గీత కార్మికులకు మొండి చెయ్యి

ABN , First Publish Date - 2023-06-09T01:19:54+05:30 IST

పొట్ట కూటి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తూ జీవించే గీత కార్మికుల బతుకులు ప్రమాదకరం.

గీత కార్మికులకు మొండి చెయ్యి

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పొట్ట కూటి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తూ జీవించే గీత కార్మికుల బతుకులు ప్రమాదకరం. వారి గీత మార్చేందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సరైన ఆదరణ లేక రోజు రోజుకు కుల వృత్తి అంతరించిపోతున్నది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, మొగి పురుగు దెబ్బకు తాటి, ఈత వనాలు అంతరించిపోతున్నాయి. ఊరూరా, వాడవాడలా వెలసిన బెల్టుషాపుల ధాటికి కల్లుకు గిరాకీ తగ్గిపోయింది. ఒకప్పుడు కుటుంబ పోషణకు ఉపయోగపడ్డ గీత వృత్తి వల్ల లాభం లేదనుకుని ఇప్పటితరం ఆ వృత్తికి దూరం అవుతున్నారు. ఆ వృత్తిని కాపాడేందుకు చర్చలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల వృత్తుల వారికి ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకంలో గీత కార్మికులను విస్మరించడంతో గౌడ కులస్తులు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఈ ప్రభుత్వం తమపై వివక్ష చూపుతున్నదని అంటున్నారు. మరో ఐదు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీసీ ఓటర్లను ఆకర్శించేందుకు కుల వృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని గత నెలలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం నలుగురు మంత్రులతో కలిసి కమిటీని కూడా వేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఈనెల 9వ నుంచి కుల వృత్తులు, చేతివృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. నాయీ బ్రాహ్మణ, రజక, సగర (ఉప్పర), కుమ్మరి (శాలివాహన), అవుసుల, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్ల, పూసాల (కృష్ణ బలిజ), మేదరి, వడ్డెర, ఆరె కటిక, మేర, ఎంబీసీ కులాలకు చెందినవారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రకటించింది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వాలని, కళ్యాణలక్ష్మి పథకం గాకుండా ఇతరత్రా పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లు అనర్హులని పేర్కొంది. ప్రభుత్వం సాయం చేసే కులాల జాబితాలో గౌడ కులస్తులను విస్మరించడంతో గీత కార్మికులు భగ్గుమంటున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమపై వివక్ష చూపుతున్నదని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరూరా, వాడ వాడలా బెల్టుషాపులు విచ్చలవిడిగా వెలుస్తుండడంతో గీత వృత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, ఆ కాణంగా కల్లుకు గిరాకీ తగ్గిపోయిందని చెబుతున్నారు.

ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొట్ట కూటి కోసం తాటి చెట్లు ఎక్కి కల్లు గీసుకుని బతికే తమకు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడంలేదన్నారు. ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై పడి మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందితే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని మాత్రమే కల్పించింది. బ్రాండి షాపుల్లో 15శాతం గౌడ కులస్తులకు కేటాయించారు. కానీ గీత వృత్తిపై ఆధారపడి జీవించే వారికి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సాయం పథకాలను అందించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆదరణ పథకం కింద గీత కార్మికులకు సైకిళ్లు, టీవీఎస్‌ మోపెడ్లు వంటివి సబ్సిడీపై ఇచ్చారు. గౌడ ఫెడరేషన్‌ ద్వారా పలు సబ్సిడీ రుణాలను అందించారు. కానీ ప్రస్తుతం అవేమి ఇవ్వడంలేదు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, తదితర జిల్లాల్లో అనేక మంది గౌడ కులస్తులు కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి గ్రామంలో 30 నుంచి వందకు పైగా వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు. బీసీ జనాభాలో ముదిరాజ్‌ల తర్వాత అత్యధిక మంది గీతకార్మికులు ఉంటారు. ముదిరాజ్‌ కులస్తులకు వలలు, తెప్పలు, ఫిష్‌ట్రేలు, ఐస్‌ ట్రేలు, మోపెడ్లు, చేపల రవాణాకు ట్రాలీఆటోలు, పెద్దఆటోలు, తదితర ఉచితంగానే ప్రభుత్వం అందించింది. సోసైటీల్లో సభ్యులుగా ఉన్న గొల్ల, కుర్మలందరికీ 75శాతం సబ్సిడీపై గొర్రెలను అందించింది. నాయీబ్రాహ్మణులు, రజకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ సౌకర్యం, చేనేత కార్మికులకు రుణమాఫీ వంటివి చేసింది. కానీ గౌడ కులస్తులను మాత్రం ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో గత కొంత కాలంగా ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయలు సాయం అందిస్తామని 15 రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించడంతో గౌడ కులస్తులు కూడా సంబర పడ్డారు. తీరా జాబితాలో గౌడ కులస్తుల ప్రస్తావన లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టీవీఎస్‌ మోపెడ్లు కొనుగోలు చేసేందుకు గాను లక్ష రూపాయల సాయం అందించాలని గౌడ కులస్తులు కోరుతున్నారు. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

- మెట్టు రవి గౌడ్‌, కాల్వశ్రీరాంపూర్‌

కుల వృత్తులు చేసుకునే వారికి ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తుందంటే సంబరపడ్డాం. కానీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తాళ్లు ఎక్కి కల్లు గీసే మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరం. ప్రభుత్వం ఆదుకోవాలి.

ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాం

- బర్ల రాజేశం గౌడ్‌, కుందనపల్లి

గ్రామాల్లో విచ్చలవిడిగా వెలసిన బెల్టుషాపుల వల్ల కల్లుకు గిరాకీ తగ్గింది. కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాం. లక్ష రూపాయల సాయం పథకాన్ని మాకు వర్తింపజేయాలి.

గీత వృత్తిపై ఎందుకంత వివక్ష..

- ముత్యం నాగరాజు, కల్వచర్ల

కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న మేము ఎండిన తాటి, ఈత వనాలతో కల్లు రాక బతుకులీడుస్తున్నాం. చాలీచాలని ఆదాయంతో రెండు పూటలా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం మాపై మొదటి నుంచి వివక్ష చూపుతున్నది.

విస్మరించడం సరి కాదు..

- కాట రవి గౌడ్‌, నర్సాపూర్‌

ఈ ప్రభుత్వానికి గీత కార్మికులు ఏం అన్యాయం చేశారు. మొదటి నుంచి మాపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. బీసీ కుల వృత్తులు చేసుకునే వారికి లక్ష సాయం చేస్తామంటే హర్షించాం. కానీ మాకు ఇవ్వరని తెలిసి ఆందోళన చెందుతున్నాం.

గీత కార్మికులు పేదలే..

- మాచిడి నరేష్‌ గౌడ్‌, గంగాపురి మంథని

కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీత కార్మికులు పేదలే. బెల్టు షాపుల దెబ్బకు కల్లు అమ్ముడుపోక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క పథకం అమలు చేయడం లేదు. మాకు కూడా లక్ష సాయం ఇవ్వాలి.

సాయం అందించాలి..

- బుర్ర నగేష్‌ గౌడ్‌, కమాన్‌పూర్‌

ఎన్నో ఏళ్లుగా గీత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఎలాంటి పథకాలు అమలుచేయలేదు. బీసీ కులాలకు లక్ష సాయం చేస్తామంటున్నారు. మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించి లక్ష సాయం అందించి ఆదుకోవాలి.

పథకాలు ఏమి లేవు

- సింగం సత్తయ్యగౌడ్‌, సర్వాయి పాపన్న గౌడ గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

గీత కార్మికులు చస్తే తప్ప బతకడానికి పథకాలు ఏమి లేవు. తాటి చెట్లు ఎక్కి కల్లు గీసుకునే గీత కార్మికులు ప్రమాదవశాత్తు పడి మరణిస్తే, శాశ్వత అంగ వైకల్యం పొందిన వారికి ప్రభుత్వం రూ.5లక్షల బీమా వర్తింపజేస్తున్నది. ఈ పథకం బతికి ఉన్నోళ్లకు ఏమి ఉపయోగ పడదు. అందరు కుల వృత్తులను అభివృద్ధి చేసేందుకు సబ్సిడీ పథకాలు ఇస్తున్న ప్రభుత్వం గౌడ కులస్తులను విస్మరిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం లక్ష రూపాయల సాయం పథకం అమలుచేయాలి.

మొదటి నుంచి గౌడ జాతిపై చిన్న చూపే..

- బూషనవేన రమేష్‌ గౌడ్‌, ఆల్‌ ఇండియా గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు

తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి గౌడ జాతిపై చిన్నచూపే చూస్తున్నది. మా కోసం ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదు. గొల్లకుర్మలకు సబ్సిడీ గొర్రెలు, మత్స్యకారులకు సబ్సిడీ పథకాలు, నాయీబ్రాహ్మణులు, రజకులకు కరెంట్‌ ఫ్రీ, చేనేత కార్మికులకు సబ్సిడీలు ఇచ్చిన ప్రభుత్వం గీతకార్మికులపై వివక్ష చూపుతున్నది. బీసీ కుల వృత్తుల వారికి ఇచ్చే లక్ష రూపాయల సాయం పథకాన్ని గౌడ్‌లకు కూడా వర్తింపజేయాలి. లేనట్లయితే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం.

Updated Date - 2023-06-09T01:19:54+05:30 IST