తుది దశకు కేబుల్‌ బ్రిడ్జి

ABN , First Publish Date - 2023-03-21T01:11:25+05:30 IST

మానేరుపై నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి.

తుది దశకు కేబుల్‌ బ్రిడ్జి

- ప్రత్యేక ఆకర్షణగా డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌

- వచ్చే నెల 14న మంత్రి కేటీఆర్‌తో ప్రారంభిచేందుకు ఏర్పాట్లు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 20: మానేరుపై నిర్మిస్తున్న కేబుల్‌ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులతో చర్చించి ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్‌ 14న వంతెన. రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా వంతెనను ప్రారంభిస్తారని సమాచారం. దీనితోపాటు కరీంనగర్‌లో నిర్మించతలపెట్టిన టీటీడీ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి భూమిపూజ, ప్రభుత్వ వైద్యకళాశాల ప్రారంభోత్సవాలుంటాయని చెప్పారు. మార్చి నెలలోనే సీఎం జిల్లా పర్యటనకు వచ్చి వీటిని ప్రారంభిస్తారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు భావించారు. బీజీ షెడ్యూల్‌ కారణంగా సీఎం జిల్లాకు ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని తెలియడంతో మంత్రి గంగుల కమలాకర్‌ తీగెల వంతెన ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. ఆయన అందుకు అంగీకరించడంతో ఏప్రిల్‌ 14న కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభిస్తారని తెలిసింది.

ఫ 2018లో పనులు ప్రారంభం

2018లో 180 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేబుల్‌ బ్రిడ్జి పనులు ప్రారంభించింది. పూర్తిగా విదేశీ ఇంజనీరింగ్‌ సాంకేతికతతో నిర్మిస్తున ఈ బ్రిడ్జి నాణ్యతను ఇప్పటికే పలుమార్లు ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించారు. అప్రోచ్‌ రోడ్డు పనులు పూర్తి కాగానే ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు మంత్రి గంగుల కమలాకర్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే వంతెనపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ పనులు పూర్తి చేశారు. ఈ వంతెన ప్రారంభమైతే వరంగల్‌-కరీంనగర్‌ మధ్య ఏడు కిలోమీటర్ల దూరం తగ్గడంతో వాహనదారులకు వ్యయ ప్రయాసలతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. ప్రస్తుతం మానేరు బ్రిడ్జిపై నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ వైపు వాహనాలు వెళ్తుండడంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఈ బ్రిడ్జి ప్రారంభిస్తే వరంగల్‌ వైపునకు వెళ్లే వారి వాహనాలతో మానేరు బ్రిడ్జిపై సమస్య తగ్గుతుంది.

ఫ ఎన్నో ప్రత్యేకతలు

కేబుల్‌ బ్రిడ్జిపై రాకపోకలతోపాటు నగర వాసులు సరదాగా కొద్దిసేపు వంతెనపై కాలక్షేపం చేసే విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతో డైనమిక్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాక పోకలను నిలిపివేసి హైదరాబాద్‌ ట్యాంకు బండ్‌ తరహాలో ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఫ టూరిజం హబ్‌గా కరీంనగర్‌

- మంత్రి గంగుల కమలాకర్‌

అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా చేపడుతున్న తీగెలవంతెన నిర్మాణ పనులు పూర్తికాగా, అప్రోచ్‌రోడ్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. మానేరు రివర్‌ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే మూడవ వాటర్‌ ఫౌంటేన్లు ఏర్పాటు చేస్తున్నాం. వీటితో కరీంనగర్‌ టూరిజం హబ్‌గా మారనుంది.

Updated Date - 2023-03-21T01:11:25+05:30 IST