Sanjay Arrested: సంజయ్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-04-05T02:32:25+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు.

Sanjay  Arrested: సంజయ్‌ అరెస్ట్‌

అర్ధరాత్రి కరీంనగర్‌లోని ఇంటికి భారీగా బలగాలు

పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు

ఇరు వర్గాల మధ్య తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత

జాతీయ రహదారిపై హైదరాబాద్‌ వైపు తరలింపు

టెన్త్‌ పేపర్ల లీకేజీ కేసులోనే అరెస్టని అనుమానాలు

హిందీ ప్రశ్నపత్రాన్ని పలువురితోపాటు సంజయ్‌కూ

వాట్సాప్‌ చేసిన వరంగల్‌ జర్నలిస్టు ప్రశాంత్‌

కరీంనగర్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్‌ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. అయితే, ఎక్కడికి తీసుకెళ్లారు!? ఎందుకు అరెస్టు చేశారు!? అనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. జాతీయ రహదారిపై హైదరాబాద్‌ వైపు ఆయనను తీసుకెళుతున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తొలుత, అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్‌ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో, బండి సంజయ్‌ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్‌ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. చివరికి, దాదాపు ఒంటి గంట సమయంలో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

1sanjay18knr4.jpg

నిజానికి, వరుసగా రెండో రోజు మంగళవారం కూడా పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సా్‌పలో ప్రత్యక్షమైంది. హనుమకొండలో హెచ్‌ఎంటీవీ బ్యూరో మాజీ చీఫ్‌ బూరం ప్రశాంత్‌ ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అంటూ దానిని వైరల్‌ చేశాడు. హిందీ ప్రశ్న పత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్‌తోపాటు చాలామందికి దానిని ఫార్వార్డ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సోషల్‌ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. ప్రశాంత్‌కు, సంజయ్‌కు సంబంధం ఉందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. అయితే, మంత్రి ఎర్రబెల్లితోపాటు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే విజయ్‌ భాస్కర్‌ తదితరులతో ప్రశాంత్‌ దిగిన ఫొటోలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బయట పెట్టారు. ప్రశాంత్‌ బీజేపీ మనిషంటూ ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడేం చెబుతారంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ను అరెస్టు చేశారేమోనన్న ప్రచారం జరుగుతోంది. కాగా, సంజయ్‌ అరెస్టును గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి ఖండించారు.

జర్నలిస్టు ప్రశాంత్‌ అరెస్టు దుర్మార్గం

హైదరాబాద్‌ : వాట్సా్‌పలో పదో తరగతి ప్రశ్నపత్నం ప్రత్యక్షమైన వ్యవహారంలో జర్నలిస్టు ప్రశాంత్‌తోపాటు మరికొందరిని అరెస్టు చేయడం దుర్మార్గమని గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు లీకేజీ విషయాన్ని బయటిపెట్టిన వ్యక్తులపై నిందవేసి బీజేపీతో సంబంధాలు అంటగడుతుందని మండిపడ్డారు. జర్నలిస్టులకు రాజకీయ నాయకులతో సంబంధాలు సాధారణమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని సూచించారు.

Updated Date - 2023-04-05T02:32:25+05:30 IST