KTR : అమర్ రాజా బ్యాటరీస్ కోసం 8 రాష్ట్రాల సీఎంలు జయదేవ్‌పై ఒత్తిడి తెచ్చారు
ABN , First Publish Date - 2023-05-06T13:23:58+05:30 IST
అమర రాజా గిగా కారిడార్‌కు మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అమర రాజా అధినేత గల్లా జయదేవ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ : అమర రాజా గిగా కారిడార్‌కు మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అమర రాజా అధినేత గల్లా జయదేవ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో అతి పెద్ద సంస్థ పెట్టినందుకు గల్లా జయదేవ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఒక పరిశ్రమ రావాలంటే ఎంతో శ్రమించాలని.. పోటీ ప్రపంచంలో రాష్ట్రాలున్నాయని.. ప్రాంతాలతో పోటీ పడి సాధించాలని పేర్కొన్నారు.
‘‘ఈ ప్రాజెక్టు కోసం ఎనిమిది రాష్ట్రాల సీఎంలు గల్లా జయదేవ్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ మనం ఇచ్చిన కమిట్ మెంట్‌కు వారు వచ్చారు. ఇదంతా ఎందుకంటే.. మనకున్న మానవ వనరులు అపారం. ఇలాంటి పరిశ్రమలతో ఉపాధి.. తద్వారా రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు.. ఒక ఐటీ కంపెనీ వస్తే ఒకరికి ఉద్యోగం వస్తే నలుగురికి ఉపాధి కలుగుతుంది. అమర్ రాజా కంపెనీ వల్ల వేలాది మందికి ఉపాధి వస్తుంది. ఇప్పటి వరకూ అమర్ రాజా కంపెనీ పెట్టిన పెట్టుబడులు అన్నింటికన్నా.. రెట్టింపు పెట్టుబడి ఇక్కడ పెడుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ లెడ్ బ్యాటరీ పరిశ్రమ కాదు.. లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ.. ఇది ఒక్క చుక్క కూడా కాలుష్యం లేకుండా వుంటుంది.
ఇపుడు చిత్తూరులోని కంపెనీలలో కూడా కాలుష్యం లేదు.. గల్లా కుటుంబం అక్కడే నివాసం ఉంటోంది. ఎవరికైనా అనుమానాలుంటే.. బస్సులు పెట్టి తీసుకెళ్లండి. ఇక్కడి ప్రాజెక్ట్.. 16 గిగ వాట్ కంపెనీ. ఈ కంపెనీలో ఇక్కడి వారికే ఉద్యోగాలు.. పక్కనే ఉన్న ఐటీ టవర్‌లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి.. ఉద్యోగాలు ఇస్తారు. ఇక్కడ మహబూబ్ నగర్ లో.. పర్యాటకంగా.. మౌళిక సదుపాయాల పరంగా అద్భుతం.. ఈ కంపెనీ వల్ల పాలమూరు ప్రజల జీవితాలు మారతాయని విశ్వాసం ఉంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.