మోగిన నగారా

ABN , First Publish Date - 2023-10-10T01:18:05+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.

 మోగిన నగారా

- నవంబర్‌ 30న ఎన్నికలు

- 15న హుస్నాబాద్‌లో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్‌

- 17న సిరిసిల్లలో బహిరంగ సభ

- 15, 16 తేదీల్లో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల ప్రకటన

- ఊపందుకోనున్న ప్రచారం

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబరు 3వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అయి ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటనతో ఎన్నికల ఘట్టం పూర్తవుతుంది. నవంబర్‌ 3 నుంచి 10వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 13న నామినేషన్లను పరిశీలిస్తారు. 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంటుంది. నవంబరు 30వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత నెలరోజుల వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తికానున్నది.

ఉమ్మడి జిల్లా పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మానకొండూర్‌, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డు స్థానాలు.

కరీంనగర్‌, హుజురాబాద్‌, హుస్నాబాద్‌, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలు జనరల్‌ స్థానాలు .

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 31,12,283 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 27,87,549 మంది ఓటర్లుండగా ప్రస్తుతం కొత్తగా మరో 3,24,734 ఓట్లు పెరిగాయి.

జిల్లాలోని కరీంనగర్‌, రామగుండం నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

ప్రస్తుతం 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హుజురాబాద్‌లో బీజేపీ, మంథనిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మిగతా 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలున్నారు.

15న బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీ ఫారాలు

అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, వొడితెల సతీష్‌కుమార్‌, కేటీఆర్‌, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌, దాసరి మనోమర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌కు మళ్లీ వారి వారి నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. కోరుట్ల నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగర్‌రావుకు బదులు ఆయన కుమారుడు డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌కు, వేములవాడలో చెన్నమనేని రమేశ్‌బాబుకు బదులు చల్మెడ లక్ష్మినర్సింహారావుకు, హజురాబాద్‌లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డికి పోటీచేసే అవకాశం కల్పించారు. వీరందరికి ఈనెల 15న హైదరాబాద్‌లో జరిగే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ బీ ఫారాలను అందజేస్తారు. అభ్యర్థులుగా ప్రకటించిన నాటి నుంచి వీరంతా ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక విడత ప్రచారం పూర్తి చేసుకున్నారు.

తొలి అడుగు హుస్నాబాద్‌లో..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీ ఫారాలను అందజేసిన తర్వాత అక్టోబరు 15న సాయంత్రం హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. 2018 ఎన్నికల సందర్భంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నియోజకవర్గం నుంచే ప్రచారం ప్రారంభించగా ఆ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థులు 88 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందారు. ఈసారి కూడా ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడం వెనక సెంటిమెంటే ప్రధాన కారణమని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. పితృపక్షాలు ముగిసి మంచి రోజులు ప్రారంభమయ్యే రోజే కాకుండా అక్టోబరు 15 ఒకటి ప్లస్‌ అయిదు అంటే ఆరు వస్తుంది. కేసీఆర్‌ లక్కీ నంబర్‌ ఆరుతోపాటు గతంలో వర్కవుట్‌ అయిన సెంటిమెంట్‌ కేంద్రం కావడంతో హుస్నాబాద్‌ ప్రచార సభకు ప్రాధాన్యం పెరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి 17న సిరిసిల్లలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారని సమాచారం.

కాంగ్రెస్‌ తొలి జాబితా 15ననే..

అక్టోబరు 15న మంచి రోజులు ప్రారంభమవుతున్నందున కాంగ్రెస్‌ పార్టీ కూడా తన తొలి జాబితాను అదే రోజు ప్రకటిస్తుందని తెలిసింది. దాదాపుగా అన్నీ స్థానాల అభ్యర్థులను 15న ప్రకటిస్తారని పార్టీవర్గాలు అంటున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా అక్టోబరు 15 లేక 16న అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా మంథని నుంచి శ్రీధర్‌బాబు, జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగారావు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌రెడ్డి, రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్‌, పెద్దపల్లి నుంచి విజయరమణారావు, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, మానకొండూర్‌ నుంచి డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్‌ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి, హుజురాబాద్‌ నుంచి వొడితెల ప్రణవ్‌రావు, హుస్నాబాద్‌ నుంచి పొన్నం ప్రభాకర్‌ అభ్యర్థులుగా అవకాశం పొందనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. కరీంనగర్‌, హుస్నాబాద్‌ స్థానాలు ఒకటితో ఒకటి ముడిపడి ఉండడంతో ఒకచోట అభ్యర్థి మారితే మరో చోట మారే అవకాశాలున్నాయని అంటున్నారు.

కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌

బీజేపీ నుంచి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. హుజురాబాద్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మళ్లీ బరిలో నిలువ నున్నారు. మానకొండూర్‌ నుంచి గడ్డం నాగరాజు, సొల్లు అజయ్‌వర్మ, దరువు ఎల్లయ్య, చొప్పదండి నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్య, లింగంపల్లి శంకర్‌, హుస్నాబాద్‌ నుంచి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, కర్నకంటి మంజుల, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. కోరుట్ల నుంచి డాక్టర్‌ జేఎన్‌ వెంకట్‌, సురభి సునీల్‌రావు, జగిత్యాల నుంచి బోగ శ్రావణి, ధర్మపురి నుంచి కన్నం అంజయ్య, డాక్టర్‌ వివేక్‌, వేములవాడ నుంచి చెన్నమనేని వికాస్‌రావు, తుల ఉమ, మంథని నుంచి సునీల్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌, నల్ల మనోహర్‌రెడ్డి, సిరిసిల్ల నుంచి లగిశెట్టి శ్రీనివాస్‌, రామగుండం నుంచి రావుల రాజేందర్‌, క్యాస శ్రీనివాస్‌, రాజేశ్‌శర్మ టికెట్‌ ఆశిస్తున్నారు.

ముమ్మరం కానున్న ప్రచారం

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందు నుంచే బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత ప్రచారం చేయగా, టికెట్లను ఆశిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు కూడా వారివారి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డులతో ఆశావహులంతా ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులు, సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎన్నికల నగారా మోగడంతో ఇంకా ప్రచారం ముమ్మరం కానున్నది.

ఎన్నికల కోడ్‌ అమలు

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో సోమవారం నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే విధంగా పెడుతున్న పోస్టింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టి సంబంధిత గ్రూప్‌ అడ్మిన్‌తోపాటు పోస్టింగ్‌చేసిన వారిపై చర్యలు తీసుకుంటారు. రాజకీయ పార్టీల నాయకులు ఇతర పార్టీల నాయకులను కులాలు, మతాలు, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య విబేధాలను పెంచేలా రెచ్చగొట్టడం కానీ, వైష్యమ్యాలు సృష్టించవద్దు. నాయకులు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు వ్యక్తిగత జీవితాలు, ప్రజలతో సంబంధం లేని జోలికి పోవద్దు. నిర్ధారణ చేసుకోకుండా ఇతర పార్టీలు నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయవద్దు. ఓట్ల కోసం కులాభిమానం, మత విశ్వాసం వాడుకోవద్ద. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, ఆలయాలు, చర్చీలను, ఇతర ప్రార్థనా మందిరాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోరాదు. ఓటర్లకు డబ్బులివ్వడం, బెదిరించడం, ఒకరి ఓటు మరొకరు వేయడం, పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం నిషేధం. ప్రజలు 50వేల కంటే ఎక్కు నగదును తీసుకెళ్లాలంటే సరైన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఆసుపత్రి బిల్లుల చెల్లింపుల కోసమైతే రోగి రిపోర్టులు, శుభకార్యాల కోసమైతే సంబంధిత ఆధారాలు, వస్తువులు, ఽధాన్యం, భూమి విక్రయిస్తే బిల్స్‌, డాక్యుమెంట్లు చూపించాలి. లేదంటే పోలీసులు సీజ్‌ చేసి ఎన్నికలు ముగిశాక ఆధారాలు చూపితే తిరిగి ఇస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లతో ప్రచారం చేయకూడదు వంటి అనేక అంక్షలు అమల్లోకి వస్తాయి.

ముఖ్యమైన రోజులు:

నవంబరు 3: ఎన్నికల నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

నవంబరు 10: నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ

నవంబరు 13: నామినేషన్ల పరిశీలన

నవంబరు 15: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ

నవంబరు 30: పోలింగ్‌

డిసెంబరు 3: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

Updated Date - 2023-10-10T01:18:05+05:30 IST