Blood Donation: ఆ రక్తదానం.. నిరర్థకం!

ABN , First Publish Date - 2023-05-07T02:22:38+05:30 IST

తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా నేడు గోలీ పడాల్సిందే. చిన్నగా ఒళ్లు వేడెక్కితే వెంటనే మాత్ర మింగేయాల్సిందే.

Blood Donation: ఆ రక్తదానం.. నిరర్థకం!

విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వినియోగించిన దాతల రక్తం నిరుపయోగమే: వైద్య నిపుణులు

ప్రతి 100 మందిలో 15 మంది వరకూ ఉంటున్నారని వెల్లడి

అనారోగ్యకరమైన జీవనశైలి, నిద్రలేమి, రక్తంలో ఇన్ఫెక్షన్‌, మద్యం, మత్తు పదార్థాల వినియోగం ఉన్నా దానం వృథానే

రక్తం కొరతతో తలసేమియా బాధితుల అవస్థలు

హైదరాబాద్‌ సిటీ, మే 6 (ఆంధ్రజ్యోతి): తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా నేడు గోలీ పడాల్సిందే. చిన్నగా ఒళ్లు వేడెక్కితే వెంటనే మాత్ర మింగేయాల్సిందే. ఇదీ నేడు నెలకొన్న వాస్తవ పరిస్థితి. యాంటీబయాటిక్స్‌ను ఇలావిచ్చలవిడిగా వినియోగించడం పట్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని అధికంగా వాడితే, మున్ముందు ఔషధాలకు లొంగని మొండి వైరస్‌లు, బ్యాక్టీరియాలు పుట్టుకొస్తే చేతులెత్తేయాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వాడకం ఏమీ మందగిస్తున్న సూచనలు కనిపించడం లేదు. వైద్యుల సలహా లేకుండానే ఔషధ దుకాణాల్లో ఎవరికి వారు ఔషధాలు కొనేస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువగా

1PILLS.gif

యాంటీబయాటిక్స్‌ వినియోగించే దేశాల జాబితాలో భారత్‌ అగ్రస్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు ఆ యాంటీబయాటిక్స్‌ ప్రభావం రక్తదానంపైనా పడుతోంది. అత్యవసర సమయంలో అర్హులకు దాతల రక్తం ఉపకరించాల్సి ఉండగా.. అతిగా యాంటీబయాటిక్స్‌ వాడిన వారి రక్తాన్ని వైద్యులు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు! మూడు నాలుగు సార్లు యాంటీబయాటిక్స్‌ వినియోగించిన వారిని రక్తదానం చేయవద్దని దాతల కౌన్సిలింగ్‌లో తేల్చిచెబుతున్నారు. ప్రతి వందమందిలో ఇలా విచ్చలవిడిగా గోలీలు వాడిన వారు 5 నుంచి 15 మంది వరకు ఉంటున్నారు. వారి రక్తంలో డ్రగ్స్‌ రెసిస్టెన్సీ(ఔషధాలకు లొంగని మొండి ఇన్ఫెక్షన్‌) పెరగడంతో, ఆ రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం పెద్ద సమస్యగా తయారైందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఏదైనా ఇన్ఫెక్షన్‌ ఉంటేనే యాంటిబయాటిక్స్‌ను వాడి ఉంటారు కాబట్టి, అటువంటి దాతల రక్తాన్ని రోగులకు ఎందుకు వినియోగిస్తామన్నది వారి ప్రశ్న. ఇక యువత జీవన శైలి కారణంగానూ రక్తంలో తగిన నాణ్యత ఉండటం లేదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షల్లో వెలుగుచూస్తున్న లోపాలు

రక్త సేకరణ కోసం వివిధ సంస్థలు, ఆస్పత్రులు శిబిరాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎలాంటి పరీక్షలు చేయకుండా స్వీకరిస్తున్నా.. రోగికి ఎక్కించే ముందుగా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. అందులో స్వల్ప స్థాయి ఇన్ఫెక్షన్‌ ఉన్నా అది నిరుపయోగమేనని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేమి సమస్యలు ఉన్నవారు, మద్యం, నిషేధిత మత్తు పదార్థాలు అలవాటు ఉన్నవారినుంచి సేకరించిన రక్తం తిరస్కరణకు గురవుతోంది. అదే విధంగా యాంటీబయాటిక్స్‌ వాడుతున్నవారు, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌, కేన్సర్‌, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ వంటి సమస్యలున్న వారి నుంచి సేకరించిన రక్తాన్ని వినియోగించడం లేదు. ఇలా దాదాపు 5 నుంచి 15 శాతం మేర దాతల రక్తం పనికిరాకుండాపోతోందని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫలితంగా.. రక్తం అత్యవసరమైన తలసేమియా బాధితుల వంటి వారికి ఇది చాలా ఇబ్బందిగా పరిణమిస్తోంది. ‘‘దాతలలో అప్పటికే థైరాయిడ్‌, మధుమేహం వంటివి ఉంటే.. ఆ రక్తం తీసుకున్నవారికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తలసేమియా బాధితులనే తీసుకుంటే.. వారికి అప్పటికే రక్తం తక్కువగా ఉండటం వలన బలహీనంగా ఉంటారు. ఇన్ఫెక్షన్‌తో కూడిన రక్తాన్ని ఎక్కించడం ద్వారా.. వారి ప్రాణాలకు ముప్పు తీసుకురాలేం’’ అని నగరానికి చెందిన డాక్టర్‌ సుమన్‌ జైన్‌ వివరిస్తున్నారు. జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వ్యాధులకు యాంటిబయాటిక్‌ వినియోగించే వారిలో ఇన్ఫెక్షన్‌ ప్రబావం వారం నుంచి పది రోజుల పాటు ఉంటుందని, అలాంటి వారు రక్త దానం చేయకపోవడమే మంచిదని ఆయన సూచిస్తున్నారు. ‘‘కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు బయటి ఆహారం ఎక్కువగా తింటుంటారు. వారిలో హెపటైటిస్‌ వంటి జబ్బులు ఎక్కువగా ఉంటున్నాయి. నాణ్యమైన, మెరుగైన ఆహారం తీసుకోకపోవడం వల్ల తెల్లకామెర్లు, పచ్చకామెర్ల వంటి జబ్బులు సోకుతున్నాయి. ఆ విషయం తెలియక వారు రక్తం దానం చేస్తున్నారు. పరీక్షల సమయంలో అవి వెలుగుచూస్తున్నాయి. రక్తదానం చేయాలనుకునేవారు ముందుగా వైద్యులను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకున్న తర్వాతనే దానం చేయాలి’’ అనేది వైద్య నిపుణుల మాట. కాగా.. దాతలు రక్తం దానం చేసిన తర్వాత అయిదు రకాల పరీక్షలు చేస్తామని టీఎస్‌సీఎస్‌ సాంకేతిక నిపుణుడు చంద్రశేఖర్‌ తెలిపారు. తెల్లకామెర్లు, పచ్చకామెర్లు, మలేరియా, హెచ్‌ఐవీ, వీడీఆర్‌ఎల్‌ (లైంగిక వ్యాధి)కు సంబంధించిన పరీక్షలు చేస్తామని, అందులో పాజిటివ్‌ వస్తే అలాంటి రక్తాన్ని తిరస్కరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

తలసేమియా బాధితులకు ఇబ్బందికరం

యువతలో అనారోగ్యకరమైన జీవనశైలితో పాటు వ్యాధులు పెరగడం వలన రక్త దానం చేయడంలో తీవ్ర ఆటంకాలు ఎదరువుతున్నాయని తలసేమియా–సికిల్‌ సెల్‌ సొసైటీ సంయుక్త కార్యదర్శి అలీమ్‌ బేగ్‌ తెలిపారు. ‘‘మా సొసైటీలో 3వేల మంది బాధితులున్నారు. నెలకు సుమారు 2 వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. రక్తనిధుల్లో నిల్వల కొరత, ఇన్‌ఫెక్షన్‌ ఉన్న రక్తాన్ని తిరస్కరించడం వంటి కారణాల వల్ల తలసేమియా బాధితులకు రక్తం దొరకడం లేదు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-05-07T02:22:38+05:30 IST