పక్కదారి పడుతున్న పీడీఎస్ బియ్యం
ABN , First Publish Date - 2023-02-16T01:01:43+05:30 IST
పేదల అందించేందుకు ఉద్దేశించిన రేషన్ బియ్యం దళారీల జేబులు నింపుతోంది.
-పట్టించుకోని అధికారులు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
పేదల అందించేందుకు ఉద్దేశించిన రేషన్ బియ్యం దళారీల జేబులు నింపుతోంది. నెలనెలా వందలాది క్వింటాళ్ల బియ్యం గోదావరి మీదుగా సరిహద్దులు దాటుతూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాలకు తరలివెళ్తున్నాయి. ఇంతకాలం గ్రామాల్లో తిరిగి చాటుమాటుగా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసిన దళారులు నేరుగా రేషన్‌షాపుల వద్దే వాహనాలను పెట్టి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపులకు బియ్యం చేరకుండానే గోదాంల నుంచి దళారుల డెన్‌లలోకి లారీలతో తరలిస్తున్నారని సమాచారం. అధికార పార్టీ అండదండలు ఉన్న కొందరు దళారీలు రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకుని రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.
ఫ జిల్లా కేంద్రంలోనూ యఽథేచ్ఛగా దందా
గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా యంత్రాంగం అంతా కొలువై ఉండే జిల్లా కేంద్రంలో కూడా రేషన్ బియ్యం అక్రమదందా యథేచ్ఛగా సాగుతుంటే అరికట్టాల్సిన యంత్రాంగం మొద్దు నిద్రపోతోంది. ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులపై బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంటే దళారులు వాటిని కిలోకు 10 రూపాయలకు కొనుగోలు చేస్తూ 20 నుంచి 25 రూపాయలకు మళ్లీ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వానాకాలంలో దిగుబడి తక్కువ రావడం, ప్రస్తుత సీజన్‌లో మొగి పురుగు కారణంగా పొలాలు ఎండి పోతుండడంతో మార్కెట్‌లో బియ్యం ధర ఊహించని విధంగా పెరిగింది. దీంతో రేషన్ బియ్యం అక్రమదందా చేసేవారు మరింత రేటును పెంచి ఆ బియ్యాన్నే పాలిష్ చేసి బహిరంగ మార్కెట్‌లో అమ్ముతూ లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ దందా చేసేవారి నుంచి సివిల్ సప్లయిస్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలకు, రాజకీయ నాయకులకు ఈ దళారీలు ఎంతో కొంత ముట్టజెప్పి తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఫ నామమాత్రంగా కేసులు
నామమాత్రంగా అప్పుడప్పుడు కేసులు నమోదు చేసినా పూర్తిస్థాయి నియంత్రణ లేకపోవడంతో జిల్లా కేంద్రంలో కూడా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో 566 చౌకధరల దుకాణాల ద్వారా 8,13,854 కుటుంబ సభ్యులకు సబ్సిడీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2,78,751 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 1,49,000 రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత కార్డులు కాగా మరో లక్షా 29 వేల పైచిలుకు రేషన్ కార్డులకు రాష్ట్ర ఆహార భద్రత పథకం కింద బియ్యం సమకూరుస్తున్నారు. 2,63,026 ఆహారభద్రత కార్డుల ద్వారా 7,74,457 మందికి ఒక్కొక్కరికి ఐదుకిలోల చొప్పున 38,722.85 క్వింటాళ్లు, 15,687 అంత్యోదయ ఆహారభద్రత కార్డులు కలిగిన 39,359 కుటుంబాలకు ఒక్కోకుటుంబానికి 35 కిలోల చొప్పున 5490.45 క్వింటాళ్ల బియ్యం, 38 అన్నపూర్ణ కార్డుల ద్వారా ఒక్కోకుటుంబానికి 10 కిలోల చొప్పున 3.8 క్వింటాళ్ల బియ్యం మొత్తం 44,217.1 క్వింటాళ్ల బియ్యాన్ని లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రజాపంపిణీ బియ్యం, ఇతర సరుకులు ఆన్‌లైన్‌కి అనుసంధానం చేస్తూ ఎలాంటి అవకతవకలు జరుగకుండా పారదర్శకతతో పంపిణీ చేసేందుకు ఈ-పాస్ మిషన్ ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసింది. ఏప్రిల్ 2018 నుంచి రాష్ట్రంలో రేషన్‌కార్డు కలిగిన లబ్దిదారులు ఎక్కడి నుంచైనా బియ్యం, ఇతర సరకులను తీసుకునే సదుపాయం కల్పించింది. ఒకే దేశం ఒకేకార్డు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి 1 నుంచి అమల్లోకి తేవడంతో రేషన్‌కార్డుదారులు సంబంధిత రేషన్ దుకాణం నుంచే కాకుండా దేశంలో ఎక్కడైనా తీసుకునే అవకాశం కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ బియ్యంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు అనేక సంస్కరణలు తీసుకువస్తున్నప్పటికీ అక్రమాల దందా క్షేత్రస్థాయిలో ఆగడం లేదు. జిల్లాలో 2022 జనవరి 1 నుంచి డిసెంబరు-2022 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా బియ్యం సరఫరా చేస్తున్న 93 మందిపై మాత్రమే కేసులు నమోదుచేసి వారి నుంచి 14074.27 క్వింటాళ్ల బియ్యాన్ని జప్తు చేశారు. పోలీసులు, ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుండడం, పౌరసరఫరాలశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టి అక్రమాలను నియంత్రించక పోవడంతో పీడీఎస్ రైస్ దందా కొనసాగుతూనే ఉంది. గతంలో కొంత మంది దళారులు ఇళ్లవద్ద నుంచి చాటుమాటున రేషన్ బియ్యాన్ని కొనుగోలుచేసి అధిక ధరలకు విక్రయించే వారు. ప్రస్తుతం ఏకంగా రేషన్ దుకాణాలకు సమీపంలోనే మైకులో బియ్యం కొనుగోలుచేస్తామంటూ అనౌన్స్‌చేస్తూ దుకాణాల వద్దనే బియ్యాన్ని తీసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాల ముందే మహిళలు, పురుషులు కూర్చుని బియ్యం తీసుకుని డబ్బులుు ఇవ్వడమో లేక ఫోన్‌పే, గూగూల్‌పే ద్వారా డబ్బులు ఇవ్వడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. అక్రమ దందా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.