్నిహిత్యం
అర్వింద్‌కుమార్‌కు కేటీఆర్ అండదండలు
తెలుగేతర వ్యక్తి కావడంతో కొంత మైనస్
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు నియమితులు కానున్నారా? ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపుతోందా? ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలుండడం రామకృష్ణారావుకు కలిసిరానుందా? పస్తుత ఆర్థిక సంక్షోభంలో ఆయనైతేనే రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారని ప్రభుత్వం భావిస్తోందా? అంటే.. అవుననే అంటున్నాయి ప్రభుత్వ, అధికార వర్గాలు. ప్రస్తుత సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాలని హైకోర్టు ఆదేశించినందున.. నూతన సీఎ్‌సగా రామకృష్ణారావును నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
అయితే ఆయనకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ల నుంచి గట్టి పోటీ ఎదువుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్న అర్వింద్‌కుమార్ నుంచి పోటీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కానీ, రజత్‌కుమార్ బిహార్‌కు, అర్వింద్‌కుమార్ ఢిల్లీకి చెందినవారు కావడం.. వారికి మైనస్ అవుతుందంటున్నారు. తెలంగాణ, తెలుగు అధికారులకు కీలక పోస్టులు దక్కడం లేదన్న విమర్శలకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే రామకృష్ణారావే బెటర్ ఆప్షన్‌గా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే రామకృష్ణారావుకు రెగ్యులర్ బాధ్యతలు అప్పగిస్తుందా? లేక ఇన్‌చార్జిగా నియమిస్తుందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా.. కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు బుధవారం వెలువడతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
సీనియర్లను దాటేసి...
వాస్తవానికి రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్‌ల కంటే సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా రాష్ట్రంలో ఉన్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన వసుధా మిశ్రా అందరికన్నాసీనియర్.. ప్రస్తుతం ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఆమె తర్వాత 1988 బ్యాచ్‌కు చెందిన రాణి కుముదిని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కానీ, ఆమె పట్ల ప్రభుత్వం ఆసక్తిగా లేదని తెలుస్తోంది. మరొకరు.. రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. కాగా, ఈమె పేరును కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎ్‌సలు శశాంక్ గోయెల్, సునీల్ శర్మ ఉన్నప్పటికీ.. శశాంక్ గోయెల్ ఇటీవలే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల నుంచి వైదొలిగి కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సునీల్ శర్మను సీఎ్‌సగా నియమించే అవకాశాలూ లేకపోలేదు. ఆయన ప్రభుత్వానికి నమ్మిన బంటు. పైగా సోమేశ్‌కుమార్‌ను సీఎ్‌సగా నియమించే సమయంలో సునీల్ శర్మ కూడా చాలా ఆశపడ్డారు. ప్రభుత్వం నిర్దేశించే ఏ పనినీ కాదనకుండా, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఫైళ్లను మూవ్ చేస్తుంటారు. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ మనవడు కావడం, రాష్ట్ర మంత్రులతో సాన్నిహిత్యం ఉండడం ఆయనకు కలిసి వస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఆయనను చివరి ఆప్షన్‌గా భావిస్తున్నట్లు సమాచారం.
ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ..
1991 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారుల్లో ఇద్దరి మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. రజత్‌కుమార్, కె.రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్‌తోపాటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న కేరళ రాష్ట్రానికి చెందిన జి.అశోక్‌కుమార్ 1991 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారులు. వీరిలో రజత్‌కుమార్ బిహార్‌కు చెందిన వ్యక్తి. ఇప్పటికే బిహార్ అధికారులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందంటూ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండడం రజత్‌కుమార్‌కు కొంత మైనస్ అవుతుందన్న చర్చ ఉంది. ఇప్పటిదాకా సీఎ్‌సగా పనిచేసిన సోమేశ్‌కుమార్ కూడా బిహార్‌కు చెందిన వ్యక్తే అయినందున రజత్‌కుమార్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గవచ్చని తెలుస్తోంది. పైగా.. ఇటీవల ఆయన కూతురి వివాహానికి పెట్టిన ఖర్చు విషయంలో వివాదం తలెత్తింది. ఇలా సీనియర్ ఐఏఎ్‌సల విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కె.రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్ మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. రామృష్ణారావు 2016 ఫిబ్రవరి 29 నుంచి ఆర్థిక శాఖను చూస్తున్నారు. అప్పటినుంచి సీఎం కేసీఆర్‌తో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్ ఎలాంటి పని పురమాయించినా, బిల్లులను ముందుగా ఫలానా వారికి క్లియర్ చేయాలని ఆదేశించినా.. ఆయన తు.చ తప్పక పాటిస్తారు. దాదాపు ఏడేళ్లుగా ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తుండడం, ఆర్థిక అంశాలు, రాష్ట్ర బడ్జెట్‌పై పూర్తి పట్టు ఉండడం ఆయనకు కలిసి వస్తున్న అంశాలు.
ప్రభుత్వాన్ని ఆర్థికంగా గట్టెక్కిస్తారనే..
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత బాగా లేదు. ఇలాంటి సంక్షోభ సమయంలో ఆర్థిక అంశాలు తెలిసిన వ్యక్తిని సీఎ్‌సగా నియమిస్తే.. ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తారన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామకృష్ణారావు తెలంగాణలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అనుభవం ఉన్నందున.. ఇక్కడి పరిస్థితులతో మమేకమయ్యారు. రాష్ట్రంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. పైగా ఆయన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. సాధారణంగా కేసీఆర్ తన కోటరీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తారన్న అభిప్రాయాలున్నాయి. ఇలాంటి సానుకూల అంశాలన్నీ కలిసి వస్తున్నందున రామకృష్ణారావును సీఎ్‌సగా నియమించవచ్చని సమాచారం. రామకృష్ణారావు 2025 ఆగస్టు 30న రిటైర్ కానున్నారు. అంటే.. ఆయనకు ఇంకా రెండున్నరేళ్ల సర్వీసు ఉంది. సీఎ్‌సగా నియమిస్తే సుదీర్ఘకాలం పాటు పని చేసే అవకాశాలుంటాయి. ప్రతిసారీ సీఎస్ నియామకం విషయంలో నిర్ణయం తీసుకునే ఇబ్బంది ప్రభుత్వానికి తప్పుతుంది. ఒకవేళ రామకృష్ణారావును సీఎ్‌సగా నియమిస్తే ముగ్గురు సీనియర్ మహిళా ఐఏఎ్‌సలు వసుధా మిశ్రా, రాణి కుముదిని, శాంతికుమారిలను దాటేసినట్లే.
అర్వింద్‌కుమార్ పేరు కూడా..
సీఎస్ పోస్టుకు అర్వింద్‌కుమార్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ప్రభుత్వంలో కీలక మంత్రి అయిన కేటీఆర్‌కు ఆయన సన్నిహితుడు. అర్వింద్‌కుమార్‌పై నమ్మకంతోనే తన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను కేటీఆర్ కొనసాగిస్తున్నారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా కూడా అర్వింద్‌కుమార్ కొనసాగుతున్నారు. కేటీఆర్ అజమాయిషీతోనే పత్రికలకు ప్రకటలు విడుదల చేస్తుంటారు. పైగా.. కేటీఆర్ ఏదైనా సాధించాలనుకుంటే.. ప్రభుత్వంలో ఆయన మాటకు తిరుగుండదు. అర్వింద్‌కుమార్‌ను సీఎస్ చేయాలని కేటీఆర్ పట్టుబడితే.. కేసీఆర్ కూడా అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. కానీ, అర్వింద్‌కుమార్ తెలుగు వ్యక్తి కాకపోవడం ఆయనకు కొంత మైన్‌సగా భావిస్తున్నారు. అయితే అర్వింద్‌కుమార్ పేరును కేటీఆర్ సజెస్ట్ చేసినట్లు తెలిసింది. దీంతో రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్‌లకు సమాన అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. సీఎ్‌సగా ఎవరికి బాధ్యతలు ఇచ్చినా.. ప్రస్తుతానికి ఇన్‌చార్జి సీఎ్‌సగా ఉంటారని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం రెగ్యులర్‌గానే నియమిస్తారని అంటున్నారు.