KTR: కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ఖాయం!

ABN , First Publish Date - 2023-04-13T02:28:23+05:30 IST

మోదీ వచ్చి గల్లీ గల్లీ, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా.. కాంగ్రెసోళ్లు కాళ్లావేళ్లా పడ్డా.. పేదల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్‌ను ఎవరూ ఓడించలేరని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

KTR: కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ఖాయం!

రాష్ట్రంలో 60 లక్షల బలగం ఉంది

ఆ బలగమే ఆయన్ను గెలిపిస్తుంది

మోదీ గల్లీగల్లీ తిరిగినా.. కాంగ్రెస్‌ కాళ్లావేళ్లా

పడ్డా.. ఆ పార్టీలకు డిపాజిట్లూ రావు

ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కాలేజీ ప్రారంభం

సిరిసిల్ల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మోదీ వచ్చి గల్లీ గల్లీ, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా.. కాంగ్రెసోళ్లు కాళ్లావేళ్లా పడ్డా.. పేదల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్‌ను ఎవరూ ఓడించలేరని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో గెలిచి, కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటిదాకా ఎవరూ హ్యాట్రిక్‌ సాధించలేదని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అన్నారు. 60 లక్షల బలగమే కేసీఆర్‌కు హ్యాట్రిక్‌ విజయాన్ని అందిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కొడుకునైనా, దేశంలో ఎక్కడికి వెళ్లినా సిరిసిల్ల ఎమ్మెల్యేనే అంటారని, అది సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదమేనని తెలిపారు. ‘ఈ రోజు వేదిక మీద నిలబడి మాట్లాడే అదృష్టం కల్పించింది మీరు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. పేరుకు మంత్రిని కావచ్చు. ముఖ్యమంత్రి కొడుకును కావచ్చు. మీరు సిరిసిల్లలో నన్ను గెలిపిస్తేనే హైదరాబాద్‌, ఢిల్లీలో నాకు విలువ. అమెరికాకు పోయినా సిరిసిల్ల ఎమ్మెల్యే గానే పిలుస్తారు. మీరు బువ్వ పెడితేనే అక్కడ నాకు గుర్తింపు. నాకు జన్మనిచ్చింది నా తల్లి. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల ముస్తాబాద్‌ గడ్డ. మీకు ఎంత చేసినా ఎన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినా.. నాపై చూపుతున్న ప్రేమకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను’’ అని కేటీఆర్‌ అన్నారు.

ఒకప్పుడు తెలంగాణ అంటే తెగని పంచాయితీ, అంతులేని కథగా ఉండేదని, సినిమాల్లో కూడా జోకులు వేసుకునేవారని అన్నారు. తెలంగాణ ఇస్తే పాలించే సత్తా ఉందా? అని గేలి చేసేవారని.. ఇప్పుడు పాలనలో దేశానికే దిక్సూచిగా మారిందని చెప్పారు. ‘జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి. రూ.15 లక్షలు జమ చేస్తా. విదేశాల నుంచి నల్లధనం తెస్తా’ అని 2014లో మోదీ అన్నారని, 2022కల్లా రైతుల అదాయం రెట్టింపు చేస్తానని చెప్పారని.. ఇవి జరిగాయా? అని ప్రశ్నించారు. మోదీ రాకముందు గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 ఉంటే ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను దద్దమ్మగా అభివర్ణించారని, సిలిండర్‌కు దండం పెట్టి తనకు ఓటు వేయాలని కోరాడని.. ఇప్పుడు సిలిండర్‌ ధర రూ.1200 అయిందని గుర్తుచేశారు. పిరం అయిన ప్రధానిగా మారాడన్నారు. అప్పులు, అవినీతి ఆకాశంలో ఉంటే.. సామాన్యులు పాతాళంలోకి వెళ్లారని విమర్శించారు. కరీంనగర్‌ ఎంపీగా పిచ్చోడిని తెచ్చుకున్నామని, పార్లమెంట్‌లో కరీంనగర్‌ పరువు తీస్తున్నాడని అన్నారు. దమ్ముంటే కాలువలు తవ్వుదామని, ప్రాజెక్ట్‌లు నిర్మిద్దామని, మన పిల్లలకు కొలువులు వచ్చేలా చూద్దామని చెప్పారు. పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు న్యాయం చేస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా అర్హులు మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి అవసరం

‘తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు కాదు.. మేధావులు. ఎవరేం చేస్తున్నారో గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రె్‌సకూ డిపాజిట్లు గల్లంతవుతాయి’ అని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్లలో 35 ఎకరాల్లో రూ.69.50 కోట్లు వెచ్చించి నిర్మించిన వ్యవసాయ డిగ్రీ కళాశాల భవన సముదాయాన్ని మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఒక క్లాస్‌రూంలో విద్యార్థుల్లా కూర్చొని స్పీకర్‌, మంత్రులు కళాశాలలోని ప్రత్యేకతలను విన్నారు. ఈ సందర్భంగా రైతులు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సభలో పోచారం మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వం అవసరమని తెలిపారు. రాష్ట్రంలో కొందరు దుర్మార్గులు అవగాహన లేక మాట్లాడుతున్నారన్నారు.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్‌ లీకేజీలో కేటీఆర్‌కు సంబంధం ఏమిటని నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌పై దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. రైతులు తాము తినకపోయినా పంటలు పండించి అన్నదానం చేస్తారని.. అదానీ, ప్రధాని చేయరని అన్నారు. కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం లేదని, రాజకీయ దాడులు చేస్తూ తెలంగాణ అంటే వ్యతిరేకత ప్రదర్శిస్తోందని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఒక చేను, చెయ్యి ఖాళీ లేవని.. పనిచేయడానికి మనుషులు సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికొచ్చి బతుకుతున్నారని చెప్పారు. సీఎం అనుమతితో వచ్చే విద్యా సంవత్సరంలోనే వ్యవసాయ పీజీ కాలేజీని ప్రారంభిస్తామన్నారు. ప్రతిపక్షాలు ఏమనుకున్నా కళ్లు ఉండి చూడలేని వారు ఉన్నా, రైతులు మాత్రం కేసీఆర్‌ అంటే.. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని తమ గుండెల్లో నిక్షిప్తం చేసుకున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జిల్లెల్ల కళాశాలకు జగ్జీవన్‌రామ్‌ పేరు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-04-13T02:28:23+05:30 IST