బీసీ బంధు పథకం కావాలి

ABN , First Publish Date - 2023-05-22T00:58:56+05:30 IST

బీసీల్లో కుల వృత్తులు చేసుకుని జీవించే వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీలు పెదవి విరుస్తున్నారు.

బీసీ బంధు పథకం కావాలి

- రూ. లక్ష కాదు.. కనీసం ఐదు లక్షల సహాయం అందించాలి

- డిమాండ్‌ చేస్తున్న బీసీ సంఘాల నాయకులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

బీసీల్లో కుల వృత్తులు చేసుకుని జీవించే వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీలు పెదవి విరుస్తున్నారు. దళితబంధు మాదిరిగా బీసీ బంధు పథకాన్ని అమలు చేసి ఒక్కో కుటుంబానికి కనీసం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయమైనా అందించాలని వారు కోరుతున్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి యేటా బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రణాళికను రూపొందించారు. బీసీ కార్పొరేషన్‌ నిరుద్యోగ యువతకు వారి నుంచి మార్జిన్‌ మనీ వసూలు చేసి బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

ఫ ఏడేళ్లుగా అందని బీసీ రుణాలు

2017-18 నుంచి ఇప్పటి వరకు ఏడేళ్లుగా బీసీ కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయడం లేదు. 2017-18లో దరఖాస్తులు స్వీకరించారుకానీ ఇప్పటి వరకు రుణాలు ఇవ్వ లేదు. జిల్లావ్యాప్తంగా 20,478 మంది ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి-1 కింద 80 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల వరకు, కేటగిరీ-2 విభాగం కింద 70 శాతం సబ్సిడీతో లక్ష నుంచి రెండు లక్షల వరకు, కేటగిరీ-3 కింద 60 శాతం సబ్సిడీ (ఐదు లక్షలకు మించకుండా) 2,00,001 నుంచి 12 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించేవిధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపీడీవోలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల నుంచి అర్హత ఉన్న వాటిగా గుర్తించిన 11,965 దరఖాస్తులను జిల్లా బీసీ కార్పొరేషన్‌కు పంపించారు. కేటగిరీ-1 కింద 1,367 మందికి మాత్రమే 50 వేల రూపాయల చొప్పున వందశాతం సబ్సిడీతో సహాయం అందించారు. దరఖాస్తులు చేసుకున్నవారి అందరి మాట అటుంచి మండల స్థాయిలో అధికారులు అర్హులుగా గుర్తించిన వారికి కూడా ఏడేళ్లుగా సహాయం అందడం లేదు. 10,598 దరఖాస్తులు ఇంకా ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూ పెండింగ్‌లో ఉన్నాయి. కులవృత్తులు చేసుకునేవారికే కాకుండా బీసీలందరికి బీసీ బంధు పేరిట ఆర్థిక సహాయం అందించి వారు కోరుకున్న వృత్తిలో కొనసాగడానికి అవకాశం కల్పించాలని బీసీలు కోరుతున్నారు. ఏడేళ్ల్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులందరికీ గతంలో నిర్ణయించిన మేరకు వెంటనే ఆర్థిక సహాయం అందించాలని, ప్రభుత్వం ఈ మేరకు నిధులు విడుదల చేయాలని బీసీలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ రూ. లక్ష ఎందుకూ సరిపోవు

- బొనకుర్తి తిరుమల్‌, కాట్నపల్లి, చొప్పదండి

కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు ఇస్తే ఏ పని చేయరాదు. 10 లక్షల రూపాయలతో బీసీ బంధును ఇవ్వాలి. మా వృత్తికి సంబంధించిన సెలూన్‌ షాపు పెట్టుకోవాలని అనుకుంటున్నాను. లక్ష రూపాయలు సరిపోవు కనీసం ఐదు లక్షలు ఇవ్వాలి.

ఫ ఎన్నికల్లో లబ్ధి కోసమే..

- రావుల అశోక్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జూపాక

2019 సంవత్సరంలో బీసీలకు రుణాలకు అందిస్తామని చెబితే దరఖాస్తు చేసుకున్నాం. దరఖాస్తులన్నింటిని పెండింగ్‌లో పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను ఆకర్షించేందుకు సహాయం ప్రకటించారే తప్ప ఏం ప్రయోజనం లేదు.

ఫ బీసీలను ఆదుకోవాలి..

- శనిగరం రాజమొగులయ్య, కుమ్మరి వృత్తిదారుడు

తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయనుకున్నాం. తొమ్మిదేళ్లు గడిచినా ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటికైనా వెనకబడ్డ కులాలకు బీసీ బంధు ప్రకటించాలి.

ఫ రూ. 10 లక్షలు ఇవ్వాలి..

- జక్కే వీరస్వామి

బీసీల్లో చాలామంది పేదలు ఉన్నారు. వారందరికి 10 లక్షలు ఇవ్వాలి. లక్ష రూపాయలు ఇస్తే ఎందుకు సరిపోవు.

ఫ ప్రభుత్వ నిర్ణయంతో ఎటువంటి ప్రయోజనం ఉండదు

- ముక్కెర సదానందం, బీసీ సంఘం జిల్లా నాయకులు

ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో ఏమి ప్రయోజనం ఉండదు. గతంలో ఇలాంటి పథకాలు వచ్చినప్పటికీ ఎవరూ అభివృద్ధి చెందలేదు. గొల్ల, కురుమ, యాదవులకు గొల్లకుర్మ బంధు పథకాన్ని ప్రవేశ పెడితే బాగుంటుంది.

ఫ బీసీల పరిస్థితి దయనీయంగా ఉంది..

- ఆర్కూటి లింగయ్య, కురిక్యాల బీసీ నాయకుడు

బీసీల పరిస్థితి దయనీయంగా ఉంది. నిత్యం కూలి పని చేసుకుంటేనే జీవనం సాగుతుంది. కులవృత్తితో జీవనం సాగే పరిస్థితి లేదు. బీసీలందరికి బీసీబంధు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది.

ఫ కనీసం రూ. 5 లక్షలు ఇవ్వాలి...

- రెడ్డి రాజుల రమేశ్‌, వీణవంక

బీసీల్లో అత్యధికులు పేద ప్రజలు ఉన్నారు. దళితబంధు లాగా బీసీలకు ప్రత్యేక పథకం పెట్టి కనీసం ఐదు లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తానంటున్న లక్ష రూపాయలతో ఉపాధి పొందడం కష్టం.

ఫ ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తారు

- గట్టు మల్లేశం, కొండపల్కల, మానకొండూర్‌

తొమ్మిదేళ్లుగా గుర్తుకురాని బీసీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సమయంలోనే గుర్తుకు వచ్చారు.. లక్ష రూపాయలు ఇచ్చినంత మాత్రాన బీసీల జీవితాలు మారవు.

ఫ ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల బతుకు మారదు..

- దుబ్బ నాగభూషణం, చెర్లబుత్కూర్‌, కరీంనగర్‌ రూరల్‌

ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల బతుకు మారదు. సాంచాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న నేను బీసీ రుణాలు ప్రకటించినప్పుడల్లా దరఖాస్తు చేసుకున్నా.. ఇంతవరకు ఒక్క రుణం మంజూరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థతి లేదు.

ఫ బీసీలను మభ్య పెట్టేందుకే..

- మండల జంపయ్య, బీసీ నాయకుడు, శివరాంపల్లి

బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ఆర్థిక సాయం ప్రకటించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు. ఇది ప్రకటనలకే పరిమితమవుతుంది. బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సంవత్సరాలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వలేదు. ఈ లక్ష రూపాయలు ఎలా ఇస్తారు.

ఫ లక్ష రూపాయలు ఇస్తారన్న నమ్మకం లేదు..

- గాజుల వీరభద్రయ్య, గోపాల్‌రావుపేట

ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలతో బీసీల బతుకు మారదు. ఇది ఒక ఎన్నికల స్టంటే. నేను బీసీ రుణాలు ప్రకటించినప్పుడల్లా దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఒక్క రుణం మంజూరు కాలేదు. దళితబంధు పథకానికే దిక్కులేదు బీసీ కుటుంబాలకు లక్ష రూపాయలు ఇస్తారన్న నమ్మకం లేదు. ఒకవేళ ఇచ్చినా లక్ష రూపాయలతో పెద్దగా ఒరిగేది ఏమి లేదు.

ఫ దళితబంధు లాగా బీసీ బంధు ఇవ్వాలి...

- రవీందర్‌, నాయీబ్రాహ్మణ, మహాత్మానగర్‌, తిమ్మాపూర్‌

ప్రభుత్వం బీసీలకు లక్ష రూపాయలు ఇస్తానంటుంది. కానీ లక్ష రూపాయలు ఇచ్చేదానికన్నా దళితబంధు పథకం లాగా ఎక్కువ డబ్బులు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ఎప్పుడు ఇస్తారో, అది ఎందరికి ఇస్తారో కూడా తెలియదు.

ఫ బీసీలకు రూ. ఐదు లక్షలు ఇవ్వాలి...

- మోత్కూరి శ్రీనివాస్‌, ఇల్లందకుంట, బీసీ సంఘం నాయకుడు

రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఐదు లక్షలు ఇవ్వాలి. ప్రతి బీసీ కులాలకు చెందిన కుల వృత్తులకు చెందిన వారికి లక్ష రూపాయలు ఇవ్వడం సరికాదు. బీసీ కులాల్లో చాలామంది పేదవారున్నారు.

ఫ కులవృత్తుల ఆధారంగా ఆర్థిక సాయం చేయాలి

- బూర రామకృష్ణ, గన్నేరువరం

బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు ప్రకటించినా దానివల్ల బీసీలకు ఒరిగేదేమి లేదు. బీసీల్లో అనేక కులవృత్తుల మీద ఆధారపడి జీవించేవాళ్లు ఉన్నారు. వారి వారి కులవృత్తుల ఆధారంగా దళితబంధు లాగా బీసీబంధు ప్రవేశపెట్టి ఆర్థిక సాయం చేయాలి.

ఫ బీసీలు ఇప్పుడే గుర్తొచ్చారా?

- బొంగోని శ్రావణ్‌ కుమార్‌గౌడ్‌, బీసీ సంఘం నాయకుడు

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయి పదేళ్లు కావస్తున్నా ఏనాడు బీసీల కోసం ప్రత్యేకంగా చొరవ చూపలేదు. ఏడేళ్లుగా బీసీ కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వలేదు. మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఓట్ల కోసం ఇప్పుడు బీసీలకు లక్ష రూపాయల పేరుతో మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన నిధులను ఆపేసి ఇప్పుడే ఏదో ఇస్తే ఇందులో ప్రత్యేకత ఏం లేదు.

Updated Date - 2023-05-22T00:58:56+05:30 IST