రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేవరకు విశ్రమించొద్దు

ABN , First Publish Date - 2023-02-15T01:18:26+05:30 IST

బీఆర్‌ఎస్‌కు హఠావో.. తెలంగాణకు బచావో అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో కాషాయజెండా ఎగిరే వరకు పార్టీ శ్రేణులు విశ్రమించవద్దని బీజేపీ నాయకురాలు, కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యురాలు జీవిత రాజశేఖర్‌ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేవరకు విశ్రమించొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నాయకురాలు, సినీనటి జీవిత రాజశేఖర్‌

కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 14: బీఆర్‌ఎస్‌కు హఠావో.. తెలంగాణకు బచావో అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో కాషాయజెండా ఎగిరే వరకు పార్టీ శ్రేణులు విశ్రమించవద్దని బీజేపీ నాయకురాలు, కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యురాలు జీవిత రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం రేకుర్తిలో నిర్వహించిన శక్తి కేంద్ర స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ అకాంక్షలు, అమర వీరుల ఆశయాలను నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ వాటిని పూర్తిగా విస్మరించారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలిపేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతామని చెప్పిన కేసీఆర్‌ తొమ్మిదేళ్ళలో ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల తెలంగాణాగా మార్చారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనలో ఏ రంగం కూడా అభివృద్ధి చెందలేదన్నారు. కేసీఆర్‌ అవినీతిపాలన, హామీలవైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ మోదీ పాలనలో అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి వెళి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో శక్తి కేంద్ర ఇన్‌చార్జి జాడి బాల్‌రెడ్డి, నాయకులు ఽనరహరి లక్ష్మారెడ్డి, దర్మారం వెంకటస్వామి, సత్యనారాయణరెడ్డి, సంకిటి శ్రీనివాస్‌రెడ్డి, జనపట్ల స్వామి పాల్గొన్నారు.

బంగారు తెలంగాణ కాదు.. కేసీఆర్‌ది బంగారు కుటుంబమైంది

జమ్మికుంట: బంగారు తెలంగాణ కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ది బంగారు కుటుంబమైందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు జీవిత రాజశేఖర్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ప్రజా గోస బీజేపీ భరోసా స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన జీవిత రాజశేఖర్‌ మాట్లాడుతూ ఇటీవల జమ్మికుంటలో జరిగిన బీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో హుజూరాబాద్‌ నియోజకవర్గం మొత్తం నీదే అంటూ మంత్రి కేటీఆర్‌ కౌశిక్‌రెడ్డికి చెప్పారని, అతడు ఒక పెద్ద రౌడీ అంటూ మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డి తన కుటుంబసభ్యుడితోనే పరుషంగా ప్రవర్తించాడని, ఆయన ఎవరితో ఎలా బిహేవ్‌ చేయాలో తెలియని వ్యక్తి అన్నారు. గ్రామాలను మున్సిపాల్టీల్లో కలుపుతూ మాస్టర్‌ ప్లాన్‌ పేరిట భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు గొప్పగా ఆదాయం వస్తుందని చెబుతున్నారని, అది ప్రజలను మద్యం మత్తులో ముంచితే వచ్చినదని మర్చిపోవద్దన్నారు. కార్యక్రమంలో బీజేపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎరబెల్లి సంపత్‌రావు, మాడుగుల ప్రవీణ్‌, మాడ గౌతంరెడ్డి, శీలం శ్రీనివాస్‌, రాముల కుమార్‌, గండికోట సమ్మయ్య, పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్‌, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ పాలన బీజేపీతోనే అంతం

గంగాధర: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన అంతం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకురాలు జీవిత అన్నారు. మంగళవారం గంగాధరలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్లి కేసీఆర్‌ను గద్దె దిచ్చడం కోసమే భరోసా యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి, చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్‌ శ్రవణ్‌, వైదరామానుజం, దూలం కళ్యాణ్‌గౌడ్‌, తూం నారాయణ, ప్రశాంత్‌, రేండ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-15T01:18:27+05:30 IST