కేబుల్ బ్రిడ్జి పోలీస్ ప్రారంభం
ABN , First Publish Date - 2023-07-09T00:24:38+05:30 IST
కరీంనగర్ కేబుల్‌బ్రిడ్జి వద్ద సందర్శకులు, ఇతర ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, సందర్శకులకు భద్రత కల్చించేందుకు, 24 గంటలు పెట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా కేబుల్ బ్రిడ్జి పోలీస్‌ను ప్రారంభించారు.
కరీంనగర్ క్రైం, జూలై 8: కరీంనగర్ కేబుల్‌బ్రిడ్జి వద్ద సందర్శకులు, ఇతర ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, సందర్శకులకు భద్రత కల్చించేందుకు, 24 గంటలు పెట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా కేబుల్ బ్రిడ్జి పోలీస్‌ను ప్రారంభించారు. కేబుల్ బ్రిడ్జి సందర్భనకు ప్రతిరోజు వేలాదిమంది వస్తున్నారు. దీనివల్ల కేబుల్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కొందరు ఆకతాయిలు బైక్‌లతో స్టంట్లు చేస్తూ సందర్శకులను ఇబ్బంది పెడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని శనివారం పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు కేబుల్ బ్రిడ్జి పోలీస్‌ని ప్రారంభించారు. ఒక ఎస్‌ఐ, సిబ్బంది, ఒక వాహనంతోపాటు రెండు బైక్‌లు, ఇతర సామగ్రిని అందించారు. ఈ పోలీస్ సిబ్బంది కేబుల్ బ్రిడ్జిపై పెట్రోలింగ్ చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, అక్కడికి వచ్చే మహిళలు, బాలికలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తారు. వాహనాల రద్దీ పెరిగిన సమయంలో క్రమబద్ధీకరించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సందర్భంగా సీపీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ కేబుల్ బ్రిడ్జి పరిసరాలను ఆకర్షణీయంగా ఉంచవలసిన బాధ్యత సందర్శకులపై కూడా ఉందన్నారు. కేబుల్ బ్రిడ్జి సందర్శించే వేలాదిమంది సందర్శకులు ఐస్ క్రీములు చాట్, ఇతర తినుబండారాలు తిని బ్రిడ్జి పైన పడి వేయడం వల్ల చెత్త పేరుకు పోయి కేబుల్ బ్రిడ్జి ఆకర్షణ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. సందర్శకులు తిను బండారాలు మొదలైన వాటిని ఎక్కడ పడితే అక్కడ పడవేయకుందా డస్ట్‌బిన్లలో మాత్రమే వేయాలని సూచించారు. కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఉన్న బటర్‌ఫ్లై ఐలాండ్, కేబుల్ బ్రిడ్జి జంక్షన్ వద్ద ఉన్న ఐలాండ్, ఇతర హైలాండ్ పైకి ఎక్కి ఫోటోలు దిగకూడదన్నారు. ఐలాండ్ పైకెక్కి ఫోటోలు దిగే సందర్భంలో జారిపడే అవకాశం ఉందన్నారు. కేబుల్ బ్రిడ్జి పైన సెల్ఫీలు, వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్‌ల కోసం రీల్స్ చేసే సమయంలో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది యువకులు బైక్‌లను సరదా కోసం వేగంగా నడిపితే సందర్శకులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తోపుడు బండ్లు, ఐస్ క్రీమ్ బండ్లు, చాట్ బండ్లు కేబుల్ బ్రిడ్జి పైకి వెళ్లడం వల్ల సందర్శకులకు, బ్రిడ్జిపై నుంచి వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని ఈ బండ్లను బ్రిడ్జి పైకి అనుమతించబోమన్నారు. కేబుల్ బ్రిడ్జి పరిసరాలు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయని, ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి తప్పుడు పనులకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శబ్ధ కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను బిగించి వాహనాలు నడుపడం, విన్యాసాలకు పాల్పడేవారి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు.