TSRTC Govt Merger : గవర్నర్ 5 ప్రశ్నలపై కేసీఆర్ సర్కార్ వివరణ.. ఇక మిగిలిందల్లా ఒక్కటే..!?
ABN , First Publish Date - 2023-08-05T13:07:10+05:30 IST
తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై (Governer Tamilsai) లేవనెత్తిన 5 సందేహాలకు కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) నిశితంగా వివరణ ఇచ్చింది..
తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై (Governer Tamilsai) లేవనెత్తిన 5 సందేహాలకు కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) నిశితంగా వివరణ ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆర్టీసీ విలీనంపై విధివిధానాల విషయంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి 5 ప్రశ్నలతో కూడిన లేఖను గవర్నర్ పంపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. 5 సందేహాలకు వివరణ ఇస్తూ తిరిగి లేఖ రాసింది. కార్పొరేషన్ కన్నా మెరుగైన వేతనాలు ఉంటాయని సర్కార్ లేఖలో వివరించింది. విలీనం తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని ప్రభుత్వం లేఖలో స్పష్టం చేసింది. అయితే.. రాజ్‌భవన్ నుంచి ఇంతవరకూ అక్నోలెడ్జెమెంట్ ఇవ్వడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ లేఖపై రాజ్‌భవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందా అనేదానిపై కేసీఆర్ సర్కార్, ఆర్టీసీ ఉద్యోగుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో.. ఇక మిగిలిందల్లా ప్రభుత్వం ఇచ్చిన వివరణను నిశితంగా పరిశీలించి.. గవర్నర్ ఆమోద ముద్ర వేయడమేనన్న మాట.
బిల్లు ఆమోదించాల్సిందే..!
మరోవైపు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టడంపై ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించారు. బిల్లు ఆమోదించాల్సిందేనని కార్మికులు రాజ్‌భవన్ ఎదుట బైఠాయించారు. మరోవైపు మరికొందరు కార్మికులు ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకుంటున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బిల్లు ఆమోదించాల్సిందేనని ప్లకార్డులు, నినాదాలతో కార్మికులు హోరెత్తిస్తున్నారు.
చర్చలు షురూ..!
కార్మికుల నిరసనపై గవర్నర్ స్పందించారు. ర్యాలీ చేస్తున్న ఆర్టీసీ సంఘాల నేతలను చర్చలకు పిలిచారు. ప్రస్తుతం తమిళిసై హైదరాబాద్‌లో లేకపోవడంతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పది మంది ఆర్టీసీ సంఘాల నేతలతో ఆమె చర్చలు ప్రారంభించారు. అయితే.. తెలంగాణ మజ్దూర్ సంఘ్ కార్మిక నాయకుడు థామస్ రెడ్డి వర్గం మాత్రమే చర్చలకు వెళ్లింది. తమ వర్గానికి పిలుపురాకపోవడంపై అశ్వద్ధామరెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. థామస్ రెడ్డి వర్గాన్ని మాత్రమే ఎలా అనుమతిస్తారు..? తమ వర్గాన్ని ఎందుకు పిలవలేదు..? అని అశ్వద్ధామ, హనుమంతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే 10 మంది ఆర్టీసీ సంఘాల నేతలకు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌కు గవర్నర్ అనుమతిచ్చారు. కాన్ఫరెన్స్ జరిపిన తర్వాత అయినా గవర్నర్ నుంచి బిల్లుపై గ్రీన్ సిగ్నల్ వస్తుందని కార్మికులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
మీకోసమే నేనున్నా..!
‘మీ సమస్యల పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. రాజ్‌భవన్ ముట్టడి నన్ను బాధించింది. కార్మికుల ప్రయోజనాలకు నేను వ్యతిరేకం కాదు. నేనెప్పుడూ కార్మికుల వైపే ఉంటాను. గత సమ్మె సమయంలోనూ కార్మికులకు అండగా నిలబడ్డాను. కార్మికుల ప్రయోజనాలు కాపాడటానికే బిల్లును సమగ్రంగా పరిశీలిస్తున్నాం’ అని తమిళిసై ట్వీట్ చేశారు. అనంతరం కేసీఆర్ సర్కార్‌కు 5 ప్రశ్నలతో కూడిన లేఖను పంపారు.
ఆ ఐదు అంశాలు ఏంటంటే..
1. 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.
2. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు.
3. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం... వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి అని ప్రశ్నించిన గవర్నర్.
4. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.
5. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్. ఈ లేఖకు పైవిధంగా కేసీఆర్ సర్కార్ స్పందించింది.