అన్నదాతకు ధీమా రైతు బీమా

ABN , First Publish Date - 2023-07-15T01:14:30+05:30 IST

అకాల మృత్యువు పాలైన రైతుల కుటుంబాలు ఉన్నపళంగా వీధిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తోంది.

అన్నదాతకు ధీమా రైతు బీమా

- పథకంలో చేరేందుకు ఆగస్టు 5 చివరి తేదీ

- ఇప్పటి వరకు చేరింది 1,04,500 మంది

- నమోదు చేసుకోవాల్సినవారు 21,153 మంది రైతులు

- ఐదేళ్లలో 2,452 మంది రైతుల మృతి

- 2,377 కుటుంబాలకు అందిన రూ. 118.85 కోట్ల సాయం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

అకాల మృత్యువు పాలైన రైతుల కుటుంబాలు ఉన్నపళంగా వీధిన పడకుండా చూసేందుకు ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద అకాలంగా మృతి చెందిన వారికి ఐదేసి లక్షల రూపాయలు అందిస్తున్నది. ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నది. 2018 నుంచి ఇప్పటి వరకు 2452 మంది రైతులు అకాల మృత్యువు బారినపడగా వారిలో 2,377 మంది రైతుల కుటుంబాలకు 118 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింది. మరో 75 మంది క్లెయిమ్‌లు ప్రాసెస్‌లో ఉండగా 13 మంది డాక్యుమెంట్లు నమోదు చేయాల్సి ఉన్నది. ఈ సంవత్సరం రైతు బీమా పథకంలో చేరేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు గడువు ఉన్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. ప్రతియేటా ఆగస్టు 14వ తేదీ నుంచి రైతు బీమా సంవత్సరం ప్రారంభం అవుతున్నది. ఈ పథకంలో నమోదు చేసుకున్న రైతులందరికి ఏడాదిపాటు బీమా సౌకర్యం ఉంటుంది. ప్రతియేటా రైతులు ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుంటుంది.

దరఖాస్తు ఇలా..

18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన రైతులందరు ఈ పథకంలో చేరేందుకు అర్హులుగా ఉంటారు. రైతులు తమ పేర్ల నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తుపై సంతకం చేసి పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌, తను నామినీగా పేర్కొనేవారి ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ ప్రతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికిగాని, మండల వ్యవసాయ అధికారికిగాని అందజేయాల్సి ఉంటుంది. 59 సంవత్సరాల వయస్సు దాటిన రైతులు బీమా పథకంలో చేరేందుకు అర్హులు కారు. 1964 ఆగస్టు 14 నుంచి 2005 ఆగస్టు 14 వరకు జన్మించిన రైతులందరు ఈ సంవత్సరం పథకంలో చేరేందుకు అర్హులు. పుట్టినరోజు నిర్ధారణకు ఆధార్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. జిల్లాలో 2,00,075 మంది పట్టాదారులు ఉన్నా 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్నవారు సుమారు లక్షా 26 వేల మంది ఉన్నారు. ఇప్పటి వరకు 1,04,500 మంది రైతులు ఈ పథకంలో నమోదై ఉన్నారు. మరో 21,153 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉన్నది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన 7,991 మంది రైతులు బీమా పథకంలో తమ పేర్లు నమోదు చేసుకోలేదు. 12,725 మంది సన్న, చిన్నకారు రైతులు, 437 మంది ఐదెకరాలకు మించి భూమి ఉన్న రైతులు రైతు బీమా పథకంలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉన్నది. వీరందరు ఆగస్టు 5వ తేదీ వరకు రైతుబీమా పథకంలో చేరేందుకు అవకాశం ఉన్నది.

ఫ వయస్సు నిబంధనే ప్రతిబంధకం...

అకాల మృత్యువు పాలైన రైతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి భరోసాను కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నిబంధనల కారణంగా నీరుగారిపోతున్నది. వయో పరిమితి కారణంగా వేలాదిమంది రైతులు బీమాకు దూరమై కష్టకాలంలో తమ కుటుంబాలకు ఆసరా అందని పరిస్థితి నెలకొందని ఆందోళనకు గురవుతున్నారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్నవారు బీమా పథకంలో చేరేందుకు అర్హులు. దీంతో 60 సంవత్సరాల నుంచి ఆపై వయస్సు ఉన్న రైతులు చనిపోతే వారికి బీమా సొమ్ము అందే అవకాశమే లేకుండా పోతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో 70 ఏళ్ల పైబడ్డవారు కూడా రైతులుగా, వ్యవసాయ కూలీలుగా, ఉపాధిహామీ కూలీలుగా పనిచేస్తున్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి మాత్రమే బీమా అమలు చేస్తుండడంతో జిల్లాలో సుమారు 75 వేల మంది రైతులు ప్రభుత్వ బీమా పథకంలో చేరే అవకాశాన్ని, చనిపోతే కుటుంబాలకు ఆసరా పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. రైతు బంధు పథకంలో అర్హత ఉన్న పట్టాదారులు 2,00,075 మంది కాగా లక్షా 25 వేల మంది పైచిలుకు రైతులకే ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉండడంతో సుమారు 75 వేల మంది రైతులు విధి వక్రించి అకాల మరణం పాలైతే వారి కుటుంబాలు బీమా సహాయం పొందే అవకాశం లేకుండా పోతున్నది. వ్యవసాయం చేసే ప్రతి వ్యక్తి రైతే అయినందువల్ల వయస్సు నిబంధనను తొలగించి అందరిని బీమా పథకంలో అర్హులుగా ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-07-15T01:14:30+05:30 IST