GHMC: స్వప్నలోక్ బిల్డింగ్ భవితవ్యంపై జీహెచ్ఎంసీకి జేఎన్‌టీయూ నివేదిక
ABN , First Publish Date - 2023-04-17T16:31:20+05:30 IST
స్వప్నలోక్ బిల్డింగ్ (Swapnalok building) భవితవ్యంపై జీహెచ్ఎంసీకి జేఎన్‌టీయూ (JNTU) నివేదిక ఇచ్చింది. 15 పేజీలతో జీహెచ్ఎంసీ
హైదరాబాద్: స్వప్నలోక్ బిల్డింగ్ (Swapnalok building) భవితవ్యంపై జీహెచ్ఎంసీకి జేఎన్‌టీయూ (JNTU) నివేదిక ఇచ్చింది. 15 పేజీలతో జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner)కు జేఎన్‌టీయూ నిపుణులు నివేదిక అందజేశారు. మార్చి 16న స్వప్నలోక్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అయితే బిల్డింగ్ను పూర్తిగా కుల్చాల్సిన పనిలేదని నిపుణులు తేల్చారు. ప్రమాదం జరిగిన 4, 5తో పాటు 3, 6 ఫ్లోర్లను రినోవేట్ చేయాలని నివేదికలో తెలిపారు. 3, 4, 5, 6 ఫ్లోర్లను పటిష్టంగా ఉండేలా రినోవేట్ చేసిన తర్వాతే.. ప్రమాదం జరిగిన బిల్డింగ్ వెనక బ్లాక్ ఓపెన్ చేయాలని నివేదికలో ప్రస్తావించారు. స్వప్నలోక్ ముందు బ్లాక్ను తెరిచేందుకు కమిటీ గ్రీన్ సిగ్నలిచ్చింది. నివేదికపై జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయం తీసుకోనున్నారు. బల్దియా నిర్ణయం తర్వాతే స్వప్నలోక్ భవనం ఫ్రంట్ బ్లాక్ తెరుచుకోనున్నాయి. బిల్డింగ్ మొత్తం కొత్త విద్యుత్ వైర్లు వేసుకోవాలని జేఎన్‌టీయూ నిపుణులు నివేదిక సూచించారు.
గతనె ల 16న సికింద్రాబాద్ (Secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 5,7 అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో క్యూనెట్ సంస్థలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది ఆగ్నికి ఆహూతయ్యారు. ప్రమాదం జరిగిన రెండు నెలలు కావొస్తున్నా కాంప్లెక్స్ కూల్చివేతపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గ్రేటర్‌లో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పు డు, ఎక్కడ ప్రమాదం జరుగుతోందనని ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది. ఏడాది కాలంలో జరిగిన నాలుగు అగ్ని ప్రమాదాల్లో దాదాపు 27మంది అగ్నికి ఆహుతయ్యారు. జనావాసాల మధ్య గోదాములు, స్ర్కాప్ దుకాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నా బల్దియా, అగ్నిమాపక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినపుడు హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. తాజాగా కుషాయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
మెజార్టీ వాణిజ్య సముదాయాలదీ అదే దుస్థితి..
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నాటి భవనాలు నిర్వహణలోపంతో పెచ్చులూడుతున్నాయి. గతంలోనూ ఓ కాంప్లెక్ రెయిలింగ్ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. అప్పుడే అవసరమైన మరమ్మతు చేయాలని జీహెచ్‌ఎంసీ నోటీసులిచ్చినా అక్కడి యజమానులు పట్టించుకోలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో మరమ్మతు పనులు చేశారా.. లేదా? అన్నది పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికీ భవనంలో అక్కడక్కడా పెచ్చులూడుతున్నాయి. ఈ క్రమం లో అగ్ని ప్రమాదం సంభవించడం.. ఆరుగురు దుర్మరణం పాలైన నేపథ్యంలో జేఎన్‌టీయూ నిపుణుల నివేదిక కీలకం కానుంది. మెజార్టీ వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న బహుళ అంతస్తుల భవనాలు నిర్వహణ లోపంతో ప్రమాదకరంగా మారాయి.