Vijayashanthi: కేసీఆర్ నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆరోజే అర్ధమైంది

ABN , First Publish Date - 2023-01-27T18:55:41+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు.

Vijayashanthi: కేసీఆర్ నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆరోజే అర్ధమైంది

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)పై బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డంపెట్టుకొని 2001లో కేసీఆర్ ముందుకొచ్చారని ఆమె గుర్తు చేశారు. 2004లో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్రమంత్రి పదవి తీసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ (Telangana) కోసం తాము పోరాడినప్పుడు ఆయన పదవులు తీసుకున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై తాము పోరాడుతుంటే మధ్యలో కేసీఆర్ అన్న రాక్షసుడు ఎంట్రీ అయ్యాడని విమర్శించారు. మేథావులతోపాటు జయశంకర్‌ను కలుపుకొని తన నిజస్వరూపాన్ని తెలియకుండా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ముందుకొచ్చారని మండిపడ్డారు. ఉద్యమం తాము చేస్తున్నప్పుడు కేసీఆర్ 2004లో కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం పోరాటం జరుగుతున్న సమయంలో ఎందుకు కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారని కేసీఆర్‌ను తాను ప్రతిరోజూ నిలదీశానని విజయశాంతి అన్నారు. కానీ కేసీఆర్ నమ్మదగ్గ వ్యక్తి కాదని ఆరోజే అర్ధమైందని ఆమె మండిపడ్డారు. మెదక్‌లో ఎంపీగా టికెట్ ఇచ్చి కేసీఆర్ తనను ఓడించేందుకు కుట్ర చేశాడని, ఆ తర్వాత అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని విజయశాంతి విమర్శించారు. బిల్లు రోజు తనను పోడియం వద్దకు పంపించి కేసీఆర్ సభ నుంచి జారుకున్నాడని, అందమైన తెలంగాణ రాష్ట్రం అసమర్దుడి చేతిలోకి వెళ్ళిందని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను అధికారంలో నుంచి దింపడానికి అంతా కలిసి పనిచేద్దామని, ఇదొక్కసారి కష్టపడితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని విజయశాంతి అన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఎవరు బ్రతకరని, కేసీఆర్ అనే వ్యక్తి ఒక విషసర్పమని, అందరినీ చాపకింద నీరులా చంపేస్తూ వస్తాడని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు, మందు కాదు జీవితం అంటే... అధికారంలోకి మరోసారి వస్తే కింద బాంబు పెడతారని, మరోసారి అధికారంలోకి వస్తే ఏ పెన్షన్లు ఇవ్వడని ఆమె మండిపడ్డారు.

విజయశాంతి తన 25 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ ప్రయాణం గురించి....

1998 జనవరి 26 అద్వానీ, వాజ్‌పేయ్ ఆధ్వర్యంలో విజయశాంతి బీజేపీలో చేరారు. అవినీతి లేని క్రమశిక్షణ గల పార్టీ అనే బీజేపీలో తాను చేరానని, తెలంగాణ కావాలి అనేది తనకు చిన్నప్పటి నుంచి ఉందని విజయశాంతి చెప్పారు.

43 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో పనిచేశానని, విద్యాసాగర్ రావు, వెంకయ్యనాయుడు తానను బీజేపీలో చేయమని అడిగారని విజయశాంతి అన్నారు. తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేసిన పార్టీ బీజేపీ అని, సోనియాగాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయమని అద్వానీ కోరారని ఆమె చెప్పారు. కష్టాలైనా, నష్టాలైనా, వెన్ను పోటు ఉన్నా పోరాడుతూ వచ్చానని, తెలంగాణ కోసం పోరాడుతూ అందరికీ శత్రువుగా మారానని విజయశాంతి పేర్కొన్నారు. తెలంగాణ వాదం వదులుకుంటే ఎన్నో పదవులు వచ్చేవని, తెలంగాణ కోసమే తాను బీజేపీ నుంచి బయటకు వచ్చానని, సమైక్యవాదులు తనపై ఒత్తిడి చేస్తూ వచ్చారని, ఎంతో బాధతో బీజేపీ నుంచి బయటకు వచ్చానని విజయశాంతి స్పష్టం చేశారు.

విజయశాంతిని ఉద్దేశిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పలు విషయాలు వెల్లడించారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో కొట్లాడింది విజయశాంతి మాత్రమే అని సంజయ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి విజయశాంతి అని బండి సంజయ్ గుర్తు చేశారు.

Updated Date - 2023-01-27T20:35:23+05:30 IST