Yadagirigutta: యాదగిరిగుట్ట అద్భుతం

ABN , First Publish Date - 2023-01-19T03:09:59+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయం అద్భుతంగా ఉందని ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ కొనియాడారు.

Yadagirigutta: యాదగిరిగుట్ట అద్భుతం

కొనియాడిన ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు

లక్ష్మీనృసింహుడి సేవలో ముగ్గురు సీఎంలు

ఆలయ గొప్పతనాన్ని వివరించిన సీఎం కేసీఆర్‌

గుడి మెట్లు ఎక్కని కామ్రేడ్లు.. సూట్‌లోనే విడిది

పూజల్లో పాల్గొనని కేరళ సీఎం విజయన్‌, డి.రాజా

కొనియాడిన ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు

యాదాద్రి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయం అద్భుతంగా ఉందని ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ కొనియాడారు. ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ సభకు హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి వారు లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. వీరి వెంట యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌ కూడా ఉన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా యాదగిరిగుట్టకు వచ్చినా ఆలయంలోనికి వెళ్లకుండా, ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ఉండిపోయారు.

2Yadadri2.jpg

గుట్టలో 1.40 నిమిషాలు

బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి బయలుదేరిన నేతలు ఉదయం 11 గంటలకు గోశాల హెలిప్యాడ్‌ వద్ద దిగారు. దానికి ముందే గగనతలం నుంచి యాదగరిగుట్ట ఆలయ పరిసరాలు, టెంపుల్‌సిటీని పరిశీలించారు. ప్రెసిడెన్షియల్‌ సూట్‌లోని అతిథి గృహం నుంచి కేసీఆర్‌, భగవంత్‌ మాన్‌, కేజ్రీవాల్‌, అఖిలేశ్‌యాదవ్‌ 11.40గంటలకు కొండపైన ప్రధానాలయానికి వచ్చారు. గర్భగుడిలోని మూలవిరాట్‌ స్వయంభూ లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో సువర్ణ పుష్పాలతో ప్రత్యేక అర్చన నిర్వహించారు. ఆ తర్వాత ముఖమండపంలో అర్చకులు, వేదపండితులు మంత్రోచ్ఛరణలతో వేదాశీర్వచనం నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట విశేషాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి వివరించారు. 12.50 గంటలకు ఖమ్మం సభకు బయలుదేరారు.

2yadadri-2-(2).jpg

కాగా, ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌.. ‘‘ఆలయ పునర్నిర్మాణం బహుబాగు’’ అంటూ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రశంసించారు. కేసీఆర్‌ను అభినందిస్తూ.. విజిటర్స్‌ బుక్‌లో నోట్‌ రాసి, సంతకాలు చేశారు. అఖిలేశ్‌యాదవ్‌ కూడా స్వామివారిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉందని, కుటుంబ సభ్యులతో కలిసి మరోమారు ఆలయానికి వస్తానని విజిటర్స్‌ బుక్‌లో పేర్కొన్నారు. కాగా, ముఖ్యమంత్రుల రాక నేపథ్యంలో బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్జిత సేవలను, భక్తులకు ఉభయ దర్శనాలను నిలిపివేశారు.

Updated Date - 2023-01-19T03:10:00+05:30 IST