Preethi : మెడికో ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల
ABN , First Publish Date - 2023-02-25T11:35:43+05:30 IST
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ హాస్పిటల్ వైద్యులు కాసేపటి క్రితం విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా నే ఉందని వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ : వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Dr. Preethi) హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ హాస్పిటల్ (Nims Hospital) వైద్యులు కాసేపటి క్రితం విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా నే ఉందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులుగా ప్రీతికి చికిత్స జరుగుతోంది. అయినా ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంకా ఎక్మో(Ecmo) సపోర్ట్‌తో వెంటిలేటర్(Ventilator)పై ఉంచి ప్రీతికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రీతిని కాపాడేందుకు తీవ్రంగా యత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు డీఎంహెచ్‌వోకు వైద్యుల బృందం నివేదికను అందజేసింది. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది.
కాగా.. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుంది. దీని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్ (Brain)పై మత్తు ఇంజెక్షెన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రీతికి మెరుగైన వైద్యం కోసం వరంగల్ (Warangal) నుంచి హైదరాబాద్ (Hyderabad) నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ (CPR) చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స కొనసాగుతోంది.
అయితే డాక్టర్ ప్రీతి (Dr. Preethi) కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితుడు సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సైఫ్ (Saif)కు కోర్టు 14 రోజుల రిమాండ్ (Remand) విధించింది. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితుడిని ఖమ్మం జైలుకు తరలించారు. ఈ రోజు తెల్లావారుజామున మట్టెవాడ పోలీసులు సైఫ్‌ను అరెస్ట్ (Arrest) చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.