Share News

బ్యాంకు రుణం లక్ష్యం పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2023-12-09T00:37:14+05:30 IST

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతీ సంవత్సరం బ్యాంకులు అందించే లింకేజీ రుణాల లక్ష్యం జిల్లాలో వంద శాతం నిర్ణీత గడువులోపు పూర్తవుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

బ్యాంకు రుణం లక్ష్యం పూర్తయ్యేనా?

- జిల్లాలో ఎస్‌హెచ్‌జీ మహిళలకు 69.12 శాతం రుణాలు

- మిగిలింది మరో మూడు నెలల గడువు

జగిత్యాల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతీ సంవత్సరం బ్యాంకులు అందించే లింకేజీ రుణాల లక్ష్యం జిల్లాలో వంద శాతం నిర్ణీత గడువులోపు పూర్తవుతాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు 69.12 శాతం రుణాలను అందించారు. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా ఇంకా ముప్పయి శాతానికి పైగా రుణాలు అందించాల్సి ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో చిన్నపాటి వ్యాపారం చేస్తూ పలువురు నారీమణులు కుటుంబానికి అండగా ఉంటున్నారు. మరికొందరికి రుణాలను బ్యాంకులు అందించాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి జగిత్యాల జిల్లాకు రూ. 634.41 కోట్ల మేర రుణ లక్ష్యం ఉంది. ఇప్పటి వరకు రూ. 439.22 కోట్ల రుణం అందించి 69.12 శాతం లక్ష్యం సాధించింది. ఆర్థిక ఏడాది ముగిసేందుకు మరో మూడు నెలలు ఉండటంతో వంద శాతం లింకేజీ రుణం ఇచ్చేందుకు సిబ్బంది పని చేస్తున్నారు. అయితే నిర్ణీత గడువులోపు వంద శాతం లక్ష్యం పూర్తవుతుందా అన్న అభిప్రాయాలు చోటుచేసుకుంటున్నాయి.

- 14,938 స్వయం సహాయక సంఘాలు..

జిల్లా వ్యాప్తంగా 14,938 స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇందులో 1,77,068 మంది సభ్యులున్నారు. ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు ముందుకు వచ్చే గ్రూపులకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తారు. సంఘాల అర్హతను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు రుణం ఇస్తారు. తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించి ఏడాదిగా పూర్తిచేస్తే మరొక్క మారు అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సిబ్బంది ఆ విధుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో రుణ లక్ష్యానికి పరుగులు తీస్తున్నారు. గ్రామాల్లోని ఐకేపీ సిబ్బంది వారికి ఇచ్చిన లక్ష్యం నెరవేర్చేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇబ్రహీంపట్నం మండలంలో 102.47 శాతం అందించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని గొల్లపల్లి మండలంలో 44.31 శాతం రుణాలు అందించి కనిష్ట స్థాయిలో ఉంది. మిగిలిన మండలాల్లో 70 శాతంనుంచి 44 శాతం మేరకు ఇచ్చారు. జిల్లాలోని బీర్‌పూర్‌లో 46.76 శాతం, బుగ్గారంలో 50.11 శాతం, ధర్మపురిలో 67.59 శాతం, జగిత్యాల రూరల్‌లో 77.25 శాతం, జగిత్యాలలో 84.72 శాతం, కథలాపూర్‌లో 77.53 శాతం రుణాలను అందించారు. అదేవిధంగా కొడిమ్యాలలో 75.47 శాతం, కోరుట్లలో 66.94 శాతం, మల్లాపూర్‌లో 60.78 శాతం, మల్యాలలో 72.42 శాతం, మేడిపల్లిలో 75 శాతం, మెట్‌పల్లిలో 73.15 శాతం, పెగడపల్లిలో 69.92 శాతం, రాయికల్‌లో 71.24 శాతం, సారంగపూర్‌లో 59.54 శాతం, వెల్గటూరులో 80.01 శాతం బ్యాంకు లింకేజీ రుణాలను మహిళా సంఘాలకు అందించారు.

- గత రెండు సంవత్సరాల్లో వంద శాతం..

జిల్లాలో రెండు సంవత్సరాలుగా స్వయం సహాయక మహిళా సంఘాలకు వంద శాతం బ్యాంకు రుణాలను అధికారులు అందించారు. జిల్లాలో 2021-22 సంవత్సరంలో 12,786 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 446.74 కోట్లు రుణాలు అందించాలన్న లక్ష్యానికి గానూ 9,418 సంఘాలకు రూ. 451.44 కోట్ల రుణాలను అందించి 101.05 లక్షాన్ని పూర్తి చేశారు. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 12,496 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 704.21 కోట్ల రుణాలను అందించాలన్న లక్ష్యానికి గానూ 10,213 సంఘాలకు రూ. 709.80 కోట్లు అందించి 100.79 లక్ష్యాన్ని సాధించారు. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 12,012 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 635.41 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటివరకు 5,119 సంఘాలకు రూ. 439.22 కోట్ల రుణాలను అందించి 69.12 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు. వచ్చే యేడాది మార్చి చివరి నాటికి వంద శాతం లక్ష్యం పూర్తి చేయాల్సి ఉంది.

లక్ష్యం సాధిస్తాం...

- నరేశ్‌, డీఆర్‌డీవో, జగిత్యాల

బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం సాధిస్తాం. ఇప్పటికే 69.12 శాతం ఇచ్చాం. ఇంకా మూడు నెలల గడువు ఉంది. ఆ లోపు వంద శాతం సాధిస్తామనే నమ్మకం ఉంది. ప్రతీ మండలంలో లక్ష్యం సాధించాలని సిబ్బందిని ఆదేశించాం. సభ్యులు వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా ఎదిగి వాయిదాలు సక్రమంగా చెల్లించాలి.

Updated Date - 2023-12-09T00:37:15+05:30 IST