K A Paul: హైకోర్టులో తన వాదనలతో దుమ్మురేపిన కేఏ పాల్
ABN , First Publish Date - 2023-01-30T21:21:42+05:30 IST
కామారెడ్డి మాస్టర్ ప్లాన్(Kamareddy Master Plan)పై ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కే ఏ పాల్ (K A Paul) తెలంగాణ హైకోర్టు(Telangana High Court )లో పిల్ దాఖలు చేశారు.
హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్(Kamareddy Master Plan)పై ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కే ఏ పాల్ (K A Paul) తెలంగాణ హైకోర్టు(Telangana High Court )లో పిల్ దాఖలు చేశారు. పార్టీ ఇన్ పర్సన్‌గా వ్యక్తిగతంగా హాజరై వాదనలు వినిపించారు. రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని వాదించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు కౌన్సిల్ ప్రకటించిందని, కౌన్సిల్‌కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని వాదించారు. మాస్టర్ ప్లాన్ రద్దు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వ నిర్ణయాన్ని ఫిబ్రవరి 13 లోపు సమర్పించాలని హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 13 కు వాయిదా వేసింది.
కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్
కామారెడ్డిలో 2000 నుంచి 2020 వరకు 20 ఏళ్లకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ముగియడంతో కొత్త ప్రణాళిక కోసం కసరత్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 86 పురపాలికల మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వం ఇపట్పికే ఆమోదించింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకు రూపొందించిన 20సంవత్సరాల మాస్టర్ ప్లాన్ గడువు ఇటీవలే ముగిసింది. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) ప్రణాళికను కొద్ది నెలల క్రి తం ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వేములవాడ ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది.
భవిష్యత్తు అవసరాలపై అంచనాతో ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి వాటి రూపురేఖలు మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జనాభాకు అనుగుణంగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారిత మాస్టర్ ప్లాన్‌తో పలు పట్టణాలకు ప్రత్యేక మ్యాప్ రూపొందించారు. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు రూపొందించిన 86 మునిసిపాలిటీలకు సంబంధించి వినూత్న మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వం అనుమతించింది. వీటి ద్వారా పట్టణాల్లో వివిధ జోన్లుగా నిర్ణయించి అభివృద్ధి చేస్తారు. ప్రధానంగా గృహ, వాణిజ్య,, పబ్లిక్, సెమీ పబ్లిక్, పారిశ్రామిక, గ్రీన్ బఫర్ జోన్లుగా విభజిస్తారు. రోడ్లు, రైల్వే, బస్ డిపోలు, పార్కింగ్ ప్రాంతాలను ట్రాన్స్‌పోర్ట్ జోన్‌గా, హెరిటేజ్ భవనా లు, ఇతర ప్రాంతాలు, ప్రకృతి సిద్ధమైన ప్రదేశాలను స్పెషల్ రిజర్వేషన్ జోన్‌గా పరిగణిస్తారు. జీఐఎస్ ఆధారిత మ్యాప్ వల్ల గృహ, వాణిజ్య నిర్మాణాల వ్యవహారాల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటుంది. వెబ్‌సైట్‌లో ఇంటి నంబర్‌ను ఎంటర్ చేయగానే దాని ఫొటో, నిర్మాణ అనుమతులు, విస్తీర్ణం, ఆస్తి పన్ను తదితర అంశాలపై సమాచారం ప్రత్యక్షమవుతుంది. దీంతో పన్నుల వసూలులో అవినీతికి ఆస్కారం ఉండదని, పురపాలికలకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త మాస్టర్ ప్లాన్లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ప్రత్యేకంగా పారిశ్రామిక జోన్లను కేటాయించాల్సి ఉంది. వీటిని జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే కేటాయించాలి. మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే ఎక్కువ పరిశ్రమలు వస్తాయన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే ఎక్కువగా దీనిపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్‌లో 1600 ఎకరాలను పారిశ్రామిక జోన్‌గా ప్రకటించారు. ఒకసారి భూములను పారిశ్రామిక జోన్ కింద కేటాయిస్తే.. గృహ నిర్మాణం, వ్యవసాయం, పారిశ్రామికేతర అవసరాలకు వినియోగించడానికి ఉండదు. దీంతో రహదారుల పక్కనే భారీ ధరలు పలుకుతున్న తమ భూములకు నష్టం కలుగుతుందన్నది రైతుల వాదన. అయితే కామరెడ్డి ఆందోళనల నేపథ్యంలో ఇదే తరహా ఆందోళనలు ఇతర చోట్లకు పాకితే మాస్టర్ ప్లాన్‌ల అమలు కష్ట సాధ్యమవుతుందన్న ఆందోళన ఉన్నతాధికారుల్లో నెలకొంది.