Telangana University VC: ఏసీబీ వలలో వీసీ

ABN , First Publish Date - 2023-06-18T02:25:30+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయంలో వీసీ వర్సెస్‌ ఈసీ సభ్యులు అన్నట్లుగా రెండు నెలలుగా జరుగుతున్న వివాదం కీలక మలుపు తీసుకుంది.

Telangana University VC: ఏసీబీ వలలో వీసీ

తెలంగాణ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌గుప్తా అరెస్టు

అదనపు పరీక్ష కేంద్రం అనుమతి కోసం రూ.50 వేలు డిమాండ్‌

తార్నాకలోని నివాసంలో లంచం

ఉన్నతస్థాయి నిర్ణయంతోనే ఉచ్చు?

దగ్గరి వ్యక్తుల ద్వారానే తతంగం!

వర్సిటీలో కీలక పత్రాల స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ/తార్నాక, నిజామాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో వీసీ వర్సెస్‌ ఈసీ సభ్యులు అన్నట్లుగా రెండు నెలలుగా జరుగుతున్న వివాదం కీలక మలుపు తీసుకుంది. ఈసీతో పొసగకుండా, సమావేశాలకు హాజరవ్వకుండా వివాదాస్పద రీతిలో వ్యవహరిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా ఏసీబీకి చిక్కారు. అదనపు పరీక్ష కేంద్రానికి అనుమతిచ్చేందుకు శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఈసీ మీటింగ్‌ జరిగే రోజే ఆయన అరెస్టు కావడం తెలంగాణ వర్సిటీలో తీవ్ర కలకలం సృష్టించింది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా, ఆర్మూర్‌లోని శ్రీషిర్డీ సాయి ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు దాసరి శంకర్‌కు చెందిన కళాశాలలో అదనపు పరీక్ష కేంద్రం ఏర్పాటుకు అనుమతి కోసం రవీందర్‌ గుప్తా లంచంగా రూ. 50వేలు డిమాండ్‌ చేశారు. దీంతో ఈ నెల 14న దాసరి శంకర్‌ ఏసీబీ అధికారులకు పిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు శనివారం ఉదయం తార్నాకలోని గుప్తా నివాసం పరిసరాల్లోకి చేరుకున్నారు. దాసరి శంకర్‌ నుంచి గుప్తా రూ.50 వేలు తీసుకోగానే ఇంట్లోకి ప్రవేశించారు. మాస్టర్‌ బెడ్‌రూమ్‌లోని అల్మరాలో దాచిన రూ. 50వేలను గుర్తించారు. చాలాసేపటి వరకు ఇంట్లో సోదాలు నిర్వహించారు.

ఏసీబీకి చెందిన మరో బృందం తెలంగాణ విశ్వవిద్యాలయానికి వెళ్లి తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌లో ఉన్న పరీక్షల నియంత్రణ అధికారిని క్యాంపస్‌కు పిలిపించి వివరాలను సేకరించారు. గుప్తాను అరెస్టు చేసి ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టుకు తరలించారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గుప్తా ‘నో కామెంట్‌’ అని వ్యాఖ్యానించారు. గుప్తా ఆస్తులపై దర్యాప్తు చేయనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కాగా, రెండు నెలలుగా ఈసీ సమావేశాలకు వీసీ హాజరు కావడం లేదు. నిరుడు ఈసీ సభ్యులు తమ సమావేశంలో రిజిస్ట్రార్‌గా నిర్ణయించిన యాదగిరిని నియమించేందుకు గుప్తా అంగీకరించలేదు. నెలరోజులుగా వర్సిటీలో జీతాలతో పాటు ఇతర చెల్లింపులనూ వీసీ నిలిపివేయడంతో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థులు ఆందోళనకు దిగారు. చివరకు దిగొచ్చిన వీసీ, యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు వీసీ గుప్తా లేకుండానే హైదరాబాద్‌లోని రుసాభవన్‌లో ఈసీ సమావేశం జరిగింది. గతం లో అనుమతులు లేకుండా పని చేసిన ముగ్గురు రిజిస్ట్రార్లపై చర్యలు చేపట్టేందుకు ఈసీ కమిటీ చర్చించింది. పలు సభ్యుల నియామకంపై, పీహెచ్‌డీ అడ్మిషన్‌లపైనా ప్రత్యేక కమిటీ ద్వారా దర్యాప్తు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పదోన్నతులకు అర్హులైన ప్రొఫెసర్లకు అవకాశం ఇచ్చేలా కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని, పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ చేయాలని నిర్ణయించారు.

ఇంచార్జి వీసీని నియమించే అవకాశం

రవీందర్‌ గుప్తకు వీసీగా రెండేళ్ల సర్వీసు పూర్తయింది. ఇంకా సంవత్సరం సర్వీసు మాత్రమే ఉంది. ఈలోపే ఆయన పట్టుబడడంతో త్వరలోనే ఇన్‌చార్జి వీసీని నియమించే అవకాశాలున్నాయి.

పథకం ప్రకారమేనా?

వీసీ గుప్తా అరెస్టు వార్త తెలియగానే తెలంగాణ వర్సిటీలో పరిపాలన సిబ్బంది మినహా వివిధ డిపార్ట్‌మెంట్‌లలో ఉన్న ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది వెళ్లిపోయారు. అయితే విద్యార్థి సంఘాలతో పాటు కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆయన పట్టుబడడం వల్ల విశ్వవిద్యాలయంకు మంచి రోజులు వస్తాయని విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించారు. ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయం వల్లే ఏసీబీ వలకు వీసీ చిక్కినట్లు, పథకం ప్రకారం తతంగమంతా ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారానే నడిపించినట్లు చెబుతున్నారు. విశ్వవిద్యాలయాల పరిధిలో ఆర్నెల్ల క్రితం డెయిలీ వేజెస్‌ సిబ్బంది వ్యవహారంలో భారీగా డబ్బులు తీసుకోవడం కూడా ఈ తనిఖీలకు కారణమని చెబుతున్నారు. సిబ్బంది ధర్నాలు చేయడం, విజిలెన్స్‌ అధికారులకు పూర్తి వివరాలు ఇవ్వడం వల్లే ఏసీబీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-06-18T05:38:24+05:30 IST