TSRTC: హైదరాబాద్‌లోని 10 రద్దీ రూట్లలో లేడీస్ స్పెషల్ సిటీ బస్సులు.. ఏఏ రూట్లంటే..

ABN , First Publish Date - 2023-03-04T12:20:12+05:30 IST

మహిళలు, విద్యార్థినులకు టీఎస్‌ఆర్టీసీ(TSRTC) శుభవార్త (Good News)..

TSRTC: హైదరాబాద్‌లోని 10 రద్దీ రూట్లలో లేడీస్ స్పెషల్ సిటీ బస్సులు.. ఏఏ రూట్లంటే..

హైదరాబాద్‌ సిటీ,(ఆంధ్రజ్యోతి): మహిళలు, విద్యార్థినులకు టీఎస్‌ఆర్టీసీ(TSRTC) శుభవార్త (Good News)చెప్పింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) కానుకగా గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని మహిళలు, విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను (Special Buses) అందుబాటులోకి తీసుకొచ్చింది. నగర శివారు ప్రాంతాల్లో చదివే విద్యార్థినులకోసం లేడీస్ స్పెషల్ (Ladies Special) బస్సులను నడుపుతోంది. విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ(TSRTC) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.

10 రూట్లలో 85 సర్వీసులు..

గ్రేటర్‌ జోన్‌లోని 10 రద్దీ రూట్లలో 85 మహిళా స్పెషల్‌ సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఎల్‌బీనగర్‌-ఇబ్రహీంపట్నం, బడంగ్‌పేట-మిథానీ, దిల్‌సుఖ్‌నగర్‌-అబ్దుల్లాపూర్‌మెట్‌, మజీద్‌పూర్‌, మెహిదీపట్నం-శంకర్‌పల్లి, మొయినాబాద్‌, శంషాబాద్‌-వర్థమాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ సెక్టార్‌, మేడ్చల్‌-మియాపూర్‌, సుచిత్ర, గండిమైసమ్మ సెక్టార్‌, ఈసీఐఎల్‌ నుంచి ఉప్పల్‌, ఘట్‌కేసర్‌ సెక్టార్‌, బోయిన్‌పల్లి-సుచిత్ర, మేడ్చల్‌ సెక్టార్‌, దూలపల్లి క్రాస్‌రోడ్‌-బహుదూర్‌పల్లి సెక్టార్‌, ఉప్పల్‌ ఎక్స్‌రోడ్‌ నుంచి ఆరాంఘర్‌ రూట్లలో ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహిళా స్పెషల్‌ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

రద్దీ రూట్లలో ప్రయాణికుల డిమాండ్లకు అనుగుణంగా బస్సుల ట్రిప్పులు పెంచాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ గ్రేటర్‌ అధికారులను అదేశించారు. శివారు ప్రాంతాలకు సేవలు విస్తరిస్తూ ప్రయాణికులను పెంచుకునే దిశగా చర్యలు చేపట్టారు. 10 నిమిషాలకు ఓ బస్సు కళాశాలల రూట్లకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు గ్రేటర్‌ అధికారులు తెలిపారు.

నగర శివారు ప్రాంతాలను 12 కారిడార్‌లుగా విభజించి 350 వరకు బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో నిత్యం కాలేజీలకు దాదాపు 44 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో మూడో వంతు విద్యార్థులు బస్‌పాస్‌లు తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. అందుకు అనుగుణంగా 8 ట్రిప్పులను అదనంగా నడుపుతున్నామన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్నీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు.

మహిళలు, విద్యార్థినుల సురక్షిత ప్రయాణం కోసమే ప్రారంభించిన ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.

Updated Date - 2023-03-04T12:57:42+05:30 IST