Kadiyam Srihari: హామీల కాలయాపన కోసమే కాంగ్రెస్ హడావుడి చేస్తోంది: కడియం శ్రీహరి
ABN , Publish Date - Dec 29 , 2023 | 06:43 PM
కాంగ్రెస్ పార్టీ ఎన్నో సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని.. హామీల కాలయాపన కోసమే శ్వేతపత్రాలు, ప్రాజెక్టుల సందర్శన పేరుతో హడావిడి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా...
Kadiyam Srihari: కాంగ్రెస్ పార్టీ ఎన్నో సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని.. హామీల కాలయాపన కోసమే శ్వేతపత్రాలు, ప్రాజెక్టుల సందర్శన పేరుతో హడావిడి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే న్యాయ విచారణ చేస్తామని ఉత్తమ్ బృందం చెప్తోందని.. న్యాయ విచారణను తామే కోరుకున్నామని ఆయన చెప్పారు. మేడిగడ్డలో అధికారులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం ప్రశ్నల వర్షం కురిపించిందని తాము వార్తల్లో చూశామని చెప్పారు.
కాళేశ్వరం నిర్మాణంలో రూ.లక్ష కోటి అవినీతి జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని.. అయితే రూ.93 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు అధికారులు వెల్లడించారని కడియం శ్రీహరి అన్నారు. మరి.. లక్ష కోటి అవినీతి ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్ ప్రకారం 98 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చామని చెప్పారని.. దీంతో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన ప్రచారం అవాస్తవమని తేలిందని చెప్పారు. తుమ్మిడి హట్టి ద్వారా గ్రావిటీతో నీళ్ళు తీసుకురావచ్చని నీటిపారుదల మంత్రి అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. 2008 నుంచి 2014 వరకు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మహారాష్ట్రతో ఎందుకు ఒప్పందం చేసుకోలేదని నిలదీశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు, సర్వేలు, భూసేకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6,116 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు.
తుమ్మిడి హట్టి సాధ్యం కాదని తెలిశాకే తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ని రీడిజైన్ చేసిందని, కేంద్ర అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని కడియం శ్రీహరి వివరించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవటం దురదృష్టకరమన్న ఆయన.. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోండని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. విచారణ కమిటీ వేయకుండానే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తాము కాళేశ్వరానికి జాతీయ హోదా అడగలేదని ఉత్తమ్ మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి ఉన్న సవతి తల్లి ప్రేమతో కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదని వెల్లడించారు. దేశంలో ఏ ఒక్క నీటి పారుదల ప్రాజెక్ట్ అయినా.. అంచనాలు పెంచకోకుండానే పూర్తయ్యిందా? దీనిపై ఉత్తమ సమాధానం చెప్పాలని నిలదీశారు. 141 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని, అనేక రిజర్వాయర్ల నిర్మాణాల వల్లే వ్యయం జరిగిందనేది గమనించాలని అన్నారు.
ఇదే సమయంలో.. ల్యాండ్ క్రూజర్స్ అంశంపై కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలపై కూడా కడియం శ్రీహరి స్పందించారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో ల్యాండ్ క్రూజర్స్ కొనడంలో తప్పేముందని తిరిగి ప్రశ్నించారు. ల్యాండ్ క్రూజర్స్ వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం వాడదా? వాటిని అమ్మేస్తారా? అందులో ఏమైనా అవినీతి జరిగిందా? అని నిలదీశారు. ప్రగతి భవన్‌ను హాస్పిటల్ చేస్తాం అన్నారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అందులో ఉంటున్నారని తూర్పారపట్టారు. సెక్రటేరియట్‌కు లంకె బిందెల కోసం వస్తారా? అని ప్రశ్నించిన కడియం శ్రీహరి.. ముఖ్యమంత్రి భాద్యతగా మాట్లాడాలని కోరారు.