JNTU: వామ్మో.. క్యాంటీన్‌ ఫుడ్డా.!

ABN , First Publish Date - 2023-03-23T00:39:47+05:30 IST

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్‌టీయూ) క్యాంటీన్‌లో ఏం తినాలన్నా విద్యార్థులు భయపడుతున్నారు.

JNTU: వామ్మో.. క్యాంటీన్‌ ఫుడ్డా.!

హడలెత్తిపోతున్న జేఎన్టీయూ విద్యార్థులు

వా(మా)డిన నూనెలు వినియోగం

ఫ్రెష్‌ నూనెతో గిట్టుబాటు కాదంటున్న యజమాని

హైదరాబాద్‌ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం (జేఎన్‌టీయూ) క్యాంటీన్‌లో ఏం తినాలన్నా విద్యార్థులు భయపడుతున్నారు. అక్కడ ఆహార పదార్థాల తయారీని చూసి వర్సిటీ సిబ్బంది సైతం హడలిపోతున్నారు. నాసిరకం నూనెలు వాడడంతో పాటు, ఆహార పదార్థాల నాణ్యత ఉండటం లేదు. దీంతో అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు.

మళ్లీ మళ్లీ అవే నూనెలు

మూడేళ్ల కిందట కరోనా విజృంభనతో యూనివర్సిటీ క్యాంటీన్‌ మూతపడింది. రెండేళ్ల తర్వాత తిరిగి తెరిచినా, పూర్తిస్థాయిలో ఆహార పదార్థాలను అందించేందుకు కాంట్రాక్టర్లు మొగ్గుచూపలేదు. కేవలం ఫాస్ట్‌ఫుడ్స్‌తోనే నడిపిస్తున్నారు. మంచూరియా, నూడుల్స్‌, ఎగ్‌రైస్‌ వగైరా.. పదార్థాలే అందుబాటులో ఉంచుతున్నారు. నిర్వాహకులు మాడిపోయిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతుండటంతో అనారోగ్యానికి గురవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.

నిర్వాహకులతో వాగ్వాదం

తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల సిబ్బంది రోజూ ఏదోక పనిమీద యూనివర్సిటీకి వస్తుంటారు. పని ఆలస్యమైతే వారికి కూడా క్యాంటీన్‌ ఫుడ్డే దిక్కు. ఓ రోజు మాడిన నూనెతో ఫుడ్‌ తయారు చేస్తుండడం చూసి కోదాడకు చెందిన ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ సిబ్బంది నిర్వాహకులను నిలదీశారు. క్యాంటీన్‌ యజమాని స్పందిస్తూ.. ప్రతిసారీ ఫ్రెష్‌ నూనెలనే వాడాలంటే తమకు గిట్టుబాటు కాదని బదులివ్వడంతో అవాక్కయ్యాడు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-03-23T10:48:04+05:30 IST