Share News

Liquor: ఆరంభం అదుర్స్‌.. కొత్త ఎక్సైజ్‌ ఏడాది ప్రారంభం

ABN , First Publish Date - 2023-12-02T12:38:51+05:30 IST

రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త ఎక్సైజ్‌ ఏడాది ప్రారంభమైంది. ఈ క్రమంలో తొలిరోజు ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో దాదాపు రూ.31కోట్ల విలువైన

Liquor: ఆరంభం అదుర్స్‌.. కొత్త ఎక్సైజ్‌ ఏడాది ప్రారంభం

- తొలిరోజు ఉమ్మడి జిల్లాలో రూ.31కోట్ల మద్యం సరఫరా

ఖమ్మం: రాష్ట్రంలో శుక్రవారం నుంచి కొత్త ఎక్సైజ్‌ ఏడాది ప్రారంభమైంది. ఈ క్రమంలో తొలిరోజు ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో దాదాపు రూ.31కోట్ల విలువైన మద్యాన్ని కొత్త వైన్‌ షాపులకు సరఫరా చేశారు. మద్యం డిపో నుంచి రాత్రి 11గంటల వరకు కూడా ఈ సరఫరా కొనసాగింది. ఖమ్మం జిల్లాలోని 122, భద్రాద్రిలోని 89 వైన్‌షాపులు, 50బార్లు, 3క్లబ్బులు ఉండగా.. వీటన్నింటికీ వైరా(Wyra)లోని ఐఎంఎల్‌ డిపో నుంచి మద్యాన్ని తరలించారు. ఈ ఏడాది అక్టోబరు 9న ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం వైన్‌ షాపులకు దరఖాస్తుల స్వీకరణ, లక్కీ డ్రా ప్రక్రియను పూర్తి చేసింది. నిబంధనల ప్రకారం డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి కొత్త యజమానుల చేతుల్లో మద్యం షాపులు వెళ్లగా ఆ వ్యాపారులంతా అమ్మకానికి అవసరమైన మద్యం బ్రాండ్లను ఐఎంఎల్‌ డిపోలకు ఇండెంట్‌ పెట్టుకుని తెప్పించుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల షెడ్యూలు విడుదలైన నాటి నుంచి ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మద్యం అక్రమ అమ్మకాల నియంత్రణ కొనసాగింది. అప్పటివరకు విచ్చలవిడిగా నడిచిన బెల్టు షాపులను మూసి వేయించారు. ఫలితంగా రెండు నెలలుగా మద్యం సరఫరా విక్రయాలు తగ్గిపోయాయు . అంతేకాకుండా రెండు రోజులుగా ఎన్నికల నేపథ్యంలో షాపులు మూసేయడంతో విక్రయాలు మరింత తగ్గిపోయాయి. చివరకు పోలింగ్‌ పూర్తయిన వెంటనే కొత్త ఎక్సైజ్‌ ఏడాది ప్రారంభం కావడంతో పాత వ్యాపారులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే కొత్త యజమానులు మద్యం కోసం ఐఎంఎల్‌ డిపో వద్ద బారులు తీరారు. ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.10లక్షల మద్యం పంపిణీకి కావాల్సిన డీడీలు యజమానుల నుంచి తీసుకున్నారు. కానీ ఒకేసారి ఉమ్మడి జిల్లాకు మద్యం పంపిణీ చేయలేక ఒక్కో దుకాణానికి 150బాక్సులను ఇచ్చేందుకు పంపిణీని ప్రారంభించారు.

40మద్యం దుకాణాలకు అందని మద్యం

అయితే ఐఎంల్‌ డిపోద్వారా అర్ధరాత్రి వరకు మద్యం సరఫరా జరిగినా 40 దుకాణాలకు మాత్రం మద్యం అందకపోవడంతో ఆ వ్యాపారులు తొలిరోజు బోణీ కొట్టలేకపోయారు. ఈ విషయంపై వైరా మద్యం డిపో మేనేజరు నారాయణరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా వరుసగా సెలవులు రారవడంతో దుకాణాల ప్రారంభం రోజే మద్యం పంపిణీ చేయాల్సి వచ్చిందన్నారు. ఒక్కోదుకాణానికి కొత్తగా అన్ని బ్రాండ్లు ఇవ్వటంతో పాటు ఆన్‌లైన్‌ ఇబ్బందులు ఎదురయ్యాయయన్నారు. 35మద్యం దుకాణాలకు ఆలస్యం జరిగిందని, శనివారం ఉదయం వరకు అన్ని దుకాణాలకు మద్యం సరఫరా అవుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-12-02T12:38:53+05:30 IST