వరికి మొగి పురుగు గండం
ABN , First Publish Date - 2023-01-20T01:12:18+05:30 IST
యాసంగి వరిసాగుపై రైతులు పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతున్నాయి. మొగి పురుగు (కాండం తొలిచే పురుగు) వరి పైరును ఎదగకుండా చేయడమే కాకుండా వేర్లు కుళ్లి మొక్కలు ఎండిపోయేలా చేస్తోంది. దీంతో ఇప్పటికే వేలాది రూపాయలు వెచ్చించిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
యాసంగి వరిసాగుపై రైతులు పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతున్నాయి. మొగి పురుగు (కాండం తొలిచే పురుగు) వరి పైరును ఎదగకుండా చేయడమే కాకుండా వేర్లు కుళ్లి మొక్కలు ఎండిపోయేలా చేస్తోంది. దీంతో ఇప్పటికే వేలాది రూపాయలు వెచ్చించిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సూచించిన మందులు చల్లినా, పిచికారి చేసినా ఫలితం లేకుండా పోవడంతో కొందరు రైతులు వరి పైరును తీసేసి మళ్లీ కొత్తగా నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో ఎకరాపై 12 నుంచి 13 వేల రూపాయల వరకు ఖర్చు చేసి ఉన్నందున మరికొందరు రైతులు కొత్తగా మళ్లీ పెట్టుబడి పెట్టే స్థితి లేక ఉన్న పైరును మందులతో దక్కించుకునే ప్రయత్నిస్తున్నారు.
ఫ జిల్లాలో 2,00,478 ఎకరాల్లో వరి సాగు
జిల్లాలో యాసంగిలో ఇప్పటికే రైతులు 2,00,478 ఎకరాలలో వరి నాట్లు వేశారు. ఒక్కో ఎకరాపై దుక్కి దున్నిన నాటి నుంచి మొదలుకొని నాట్లు వేసిన తర్వాత చల్లే మందు వరకు సుమారు 12 నుంచి 13 వేల రూపాయలు ఖర్చు చేశారు. మొగి పురుగు ఉధృతితో నాట్లు వేసిన పొలాలు ఎర్రబడి పోయి పిలకలు రావడం లేదు. ఎన్ని క్రిమిసంహారక మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. డిసెంబరులో నాటు వేసిన పొలాల్లో మొగి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నది. వానాకాలంలో మొగి పురుగుల కారణంగా వరిలో తెల్లకంకి ఏర్పడి సగానికి సగం దిగుబడి తగ్గిపోయింది.
ఫ డిసెంబరులో నాట్లు వేసిన పొలాల్లో ఉధృతంగా..
యాసంగిలో నాట్లు వేసేందుకు ఎక్కువ సమయం లేకపోవడంతో నవంబరు మొదటి వారంలో నార్లు పోసి డిసెంబరులో రైతులు ఎక్కువ మంది నాట్లు వేశారు. నారు దశలో రైతులు పురుగులను గమనించలేదు. ఆ పురుగు నాట్ల తర్వాత ఉధృతి చెంది పైరును నష్టపరుస్తోంది. ప్రభావశీలమైన సింథటిక్ పెరిథ్రయిడ్స్ కూడా పురుగుల ఉధృతిని అరికట్టడం లేదు. వ్యవసాయశాఖ సూచనల మేరకు రైతులు 3జీ, 4జీ గుళికలను ఎకరానికి వెయ్యి నుంచి 1200 రూపాయలు ఖర్చు చేసి పొలాల్లో చల్లారు. మొగి పురుగు చావకపోవడంతో తిరిగి క్లోరో ఫైరిఫాస్, లమ్‌డా సైలోథ్రిన్ క్రిమిసంహారక మందులను మరో 750 రూపాయలు వెచ్చించి స్ర్పే చేసినా ఫలితం లేకుండా పోతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జింక్ లోపం కూడా తోడవడంతో మొగి పురుగు ఉధృతి చెందుతుందని భావించి రైతులు జింక్ మందులు స్ర్పే చేశారు. మొగి పురుగు కారణంగా ఒక్కో ఎకరానికి 3 వేల నుంచి 3500 రూపాయల వరకు ఎరువులు, క్రిమిసంహారక మందులకు వెచ్చించాల్సి వస్తున్నది. దీంతో పలువురు రైతులు దిగుబడి తగ్గిపోతుందేమోనని ఆందోళన చెంది నాట్లు వేసిన పొలాలను చెడగొట్టి మళ్లీ నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు కూడా యాసంగిలో వరి పిలక దశలో మొగి పురుగు(కాండం తొలిచే పురుగు) ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అందుకోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించడంతో రైతులు ఈ సీజన్‌లో పంట నష్టం తప్పదేమోననే ఆందోళనకు గురవుతున్నారు.
ఫ ఆందోళన వద్దు.. పురుగును అరికట్టే చర్యలు చేపట్టండి...
- జిల్లా వ్యవసాయశాఖ అధికారి వాసిరెడ్డి శ్రీధర్
యాసంగిలో మొగి పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. దీని ఉధృతిని గమనించడానికి పొలాల్లో దీపపు ఎరలను, లింగార్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. పిలక దశలో ఎకరాకు మూడు లింగార్షక బుట్టలు పెట్టి, వారానికి ఒక్కో బుట్టలో 25 నుంచి 30 పురుగులు పడితే తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లార్వా దశలో వరి పైరును నష్టపరుస్తున్నట్లు సమాచారం ఉన్నది. అలాంటి ప్రాంతాల్లో ఫినాల్‌ఫాస్ 2 మిల్లీలీటర్లు, ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 50 ఎస్.పి. 2 గ్రాములను లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలి. నాట్లు వేయకపోతే వారం ముందు ఎకరాకు సరిపడే నారుకు 800 గ్రాముల కార్బోఫ్యురాన్ 3జీ గుళికలు లేదా 600 గ్రాముల పిఫ్రోనిల్ 0.3 జీ గుళికలు వేయాలి. పిలక దశలో ఉన్న వరి పైరులో ఎకరాకు కార్బోఫ్యురాన్ 3 జీ గుళికలు 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 4 జీ గుళికలు 8 కిలోలు లేదా క్లోరామ్ ట్రానిలిప్రోల్ 0.4 జీ గుళికలు నాలుగు కిలోలు వేయాలి.