Hyderabad: హైదరాబాద్‌లో అద్దె ఇల్లు కావాలా.. కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు.. గంటల వ్యవధిలో రెడీ.. ఎలాగంటే..
ABN , First Publish Date - 2023-05-27T17:37:26+05:30 IST
హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక మంది బిల్డర్లు, రియల్టర్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వీరి సంఖ్య వందల్లోనే ఉంటుంది. అదే క్రమంలో ఫ్లాట్లు,ఇళ్ళు, విల్లాలు అద్దెకు ఇప్పించే..
హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక మంది బిల్డర్లు, రియల్టర్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వీరి సంఖ్య వందల్లోనే ఉంటుంది. అదే క్రమంలో ఫ్లాట్లు,ఇళ్ళు, విల్లాలు అద్దెకు ఇప్పించే రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు కూడా వందల్లోనే ఉన్నాయి. లోకల్ కంపెనీలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. లగ్జరీ ఫ్లాట్ కావాలా లేక లావిష్ ఇళ్లు కావాలా లేక స్వర్గాన్ని తలపించే విల్లా కావాలంటే వీళ్ళను సంప్రదిస్తే కొన్ని గంటల వ్యవధిలో చూపిస్తారు. ఇది ఆ ఏజెన్సీల ప్రత్యేకత. కస్టమర్లను బట్టి వీరి డీలింగ్ ఉంటుంది.
హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలకు, దేశాలకు చెందిన ఐటీ ఉద్యోగులు, మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగులు అనేక మంది పనిచేస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్‌లో ఉద్యోగం రాగానే లేక బదిలీపై రాగానే వాళ్ళంతట వాళ్ళు వెతుక్కొనే పరిస్థితులు లేవు. ఏదైనా ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టడం లేదా ఆన్లైన్లో అడ్రస్ చూసి ఆ బ్రోకరేజ్ చేసే కంపెనీకి వెళ్లి తమకేమి కావాలో చెప్పుకోవడంతో వాటిని వాళ్ళే ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి బ్రోకరేజ్ సంస్థలు గచ్చిబౌలి, మాదాపూర్‌లో కార్పొరేట్ స్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని లక్షల కోట్లు డీలింగ్ చేస్తుంటాయి. నెట్లో చూస్తే హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే బ్రోకరేజ్ సంస్థలు చాలానే కనిపిస్తాయి. ఇందులో పెద్దగా మోసం చేసే అవకాశం తక్కువగా ఉండడంతో ఆయా కంపెనీల రేటింగ్లను బట్టి, పాత కస్టమర్ల రివ్యూను బట్టి కొత్తగా ఇళ్ళు అద్దెకు తీసుకొనేవారు వారిని అప్రోచ్ అవుతుంటారు.
ముందస్తు ఒప్పందం
నగరంలో ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో పెద్ద పెద్ద ప్రాజెక్టుల వద్దకు ఈ బ్రోకరేజ్ కంపెనీలు వెళ్లి బిల్డర్లతో, లేదా ల్యాండ్ లార్డ్స్, ఫ్లాట్ ఓనర్లతో ముందస్తు ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం లిఖితపూర్వకంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ అది ఓరల్ ఒప్పందమైనా ఆ బిల్డర్‌కు, ఏజెన్సీలకు కో ఆర్డినేషన్ ఉంటుంది. దీంతో ఈ ఏజెన్సీకి తమకు వచ్చే కస్టమర్లను తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ఫ్లాట్లను, ఇళ్ళను, విల్లాను చూపిస్తుంటాయి. ఒక్కొక్క ఏజెన్సీ పదుల సంఖ్యలో తమ ఉద్యోగులను నియమించుకొని ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
ఏరియాకు ఒక ఎగ్జిక్యూటివ్
మల్టీనేషనల్ కంపెనీలు ఏరియాకు ఒక ఎగ్జిక్యూటివ్ చొప్పున రిక్రూట్ చేసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రెంట్, రియల్ ఎస్టేట్ రంగంలో..
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెంటల్ బ్రోకరేజ్ కంపెనీలు కేవలం రెంట్ పర్పస్ వాటినే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. చిన్న చిన్న వెంచర్లు వేయడం, లేదా ప్రైమ్ ఏరియాల్లో చిన్న అపార్ట్మెంట్లను సొంతం చేసుకొని సొంతంగా లీజ్‌కు ఇవ్వడం కమర్షియల్ ప్రాపర్టీలను కొని లీజ్‌కు ఇవ్వడం చేస్తున్నాయి. ఒకపక్క రెంటల్ వ్యాపారం మరో పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంతో తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాయి. ఏది ఏమైనా భాగ్య నగరం కేంద్రంగా రియల్ వ్యాపారంలో అనేక విభాగాలు పనిచేస్తుండగా అందులో ఇలాంటి వ్యాపారం ఒకటి. ఒక ఫ్లాట్ అద్దెకు ఇప్పిస్తే వీరు తీసుకునే ఫీజు ఒక నెల రెంటు ఇరుపక్కలా ఉంటుంది.