TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసు విచారణ 24కు వాయిదా

ABN , First Publish Date - 2023-04-11T15:32:32+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విచారణ వాయిదా పడింది.

TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసు విచారణ 24కు వాయిదా

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్(TSPSC Leakage Case) కేసు విచారణ వాయిదా పడింది. మంగళవరం పేపర్ లీక్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐ (CBI)కి అప్పగించాలని వేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ దన్క వాదనలు వినిపించారు. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఇద్దరం మాత్రమే నిందితులు అని ఐటీ మినిస్టర్ ఎలా చెపుతారని... దీనిపై అనుమానాలు ఉన్నాయని వాదించారు. సీబీఐ ద్వారా విచారణ జరిపితేనే నిజాలు బయటకి వస్తాయని వివేక్ తన్క వాదనలు వినిపించారు. ప్రభుత్వ కనుసన్నల్లో దర్యాప్తు జరుగుతున్న సిట్‌పై నమ్మకం లేదని అన్నారు. ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో మంత్రి ఎలా చెబుతారని అడిగారు. సిట్ దర్యాప్తు చిన్న ఉద్యోగులకే పరిమితం అవుతోందని వివేక్ వాదించారు. విదేశీ లావాదేవీలు కూడా ఉన్నట్టు ఈడీ చెబుతున్నందున సిట్ దర్యాప్తు సరిపోదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రశ్న పత్రాల లీకేజీ దర్యాప్తు సీబీఐకి ఇవ్వాలని వివేక్ కోర్టును కోరారు.

ఏజీ వాదనలు ఇవే...

ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది నిందితుల్లో 17మందిని అరెస్ట్ చేశామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. మరో నిందితుడు న్యూజిలాండ్‌లో ఉన్నాడని త్వరలో విచారణ చేస్తామని చెప్పారు. నిందితులను చట్ట ప్రకారం అరెస్ట్ చేసి జైలుకు పంపించామని చెప్పారు. న్యూజిలాండ్‌లో ఉన్న మరో నిందితుడి అరెస్ట్‌కు ప్రయత్నం జరుగుతోందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని ఏజీ చెప్పారు. పరీక్షల నిర్వహణ సంబంధం ఉన్న వారిని పరీక్షలకు అనుమతించారా అంటూ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణ ఔట్ సోర్సింగ్ బాధ్యతలు ఏ సంస్థకు ఇచ్చారని ధర్మాసనం అడిగింది. ఆపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.

Updated Date - 2023-04-11T15:44:24+05:30 IST