Share News

మొండి కత్తి డ్రామా

ABN , First Publish Date - 2023-10-31T03:28:07+05:30 IST

సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రె్‌సకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓటమి భయంతో నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు.

మొండి కత్తి డ్రామా

సానుభూతి కోసమే దాడి పథకం.. కేసీఆర్‌ దివాలాకోరుతనానికి ఇది పరాకాష్ఠ

దాడి చేసింది బీజేపీ కార్యకర్త.. రఘునందన్‌ సమక్షంలో పార్టీలో చేరాడు

బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై కుట్ర.. కాంగ్రెస్‌ దాడి చేసిందనడం అబద్ధం: రేవంత్‌

హైదరాబాద్‌ సిటీ/గోల్నాక/బర్కత్‌పుర, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రె్‌సకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓటమి భయంతో నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. దుబ్బాకలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడిని పిరికిపందలా కాంగ్రె్‌సపై నెట్టాలని చూస్తున్నారని, చేతనైతే నిరూపించాలని ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు. సోమవారం అంబర్‌పేట, గోల్నాకలో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ‘‘మొండి కత్తితో ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసింది బీజేపీ కార్యకర్త. బీజేపీ, మీరూ ఒక్కటే. ఇద్దరూ కలిసి కాంగ్రె్‌సపై కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాల ప్రచారాలను తిప్పికొడతాం. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్‌ కార్యకర్త కత్తితో దాడి చేశాడని సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధం చెబుతున్నారు. ఆ మొండి కత్తితో దాడి చేసింది బీజేపీ వాడు. రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరాడు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి.. సానుభూతి కోసం వాళ్ల అభ్యర్థి మీద మొండి కత్తితో దాడి చేసి కాంగ్రెస్‌ ఖాతాలో రాయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి దివాలాకోరుతనం, అబద్ధాలకు ఇది పరాకాష్ఠ. దాడి చేసిన మరుక్షణమే ఇంటెలిజెన్స్‌ అధికారులు సమాచారమిస్తారు. దాడి ఎవరు చేశారు..? అందుకు కారణాలేంటి..? వంటి విషయాలను దాచిపెట్టి.. వాళ్లు వాళ్లు నాటకాలాడి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని భయపడి.. ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ మీద కుట్రలు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్యే రఘునందన్‌ బీజేపీ కండువా కప్పుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఇలాంటి నిజాలు బయటపెట్టాలి. ఇవాళ కాంగ్రెస్‌ గెలుస్తుందని, అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు. ఆయన తక్షణమే కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్‌ ఎప్పుడూ హింసను ప్రోత్సహించదు’ అని రేవంత్‌ అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంపై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని, తాము అధికాకంలోకి వచ్చిన తర్వాత డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల్లు, మహాత్మ జ్యోతిరావు ఫూలే స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బెస్త, గంగపుత్రులకు టికెట్ల కేటాయింపులో కొంత అన్యాయం జరిగిందని, అధికారంలోకి వచ్చాక వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌, బీజేపీకు చెందిన పలువురు నాయకులు రేవంత్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.

బీఆర్‌ఎ్‌సవి చిల్లర రాజకీయాలు..

కాంగ్రెస్‌ గూండాలు ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేశారని మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో చేసిన కామెంట్లపై రేవంత్‌ స్పందించారు. ‘కేసీఆర్‌ అంటేనే గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలకు మారుపేరని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఒక ఎంపీపై జరిగిన దాడిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం అయినట్టేనని స్పష్టమవుతోంది. జరిగిన సంఘటనను కాంగ్రె్‌సకు అంటగట్టే మీ కుటిల నీతి ప్రజలకు అర్థమైంది. ఈ సరికొత్త మొండి కత్తి డ్రామాను మీరు, మీ తండ్రి కలిసి రక్తి కట్టిస్తున్న వైనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది. అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన కాంగ్రె్‌సకు మీ తండ్రి లాంటి మరుగుజ్జును ఓడించడం పెద్ద లెక్క కాదు. జరిగిన దాడిని ఖండిస్తున్నా’’ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-31T07:13:02+05:30 IST