Kishan Reddy: ఓఆర్‌ఆర్‌పై కేసీఆర్‌నోరు మెదపరే?
ABN , First Publish Date - 2023-05-08T02:19:38+05:30 IST
ఔటర్ రింగ్‌రోడ్డు కాంట్రాక్టును అతి తక్కువ రేటుకు కేటాయించిన వైనంపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని, ఎందుకు ముఖం చాటేశారని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి నిలదీశారు.
ముందస్తు ఒప్పందాల ప్రకారమే టెండర్‌ను ‘ఐఆర్‌బీ’కి కట్టబెట్టారు..
ఇదేనా గుణాత్మక మార్పు?
ఈ టెండర్ ప్రక్రియపై సీబీఐ విచారణకు సిద్ధమా?
మహారాష్ట్రలో ముంబై–పుణె ఎక్స్‌ప్రెస్‌వేను పదేళ్లకు రూ.8875 కోట్లకు ఇదే సంస్థకు లీజుకిచ్చిన సర్కార్
మన దగ్గర మాత్రం 30 ఏళ్ల లీజు రూ. 7,380కోట్లే మేం అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తాం
ఈ భారీ కుంభకోణంలో ఎవరెవరికి ఎంతెంత వాటా ఉందో తేలాల్సి ఉంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
‘దారి’ దోపిడీ దొంగలకు లెక్కలు అర్థమవుతున్నాయా? ట్విటర్‌లో ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని పోస్ట్ చేసిన రేవంత్
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్‌రోడ్డు కాంట్రాక్టును అతి తక్కువ రేటుకు కేటాయించిన వైనంపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని, ఎందుకు ముఖం చాటేశారని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి నిలదీశారు. ఆదాయం పెరగడమే తప్ప, తగ్గని ఓఆర్‌ఆర్‌పై ఎందుకు ఆదాయాన్ని తగ్గించి కాంట్రాక్టు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆదాయాన్ని కల్వకుంట్ల కుటుంబం ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోందని, ఇదో పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. ఈ భారీ కుంభకోణంపై మౌనం వెనుక మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఔటర్ బంగారు బాతు లాంటిదని, అలాంటి బంగారు బాతుని కేసీఆర్ కుటుంబం చంపేస్తోందని దుయ్యబట్టారు. ‘‘వాస్తవానికి ఓఆర్‌ఆర్ కోసం చేసిన అప్పు తీరిపోయింది.. టోల్ ఫ్రీ పాలసీ అమలు చేయాలి.. కానీ దీనికి విరుద్థంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా, పథకం ప్రకారం.. టెండర్ల ప్రక్రియను తూతూమంత్రంగా నిర్వహించి, ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారమే ఐఆర్‌బీ సంస్థకు టెండర్ కట్టబెట్టారు’’ అని ధ్వజమెత్తారు. ఈ టెండరు ప్రక్రియపై సీబీఐ విచారణకు ... అకౌంటెంట్ జనరల్ చేత ఆడిట్‌కు సిద్ధమా? అని సవాల్ చేశారు. ఓఆర్‌ఆర్ కాంట్రాక్టును 30 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది.? ఏడాదో, ఐదేళ్లో, పదేళ్లో ఎందుకు ఇవ్వలేదు? ఇదేనా గుణాత్మక మార్పు? అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నిజాయితీ ఉంటే ఈ టెండరు కేటాయింపుపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. బాధ్యులు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి, మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ఓఆర్‌ఆర్‌పై ఏడాదికి రూ.415 కోట్లు టోల్ ఆదాయం వస్తోంది. ప్రస్తుతం దీన్ని నిర్వహిస్తున్న ఈగల్ ఇన్ ఫ్రా కంపెనీ చెల్లిస్తున్న బేస్‌ప్రైస్‌ను పరిగణనలోకి తీసుకుని ఏడాదికి 5 శాతం పెంచి చూసుకుంటే.. 30 ఏళ్లకు హెచ్‌ఎండీఏకు 30 వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. 10 శాతం ఆదాయం పెరిగితే 30 ఏళ్లలో రూ.75 వేల కోట్లు, 15 శాతం అభివృద్థి లెక్కిేస్త.. రూ.2 లక్షల కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. ఈ పరిస్థితిలో అధికారం ఉన్నప్పుడే వెనకేసుకుందామని ఆలోచనతోనే బీఆర్‌ఎస్ సర్కారు ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్టు కనిపిస్తోంది’’ అని విమర్శించారు.
మహారాష్ట్రలో అలా..
ఓఆర్‌ఆర్ లీజు దక్కించుకున్న ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ సంస్థే.. ముంబై–పూణే ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టునూ నిర్వహిస్తోందని.. ఈ హైవేను మహారాష్ట్ర సర్కారు కేవలం 10 ఏళ్ల 2 నెలలకు మాత్రమే రూ. 8,875 కోట్లకు లీజుకు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అలాంటిది ఇక్కడ ఓఆర్‌ఆర్‌ను ఏకంగా 30 ఏళ్లకు కేవలం రూ.7,380 కోట్లకు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఎవరి మేలు కోసం, ఎవరికి లాభం చేకూర్చడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో చెప్పాలని నిలదీశారు. బిడ్డర్‌ను ప్రకటించిన తర్వాత బేస్‌ప్రైస్ ప్రకటించాల్సి ఉందని.. కానీ, ఎందుకు ప్రకటించలేదని ధ్వజమెత్తారు. ఎన్‌హెచ్‌ఏఐ గైడ్ లైన్స్ ప్రకారమే బిడ్ వేశామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందిగాని.. అది ్టసరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లవరకూ లీజుకు ఇవ్వొచ్చని అందులో తొలుత పేర్కొన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితుల ఆధారంగా, పెరుగుతున్న ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసి లీజు పరిమితిని 15 నుంచి 30 ఏళ్ల వరకూ నిర్ణయించుకోవచ్చని మార్పు చేసినట్లు వెల్లడించారు. దానికి అనుగుణంగానే దేశంలో చాలా చోట్ల 10 నుంచి 15 ఏళ్లకు మాత్రమే లీజుకు ఇస్తున్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ‘‘హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 వరకే ఆమోదం పొందింది. ఆ తర్వాత మళ్లీ సర్వే చేసి.. కొత్త మాస్టర్ ప్లాన్ వేయాలి. మరి 2031 వరకే మాస్టర్ ప్లాన్ ఉంటే.. దానికి మించి 21 ఏళ్లకు ఓఆర్‌ఆర్ ను కట్టబెట్టడం ఏంటి. ఇది హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ కు విరుద్థం. క్రిసిల్ స్థానంలో తమకు అనుకూలమైన నివేదిక కోసం మాజర్స్ అనే సంస్థను ఎందుకు నియమించారో తెలియజేయాలి’’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే.. ఓఆర్‌ఆర్ టెండర్‌కు తుది గడువు ఏప్రిల్ 11 అని.. మాకున్న సమాచారం ప్రకారం ఆరోజు పేపర్ మీద ఉన్నది రూ.7,272 కోట్లు మాత్రమేనని, కానీ ఏప్రిల్ 28న దాన్ని రూ.7,380 కోట్లకు మార్చారని.. 100 కోట్లు ఎలా పెరిగిందని నిలదీశారు.
ప్రైవేటు వ్యక్తులతో ఒప్పందం మేరకే...
ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్న అనేక భూ వివాదాలు కేసుల్లో ప్రైవేటు వ్యక్తులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అందుకే, సమర్థంగా వాదించకుండా, ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా పనిచేస్తోందని పేర్కొన్నారు. న్యాయస్థానంలో సరైన సాక్ష్యాలు చూపించకుండా, సమర్థంగా వాదనలు వినిపించకుండా వివాదాల్లో ఉన్న వేలాది ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని, దీని ద్వారా వేలకోట్లు సంపాదించుకుంటున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ భూముల వ్యవహారంపై బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామని, ప్రతీ గజం భూమికి లెక్కగట్టి వసూలు చేస్తావని ప్రకటించారు.
‘దారి’ దోపిడీ దొంగలకు..ఇప్పటికైనా లెక్కలు అర్థమవుతున్నయా?: రేవంత్
హైదరాబాద్, మే 7(ఆంధ్రజ్యోతి): ‘‘దారి దోపిడీ దొంగలకు ఇప్పటి కైనా లెక్కలు అర్థమవుతున్నాయా’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. లేనిపక్షంలో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఔటర్ రింగు రోడ్డు టోల్ వసూళ్లను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంపై ‘బంగారు బాతు బలి’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేసి ఈ ప్రశ్న వేశారు.