Share News

మూర్ఖత్వపు పాలన అంతం

ABN , First Publish Date - 2023-12-04T00:47:08+05:30 IST

కేసీఆర్‌ మూర్ఖత్వపు పాలన అంతమైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

మూర్ఖత్వపు పాలన అంతం
మాట్లాడుతున్న బండి సంజయ్‌కుమార్‌

-కాంగ్రెస్‌, రేవంత్‌లకు అభినందనలు

-ముస్లింల ఇళ్లను కూల్చిన వారికే ముస్లింలు ఓట్లేస్తారా

-బీజేపీని అధికారంలోకి తీసుకు రావడమే నాలక్ష్యం

-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌, డిసెంబరు 3: కేసీఆర్‌ మూర్ఖత్వపు పాలన అంతమైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్‌ లాభపడిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. కరీంనగర్‌లో బీజేపీకి ప్రతిసారి ఓట్ల శాతం పెరుగుతుందన్నారు. తనను ఓడించాలనే లక్ష్యంతో ముస్లిం ఇళ్లను కూల్చిన, వక్ఫ్‌ ఆస్తులను కబ్జా చేసిన వాళ్లకే ముస్లింలు ఓటేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇకనైనా హిందు సమాజమంతా ఆలోచించుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్ల గోస పడుతున్న ప్రజలను చైతన్యం చేసేందుకు పోరాడింది బీజేపీ అని లాభపడింది మాత్రం కాంగ్రెస్‌పార్టీ అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాడితే నాతోపాటు ఎంతో మంది కార్యకర్తలపై కేసులు పెట్టి దాడులు చేసి జైలుకు పంపారన్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు మమ్మల్ని ఆదరించలేదు.. అయినా కేసీఆర్‌ మూర్కత్వపుపాలన పీడ విరగడైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కేటీఆర్‌ అధికారంలో ఉన్నన్నాళ్లు మీడియాకు విలువ ఇవ్వలేదని, అహంకారంతో విర్రవీగిండని, ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఎక్కడ లేని మర్యాద వస్తుందన్నారు. కరీంనగర్‌లో ప్రతిసారి తన మెజారిటీ పెరుగుతూ వస్తుందన్నారు. ధర్మం కోసం పోరాడిన బండిసంజయ్‌ విషయంలో ఒకవర్గం అంతా ఒక్కటైనా హిందూ సమాజం ఏమనుకుంటుందో వారికే వదిలేస్తున్నా అన్నారు. తాను ఫిర్యాదు చేసే వరకు 43, 289 పోలింగ్‌ బూత్‌లలో ఓట్లు లెక్కించనేలేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు మొదలయినా, లేక చివర్లో లెక్కించాలి కాని విచిత్రంగా మధ్యలో ఏలా లెక్కిస్తారని ప్రశ్నించారు. తన కోసం బీజేపీకోసం నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి 200 కోట్లు ఖర్చు చేశాడని, పైగా తనపై డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశాడన్నారు. బీజేపీ గ్రాఫ్‌ తగ్గించేందుకు కేసీఆర్‌పెద్ద ఎత్తున కుట్రలు చేశారన్నారు.

Updated Date - 2023-12-04T00:47:12+05:30 IST