అన్నిరంగాల్లో అగ్రగామిగా కరీంనగర్‌ జిల్లా

ABN , First Publish Date - 2023-03-28T00:07:20+05:30 IST

కరీంనగర్‌ జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

 అన్నిరంగాల్లో అగ్రగామిగా కరీంనగర్‌ జిల్లా
అవార్డులు అందుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బందితో మంత్రి గంగుల కమలాకర్‌

- ‘పల్లె ప్రగతి‘తో గ్రామాల అభివృద్ధి

- మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కారం జిల్లాస్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవాన్ని మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌, మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన 11 మండలాల్లోని 27 గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేసి విజయవంతం చేశారన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పల్లెల స్వరూపం పూర్తిగా మారిపోయిందన్నారు. పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పనులను గ్రామాల్లో చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. జిల్లాలో ఇప్పటికే అద్భుతమైన రోడ్లు, కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం, మెడికల్‌ కళాశాల ఏర్పాటు, ఆధ్యాత్మికతను పెంపొందించేలా వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమా అగర్వాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైనీ కలెక్టర్లు లెనిన్‌, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్‌డీవో శ్రీలత రెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జువేరియా, డీడబ్ల్యువో సబిత పాల్గొన్నారు.

చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

పోషక విలువలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నచిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం జీవించవచ్చని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పోషణ్‌ అభియాన్‌-పోషణ్‌ పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన మేళాను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు తృణధాన్యాలను మాత్రమే ఆహారంగా తీసుకున్నారని తెలిపారు. అందువల్లే వాళ్లు ఎటువంటి వ్యాధులు లేకుండా జీవించారన్నారు. తృణ ధాన్యాలైన కొర్రలు, సామలు, ఊదలు వంటి వాటిని భోజనంగా తీసుకోవాలని, వాటివల్ల 90 శాతం ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు.

Updated Date - 2023-03-28T00:07:20+05:30 IST