Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN , First Publish Date - 2023-06-28T17:49:34+05:30 IST
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి (Telangana BJP president) మార్పుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి (Telangana BJP president) మార్పుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుపై అంశం ఏమీ లేదని, అటువంటి నిర్ణయాలు అధిష్టానం ఏం తీసుకోలేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ అంశంలో ఎవరూ గందరగోళంలో లేరని, మీడియా గందరగోళం సృష్టిస్తుందన్నారు. ఇలాంటి వార్తలు ఎందుకు వచ్చాయో తమకు తెలవదన్నారు.
ఢిల్లీ పర్యటనలో బీజేపీ అధిష్టానంతో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చి కొత్తవారిని నియమించే అవకాశం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్‌కి కొత్త పదవి ఇవ్వాలని, కొత్తవారికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే చర్చ జరగలేదన్నారు. కావాలని కొంత మంది మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నాలుగు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో అధిష్టానం ఎలాంటి మార్పులు చేయదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ భేటీలు సక్సెస్ అయిందని, గుజరాత్, బెంగాల్, జమ్ముకశ్మీర్, గోవాలో టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరిగాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఐరాస వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కార్యదర్శి హాజరయ్యారని, పర్యాటక రంగ సుస్థిరాభివృద్ధికి జీ20 భేటీలు దోహదం చేస్తాయన్నారు. గోవా డిక్లరేషన్ పేరుతో 30 దేశాల ప్రతినిధుల సమక్షంలో రోడ్ మ్యాప్ రూపొందించామని కిషన్‌రెడ్డి అన్నారు. త్వరలో WTO కార్యాలయం ఢిల్లీలో ప్రారంభం అవుతోందని, పలు దేశాలకు ప్రాంతీయ కార్యాలయంగా ఉంటూ WTO కార్యాలయం భారత్ వేదికగా పనిచేయనుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భారత పర్యాటక రంగంలో పెట్టుబడులకు పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.