కోకాపేటలో ఆకాశహర్మ్యాలు

ABN , First Publish Date - 2023-04-01T02:50:41+05:30 IST

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్తుల భవనాలు హైదరాబాద్‌లో నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో అత్యంత ఎత్తయిన భవనంలో 49 అంతస్తులు ఉండగా..

కోకాపేటలో ఆకాశహర్మ్యాలు

57 అంతస్తులకు అనుమతులు.. ఇప్పటికే పనులు చేపట్టిన ఓ సంస్థ

3 టవర్ల నిర్మాణానికి మరో దరఖాస్తు

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భవనాలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి31 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్తుల భవనాలు హైదరాబాద్‌లో నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో అత్యంత ఎత్తయిన భవనంలో 49 అంతస్తులు ఉండగా.. బెంగళూరులో 50 అంతస్తుల భవనం ఉంది. వాటిని తలదన్నుతూ ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా.. కోకాపేటలో 57 అంతస్తుల భవనానికి ఇప్పటికే హెచ్‌ఎండీఏ అనుమతులిచ్చింది. దాని పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదే తరహాలో మరో సంస్థ కూడా 56అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. కోకాపేట ప్రాంతంలో భవనాల ఎత్తుపై ఎలాంటి ఆంక్షలూ లేకపోవడంతో హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు చకచకా వచ్చేశాయి. దాంతోపాటు నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, నార్సింగి, నల్లగండ్ల, కొల్లూరు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లలో బహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి. కోకాపేటలో ఇప్పటికే 4.5ఎకరాల విస్తీర్ణంలో గ్రౌండ్‌తో పాటు 57 అంతస్తుల రెసిడెన్షియల్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ ఐదు టవర్లు రానున్నాయి. 57 అంతస్తుల్లో 250 ప్లాట్లు వచ్చేవిధంగా ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఎస్‌ఏఎస్‌ అనే సంస్థ క్రౌన్‌ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటికే ఈ సంస్థ నానక్‌రాంగూడలో భారీ కమర్షియల్‌ ప్రాజెక్టును చేపట్టగా పనులు తుదిదశకు చేరాయి. ఈ 57 అంతస్తుల ప్రాజెక్టు నిర్మాణ పనులు 2025 మొదటి త్రైమాసికం నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఇదే సంస్థ డైమండ్‌ టవర్స్‌ పేరుతో 50 అంతస్తులకు పైగా రెండు టవర్లను పుప్పాలగూడలో నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కోకాపేటలోనే హెచ్‌ఎండీఏ రూపొందించిన గోల్డెన్‌మైల్‌ లేఅవుట్‌లో 4.23ఎకరాల విస్తీర్ణంలో ది ట్రీలైట్‌ అనే ప్రాజెక్టును చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో ఓ టవర్‌ 56 అంతస్తులతో వస్తుండగా.. మరో టవర్‌ను 49 అంతస్తులతో, ఇంకో టవర్‌ను 46 అంతస్తులతో ఒకే సముదాయంలో నిర్మించడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. కోకాపేటలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోనే మరో సంస్థ 55 అంతస్తులతో ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చింది. అదేవిధంగా నల్లగండ్లలో కూడా మరో సంస్థ 50 అంతస్తుల ప్రాజెక్టును చేపట్టింది.

Updated Date - 2023-04-01T02:50:42+05:30 IST