DH Srinivasrao: తాయత్తు మహిమ వల్లే బతికా... డీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-04-18T10:45:46+05:30 IST
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు సంచలన వార్తలకు కేరాఫ్‌గా మారారు.
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు (Telangana Public Health Director Gadala Srinivas Rao ) సంచలన వార్తలకు కేరాఫ్‌గా మారారు. రంజాన్ మాసం సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో భాగంగా మరోసారి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిన్నతనంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తాను తాయత్తు మహిమ వల్లే బతికానంటూ వ్యాఖ్యానించారు. వైద్యులు చేయలేని పనిని తాయత్తు చేసిందన్నారు. శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ప్రజా ఆరోగ్య సంచాలకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తన వ్యాఖ్యలు, వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అయితే క్షుద్రపూజలు చేసినట్లుగా కూడా శ్రీనివాసరావుపై గతంలో ఆరోపణలు వినిపించాయి.
జీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన క్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ...‘‘ నా బాల్యంలో ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు వైద్యులు చేతులెత్తారు. ఆ సమయంలో తన తాత, అమ్మమ్మలు దగ్గరలో ఉన్న మసీద్‌లో తాయిత్తు కట్టడం వల్ల ప్రాణాలతో ఉన్నా’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. డీహెచ్‌గా ఉన్న శ్రీనివాస్ రావు.. ఒక డాక్టర్స్ కమ్యూనిటీకి విశ్వాసం కోల్పేయే విధంగా.. మూఢ విశ్వాసాలను ప్రేరేపించే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొత్తగూడెంలో రాజకీయ ప్రవేశం కోసం గత కొంతకాలంగా జీఎస్‌ఆర్ ట్రస్ట్ పేరున పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్‌లు నిర్వహించడం, యువ సమ్మేళనం, జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు వ్యవహార శైలిపై సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అతని కుమారుడు రాఘవ పెద్దఎత్తున సోషల్ మీడియా కేంద్రంగా శ్రీనివాసరావుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే శ్రీనివాసరావుకు బీఆర్‌ఎస్ పెద్ద హస్తం ఉండబట్టే, రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు శ్రీనివాస్‌రావు వర్గీయులు చెప్పుకుంటున్నారు.