Kishan Reddy: కమల సారథి కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-07-05T02:25:43+05:30 IST

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో, చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ కోరుకున్నట్లుగానే ఆయనకు కీలక పదవి దక్కింది.

 Kishan Reddy: కమల సారథి కిషన్‌రెడ్డి

ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల..

ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ ప్రకటన

ఈటల పార్టీని ముందుండి నడిపిస్తారంటూ సంకేతాలు

కిషన్‌ రెడ్డి చేదోడు వాదోడుగా ఉంటారంటూ ప్రచారం

సీఎం అభ్యర్థి ఈటల అంటున్న ఆయన సన్నిహిత వర్గాలు

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి పదవుల్లో మొండిచేయి

కేసీఆర్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ప్రశ్నించినందుకేనా!?

కేంద్రంలో సహాయ మంత్రిగా సంజయ్‌కు చాన్స్‌?

రెండ్రోజులపాటు ఢిల్లీలో పార్టీ పెద్దలతో వరుస భేటీలు

సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనకు నడ్డా హామీ

అధ్యక్షుడిగా సంజయ్‌ తొలగింపుపై శ్రేణుల ఆగ్రహావేశాలు

సాహో అంటూనే హఠాత్తుగా తొలగించడంపై విమర్శలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనన్న వాదనకు ఊతమని ఆవేదన

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో, చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ కోరుకున్నట్లుగానే ఆయనకు కీలక పదవి దక్కింది. కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న ఈటలకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఈటలతో కలిసి విస్పష్టంగా వివరించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి మాత్రం మొండిచేయి చూపింది. ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఇక, అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బండి సంజయ్‌కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెరసి, బీజేపీలో మార్పులు చేర్పులపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అధిష్ఠానం తెరదించింది. మరోవైపు, కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి కొనసాగుతారా లేదా!? అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది. వాస్తవానికి, రాష్ట్ర పార్టీ బాధ్యతల పట్ల కిషన్‌ రెడ్డి సుముఖంగా లేరు. కేంద్ర మంత్రి పదవి పట్ల సంజయ్‌ విముఖత ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, జాతీయ నాయకత్వం నిర్ణయం క్యాడర్‌లో మరింత అయోమయాన్ని సృష్టించేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌ నాయకత్వ శైలిపై పలు ఫిర్యాదులు రావడంతో ఆయన స్థానంలో కిషన్‌ రెడ్డిని నియమిస్తే అన్ని వర్గాలను కలుపుకొనిపోతారని అధిష్ఠానం భావించడమే తాజా మార్పులకు కారణమని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటలే రాష్ట్రంలో పార్టీని విజయ పథంలో నడిపించే దిశగా చర్యలు చేపడతారని, ఆయనకు కిషన్‌ రెడ్డి చేదోడు వాదోడుగా ఉంటారని తెలిపాయి. రాష్ట్ర రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న కిషన్‌ రెడ్డి ఎలాంటి అసమ్మతికి ఆస్కారం లేకుండా ఈటలకు పూర్తి సహకారం అందిస్తారని అధిష్ఠానం భావిస్తోందని. ఈ రీత్యా ఈటలే రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన సారథిగా ఉంటారని, గతంలో ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మోదీ ప్రధాని అయినట్లే, ఈటల కూడా బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలో ఉంటారని ఆయన సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా రాష్ట్రంలో ఈటల పాత్ర కీలకం కానుంది. హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఈటలకు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సుమారు 20 ఏళ్లపాటు కలిసి పనిచేసిన ఈటలకు ఆయన బలం, బలహీనతలు తెలిసినందున ఈ పదవి కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌, బీఆర్‌ఎ్‌సలను దీటుగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలను రచించే సామర్థ్యం ఆయనకు ఉందని అంచనా వేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతలతో ఈటలకు ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయని, అసంతృప్త నేతలు పార్టీలోకి చేరేందుకు ఈ పదవి మార్గం సుగమం చేస్తుందని విశ్లేషిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో ఈటల పాత్ర కీలకం కానుందని, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి పార్టీకి విజయం సాధించిపెట్టే సత్తా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్ఠానం నిర్ణయంతో బీసీ వర్గాలు కూడా పార్టీకి మరింత దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో, ఈటలకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ పదవిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ పదవిని చింతల రామచంద్రా రెడ్డి నిర్వహించారని, ఈటల స్థాయికి ఇది తగిన పదవి కాదని విశ్లేషిస్తున్నారు. టికెట్లు, బీఫాంలు ఇవ్వడమంతా రాష్ట్ర అధ్యక్షుడి చేతిలోనే ఉంటుందని, మరో పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకే ఈటలకు ఈ పదవి ఇచ్చినట్లుందని బీజేపీలోనే కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికలు నాలుగైదు నెలల్లోనే జరగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని విజయ పథాన నడిపించడం కిషన్‌ రెడ్డికి కత్తి మీద సామేనని, అంతర్గత పోరును పరిష్కరించడం ఆయనకు సవాలేనని విశ్లేషిస్తున్నాయి.

Untitled-6.jpg

సంజయ్‌కు సహాయ మంత్రి పదవి!?

బీజేపీని తెలంగాణలో ఎవరూ ఊహించని స్థాయికి తీసుకెళ్లి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్ష పదవి పోగొట్టుకున్న బండి సంజయ్‌ విషయంలో అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకోబోతోంది? అన్నదే పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను మంగళవారం బండి కలిశారు. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌ ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతో్‌షను కూడా కలిశారు. ఈ సందర్భంగా, సముచిత స్థానం కల్పిస్తామని సంజయ్‌కి నడ్డా హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన బండికి ఎలాంటి పదవీ ఇవ్వకపోతే పార్టీ శ్రేణులు నిరుత్సాహపడతాయని, వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రజల్లోకి కూడా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే.. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు సహాయ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన బండి

మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి, కోశాధికారి శాంత కుమార్‌తో కలిసి బండి సంజయ్‌ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతిధులు అక్కడికి చేరుకున్నారు. పార్టీ పెద్దలను కలిసిన తర్వాత సంజయ్‌ విలేకరులతో మాట్లాడతారని అనుకున్నారు. రెండు గంటలపాటు వేచి చూశారు. కానీ.. వెంట వచ్చిన వారితో మీడియా కంటపడకుండా సంజయ్‌ వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన కాసేపటికే.. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటలను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

పార్టీ పట్ల విధేయత.. వివాదాలకు దూరం

1977లో జనతాపార్టీలోకి

2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

2010-14లో ఉమ్మడి ఏపీ అధ్యక్ష బాధ్యతలు

2014-16వరకు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ/బర్కత్‌పుర, జూలై 4 (ఆంధ్రజ్యోతి): విధేయత, వివాదరహితుడు, క్రమశిక్షణ కలిగిన నేత అన్న ముద్రనే కిషన్‌ రెడ్డికి మళ్లీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నారు. కిషన్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010-2014 వరకు, తెలంగాణలో 2014-16 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్నారు. కిషన్‌రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామం. ఆయన 1960 జూన్‌ 15న జన్మించారు. 1977లో జయప్రకాశ్‌నారాయణ్‌ స్ఫూర్తితో జనతాపార్టీలో చేరారు. 1980లో బీజేపీలో సాధారణ కార్యకర్తగా చేరి 1980-81లో రంగారెడ్డి జిల్లా బీజేవైఎం కన్వీనర్‌గా పనిచేశారు. 2002-2004 లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడయ్యారు. 2004లో హిమాయత్‌నగర్‌ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2021 జూలై వరకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని 2021 జూలైలో కేంద్ర పర్యాటక మంత్రిగా నియమించారు. కిషన్‌రెడ్డి 2010-14 వరకు ఉమ్మడి ఏపీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, 2014-16 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా మళ్లీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

మార్పు బాధాకరం: విజయశాంతి

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నింపిన బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించడం బాధాకరమని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. అయితే, పార్టీ ఆయనకు మరింత మంచి బాధ్యతను అప్పగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల మనోభావాలను అగ్ర నాయకత్వం గుర్తిస్తుందని విశ్వసిస్తున్నామని విజయశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

2.jpg

సంజయ్‌ తొలగింపు.. బీజేపీ నేత ఆత్మహత్యాయత్నం

ఖమ్మం క్రైం, జూలై 4: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తొలగించడంతో ఆ పార్టీ ఖమ్మం నగర కమిటీ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్‌ మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుని ఉరివేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన కూతురు గమనించి కేకలు వేయడంతో.. కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి తలుపులు పగలగొట్టి శ్రీనివా్‌సను బయటకి తీసుకొచ్చారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ‘‘బండి సంజయ్‌ అన్నను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఎవరి మీద కోపంతో కాదు.. నేను అన్నపై పెంచుకున్న ప్రేమతో ఆత్మహత్య చేసుకుంటున్నాను. జై బీజేపీ.. జై బండి సంజయ్‌ అన్నా. ఇక సెలవు’’ అంటూ రాసిన సూసైడ్‌ నోట్‌ శ్రీనివాస్‌ వద్ద లభించింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పలువురు ఆస్పత్రికి వెళ్లి శ్రీనివా్‌సను పరామర్శించారు. ఐదేళ్లుగా బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌.. బండి సంజయ్‌కి వీరాభిమానిగా మారారు.

సంజయ్‌ను తప్పించడంపై ఆగ్రహావేశాలు

నిన్నటి వరకూ సాహో సంజయ్‌ అంటూ భుజం తట్టి.. ఇప్పుడు అవమానకర రీతిలో తొలగించడాన్ని బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కరోనా సమయంలో బాధ్యతలు చేపట్టి.. బీఆర్‌ఎ్‌సతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పార్టీని విస్తరించిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై బీజేపీలోనే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆయనను ఎందుకు తొలగించారన్న విస్పష్ట కారణాన్ని కూడా చెప్పడం లేదని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని సోషల్‌ మీడియాలో లక్షలాది సంఖ్యలో తప్పుపడుతున్నారు. కష్టపడే నాయకుడికి దక్కిన ప్రతిఫలం ఇదేనా? అంటూ నిలదీస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనంటూ కాంగ్రెస్‌ నేతలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారని, వాటికి బలమిచ్చేలా పార్టీ అధినాయకత్వం తాజా నిర్ణయాలు ఉన్నాయని ఆ పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడంపై బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విమర్శలకు మరింత బలమిచ్చేలా కేసీఆర్‌తో రాజీపడని నేతగా గుర్తింపు పొందిన నేతగా సంజయ్‌ని మార్చిందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఓడించడానికి కంకణం కట్టుకున్నామంటూ నిన్నటిదాకా ప్రచారం చేసిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు కాడి పడేసిందని, సంజయ్‌ని మార్చడం ద్వారా మరో అపఖ్యాతిని మూటగట్టుకుందని మరో నేత వాపోయారు.

రాష్ట్రంలో మోదీ, షా, నడ్డా సభలు జరిగినప్పుడల్లా సాహో సంజయ్‌ అంటూ ఆకాశానికెత్తిన అగ్ర నేతలు.. ఇప్పుడు ఆయన చిత్తశుద్ధినే అవమానించేలా మార్చారని తప్పుబట్టారు. కొత్తగా వచ్చిన నేతలను సంతృప్తిపరచడానికే జాతీయ నాయకత్వం ఆయన్ను మార్చినట్లు సొంత పార్టీ నేతలు అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు చేరకముందే ముగిసిపోయాయంటూ సంజయ్‌ చేసిన భావోద్వేగట్వీట్‌ కేవలం మూడు గంటల్లోనే ఆరున్నర లక్షల మందికి చేరడం గమనార్హం. మరోవైపు, బండి సంజయ్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఖమ్మం పట్టణానికి బీజేపీ టౌన్‌ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్‌ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ‘అన్నా... ఇక సెలవు.. సంజయన్నను అధ్యక్ష పదవి నుండి తొలగించడం తట్టుకోలేకపోతున్నా’ అంటూ సూసైడ్‌ లేఖ రాసి.. తన సహచరులు, పార్టీ నేతలకు ఫోన్లు చేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారని పార్టీ నేతలు చెబుతున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అవమానం

తెలంగాణలో కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌లకు కీలక పదవులు ఇచ్చి ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఏ పదవీ ఇవ్వకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌, సంయుక్త ప్రఽధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ ఢిల్లీలో కొద్ది రోజుల కిందట ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కిషన్‌ రెడ్డిలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో కోమటి రెడ్డి విస్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించారు. కేసీఆర్‌ కుటుంబంపై చర్యలు తీసుకుంటేనే తాను పార్టీలో ఉంటానని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని తేల్చి చెప్పారు. బండి సంజయ్‌ బాగానే పని చేస్తున్నాడని, ఆయనను మార్చడం కన్నా కేసీఆర్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మానుకోవాలని ఆయన ఖండితంగా చెప్పిన విషయం తెలిసిందే. అంతేనా, తనకు నాయకత్వం ఇస్తే కేసీఆర్‌ను ఢీకొంటానని కూడా ఆయన చెప్పారు. ఇంత విస్పష్టంగా చెప్పినందుకే బీజేపీ పెద్దలు కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని పక్కన పెట్టారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఎనిమిది నెలల కిందట మునుగోడులో హోరాహోరీ పోరాడి విజయానికి సమీపానికి వచ్చిన కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని అప్పటి నుంచే పక్కన పెట్టి అవమానించారని, చివరకు చర్చలకు పిలిచి నిర్మొహమాటంగా మాట్లాడినందుకే మొండిచేయి చూపారని ఈ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో కేసీఆర్‌ టీమ్‌కే బీజేపీ నేతలు పదవులు ఇచ్చారని కోమటిరెడ్డి తన సన్నిహిత వర్గాలతో అన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన దారి ఎటు అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మంగళవారమే మరో కీలక పరిణామం చోటుచేసుకోవడం విశేషం. ఇటీవల కాంగ్రె్‌సలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇంటికి భోజనానికి వచ్చారు. ఆ సమయంలో తాజా పరిణామాలతోపాటు రాజగోపాల్‌ రెడ్డికి పదవి ఇవ్వకపోవడమనే అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. అలాగే, రాజగోపాల్‌ రెడ్డి గురించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా పార్టీ వర్గాల వద్ద ఆరా తీసినట్లు సమాచారం.

Updated Date - 2023-07-05T02:25:43+05:30 IST