పక్కా నిఘా
ABN , First Publish Date - 2023-10-11T00:47:51+05:30 IST
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిఘా పెరిగింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.
- జిల్లాలో మొదలైన కోడ్ అటెన్షన్
- ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూం ఏర్పాటు
- టోల్ ఫ్రీ 1950... సీ-విజిల్, ఎన్‌జీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదులకు అవకాశం
- జిల్లాలో ఐదు చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు
- రూ. 50 వేలు దాటితే ఆధారాలు చూపాలి
- బరిలో నిలిచే అభ్యర్థులు, పార్టీలు జర జాగ్రత్త
- శాసనసభ ప్రవర్తన నియమావళి పాటించాల్సిందే
- ప్రచారపర్వానికి పార్టీలు సన్నద్ధం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిఘా పెరిగింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఎన్నికల నియమావళిని కచ్ఛితంగా అమలు చేసే విధంగా ప్రతీఅంశంపై నిఘా పెంచుతూ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లోని తంగళ్లపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, బోయినపల్లి, రుద్రంగి, మండలాల్లోని శివారు గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. 57 సెక్టార్ అధికారులను నియమించారు. 24 గంటలు పనిచేసే విధంగా 14 బృందాలు ఏర్పాటు చేశారు. నిరంతరం పోలీసులు నిఘా పెంచారు. ఎన్నికల్లో అక్రమాలకు చెక్ పెట్టే దిశగా జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన అరు చెక్‌పోస్టులలో పోలీసులతో పాటు డీటీ స్థాయి అధికారులను నియమించారు. డబ్బు, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయనున్నారు. వీరితో పాటు నిరంతరం ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, బీఎస్‌టీ, వీవీటీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేసే విధంగా ఏర్పాటు చేశారు.
హోర్డింగ్‌లు, గోడ రాతల తొలగింపులు
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో వివిధ పార్టీల హోర్డింగ్‌లు, ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రచార పోస్టర్‌లు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల ఫ్లెక్సీలు అధికారులు తొలగించారు. మోడల్ కోడ్‌ను పక్కాగా అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రచార సభలకు అనుమతులు తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటలిజెన్స్ వర్గాలు కూడా నిఘా పెట్టారు. సోమవారం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌తోనే ప్రవర్తన నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. దీంతో సర్పంచుల నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రవర్తన నియమావళికి లోబడి నడుచుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులను ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ ఉపయోగించుకునే వీలు లేదు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. జిల్లాలో ఎన్నికల నియామావళి అమలుపై వీడియో, ఫొటోగ్రఫీ బృందాలను కూడా సిద్ధం చేశారు.
నగదుపై నిఘా...
సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలపై రవాణాపై నిఘా ఉంచారు. 50 వేల రూపాయలకు మించి డబ్బులు ఉంటే ఆధారాలు చూపించాల్సిందే. లేనిపక్షంలో సీజ్ చేస్తారు. సొంత డబ్బులైనా లెక్క చెప్పాల్సి ఉంటుంది. 50 వేల రూపాయలకు మించి ఉంటే ఏ బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేశారో రసీదుతో పాటు ఎప్పుడు డ్రా చేశారో పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. పార్టీ నేతలు కూడా నగదును తరలించడానికి ఇబ్బంది పడక తప్పదు. పూర్తి ఆధారాలతో ఉంటేనే మంచిది.
ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీ..బిజీ
శాసనసభ ఎన్నికలకు సంబంధించి సిరిసిల్ల, వేములవాడలో పకడ్బందీగా నిర్వహించే దిశగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారిపోయారు. పోలింగ్ కేంద్రాలు, రూట్లు, తనిఖీల బృందాలతో పాటు కలెక్టరేట్‌లో ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు ఇచ్చే విధంగా కంట్రోల్‌రూం, టోల్ ఫ్రీ నంబర్ 1950, సీ - విజిల్, ఎన్‌జీఆర్‌ఎస్‌కు సంబధించిన వాటి ద్వారా వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే స్పందించే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని రెండు సెగ్మెంట్లలో 4,58,958 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో వేములవాడ సెగ్మెంట్‌లో 2,18,160 మంది, సిరిసిల్లలో 2,40,798 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి 311 ప్రాంతాల్లో 547 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, రూట్లు సిద్ధం చేస్తున్నారు.
17న సీఎం బహిరంగ సభ..
సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు టికెట్ ఖరారుగా భావిస్తున్నవారు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన కరపత్రాలతో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో బీఆర్‌ఎస్ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఈ నెల 17న బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండడంతో సభ సక్సెస్‌కు సన్నద్ధం అవుతున్నారు. మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ ముఖ్యులతో హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ ఏర్పాట్లపై సూచనలు చేసినట్లు తెలిసింది. మరోవైపు అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్, బీజేపీ వ్యూహాత్మకంగా ప్రచార రంగంలోకి వెళ్లడానికి సన్నాహాల్లో ఆశావహులు ఉన్నారు.
అభ్యర్థులు, పార్టీలు నిబంధనలపై జాగ్రత్త..
జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వివిధ రాజకీయ పార్టీలు పోటీచేసే అభ్యర్థులు, పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం, ఎన్నికల నిబంధనలు పాటించకుంటే కేసుల్లో చిక్కుకోవడమే కాకుండా గెలుపొందిన తర్వాత కూడా అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి.
- ఎన్నికలకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు స్వయంగా తెలుసుకోవాలి.
- కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి అన్ని పార్టీలు అభ్యర్థులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను తప్పకుండా పాటించాలి.
- ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి మద్దతుదారులు వ్యక్తిగత జీవితంపై, కుటుంబ సభ్యుల జీవనానికి ఆటంకం కలిగించవద్దు, వారి ఇళ్ల వద్ద రెచ్చగొట్టే విధంగా ప్రదర్శనలు చేయవద్దు.
- ఎన్నికల ర్యాలీలు, ప్రదర్శనలు రోడ్డు షోల సందర్భంగా ట్రాఫిక్, ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు.
- ఎన్నికల ఫిర్యాదులను 1950 టోల్ ఫ్రీ నంబర్, వెబ్‌సైట్, సీ-విజల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
- షెడ్యూలు వచ్చినప్పటి నుంచి పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు ఎన్నికల వ్యయం కిందికి వస్తుంది.
- కులం, మతం పేరిట ఓట్లు అడగకూడదు.
- ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద ఎన్నికల ప్రచారం చేయకూడదు.
- డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభానికి గురి చేయవద్దు
- సభలు, సమావేశాలు, ఊరేగింపులకు సంబంధించి ముందుగానే నిర్ణీత సమాయాన్ని తెలుపుతూ అనుమతులు తీసుకోవాలి.
- సెక్యూరిటీ వాహనాలు మూడు కంటే ఎక్కువ వాడితే వాటి ఖర్చును ఎన్నికల వ్యయం కింద చూపించాలి.
- పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ప్రకటనలు ఇవ్వవద్దు. టీవీల్లో ప్రకటనలు ఇచ్చే ముందు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీకి చూపించాలి.
- అధికార పార్టీకి సంబంధించిన వారు కొత్త పథకాలు ప్రకటించడానికి వీలు లేదు.
- ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతరులు ప్రభుత్వ వాహనాలను ఇంటి నుంచి కార్యాలయానికి తప్ప ఇతర పనులకు ఉపయోగించవద్దు.
- పత్రికలు, టీవీ ప్రకటనలను ప్రభుత్వ డబ్బులు వినియోగించవద్దు.
- మంత్రులు అధికారిక పర్యటనలు చేపట్టవద్దు
- ప్రచారానికి యంత్రాగాన్ని వినియోగించవద్దు
- సభలు, సమావేశాలకు సంబంధించి మైదానాలకు హెలీప్యాడ్‌లపై అజమాయిషీ చేయవద్దు. ఇతర పార్టీలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి.
- ప్రభుత్వరంగ సంస్థలో ఎలాంటి తాత్కాలిక నియామకాలు చేపట్టవద్దు.