TS News: తెలంగాణ సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రచారం: ఠాక్రే
ABN , First Publish Date - 2023-06-18T18:48:40+05:30 IST
తెలంగాణ (Telangana) ప్రజల సొమ్ము లూటీ చేసిన సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో భారీగా బీఆర్‌ఎస్ (BRS) ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావుఠాక్రే ఆరోపించారు.
నల్లగొండ: తెలంగాణ (Telangana) ప్రజల సొమ్ము లూటీ చేసిన సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో భారీగా బీఆర్‌ఎస్ (BRS) ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావుఠాక్రే ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గొప్పల గురించి ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి అక్కడి మీడియాకు వందల కోట్లు అక్రమంగా ఖర్చు చేస్తూ సొంత రాష్ట్రంలోని మీడియాను తొక్కిపెడుతున్నారని (Manik Rao Thakre) దుయ్యబట్టారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక్కో పేజీకి రూ.6 లక్షలు చొప్పున ఆరు పేజీల ప్రకటనలు ఇస్తున్నారని, ఇలా ఇతర రాష్ట్రాల్లో మీడియాకు తెలంగాణ బడ్జెట్‌ను భారీగా ఖర్చు చేసే అధికారం ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగినా మోదీ, అమిత్‌షాలు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో వారు రహస్య స్నేహితులని స్పష్టం అవుతోందన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కలలను, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు.
భట్టి, ఠాక్రే, రోహిత్ సుదీర్ఘ చర్చలు
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు పాదయాత్ర క్యాంపు వద్ద చెట్ల కిందనే గంట పాటు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు, వివిధ పార్టీల నుంచి కీలక నేతల చేరికలు, బీఆర్‌ఎస్ ఎత్తుగడలు వంటి కీలక అంశాలపై ఈ ముగ్గురి మధ్య ప్రత్యేకంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.