చూ మంతర్‌

ABN , First Publish Date - 2023-05-23T23:34:23+05:30 IST

సాంకేతిక పెరుగుతున్నా.. సైన్స్‌పై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు జరుగుతున్నా.. నాగరిక సమాజంలో ఇంకా అమానవీయ పోకడలు రాజ్యమేలుతున్నాయి. పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు ప్రబుద్ధులు బాబాలు, మంత్రగాళ్ల రూపంలో ప్రజలను మూఢాచారాలవైపు మళ్లిస్తున్నారు.

చూ మంతర్‌
రాజనగరంలో పసిపిల్లాడిపై కాలుతో తొక్కుతున్న చుంచుబాబ

గ్రామాలు, పట్టణాల్లో పెరుగుతున్న బాబాలు, మంత్రగాళ్ల ఆగడాలు

బాధితులను చితకబాదుతూ మంత్రాల పేరుతో దోపిడీ

పసిపిల్లలనీ చూడకుండా కడుపుపై తొక్కుతున్నారు

ఆరోగ్య సమస్యలతోపాటు కుటుంబ కలహాలకు మంత్రాలు, పూజలు చేస్తామని ప్రచారం

నాగరికత పెరిగినా కొద్ది ఎక్కువవుతున్న మూఢాచారాలు

వనపర్తి/గద్వాల, మే 23 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పెరుగుతున్నా.. సైన్స్‌పై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు జరుగుతున్నా.. నాగరిక సమాజంలో ఇంకా అమానవీయ పోకడలు రాజ్యమేలుతున్నాయి. పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు ప్రబుద్ధులు బాబాలు, మంత్రగాళ్ల రూపంలో ప్రజలను మూఢాచారాలవైపు మళ్లిస్తున్నారు. మంత్రించిన నిమ్మకాయలు, పూజలు చేసిన తాయత్తులతో సకల సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మబలుకుతున్నారు. ఒక్కో పూజకు రూ.వందల నుంచి రూ.వేల వరకు వసూలు చేస్తున్నారు. కేవలం పూజలు, మంత్రాల వరకే పరిమితం కాకుండా కొన్నిచోట్ల జుగుప్సాకరమైన రీతిలో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అమానవీయ రీతిలో శరీరంపై వాతలు తేలేలా కొట్టడం, పసిపిల్లలు అని కూడా చూడకుండా కర్రలతో బాదడం, కడుపుపై తొక్కడం నిత్యకృత్యంగా మారాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకు మంత్రాలు, తంత్రాలు, నిమ్మకాయలు, తాయత్తులపై కొంతమేర నమ్మకం ఉంటుంది. వాటి ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయనే భావన ఉం టుంది. ఏ కారణంతోనైనా సమస్య పరిష్కారమైతే.. వారి ద్వారా మౌత్‌ పబ్లిసిటీ అవుతుంది. దీన్ని బాబాలు, మం త్రగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు.

కడుపుపై తొక్కడం.. కర్రలతో బాదడం...

వనపర్తి జిల్లా మొదటి నుంచి చైతన్యవంతమైన ప్రాంతంగా పేరుంది. ఎక్కువ మంది ప్రముఖులు, మేధావులు ఈ జిల్లాలో ఉన్నారు. కానీ ఇక్కడే మూఢాచారాల సంస్కృతి ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క వనపర్తి పట్టణంలోనే బాబాలు, మంత్రగాళ్లు సుమారు 10 మంది వరకు నిత్యం ప్రజలను దోచుకుంటున్నారు. ప్రధానంగా ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో వచ్చేవారిని ఆసరాగా చేసుకుంటున్నారు. సైతాన్‌ పట్టుకుందనో.. దయ్యం పట్టిందనో చెబుతున్నారు. వాటిని వదిలించాలంటే పూజలు చేయాలని నమ్మబలుకుతున్నారు. వనపర్తి మునిసిపాలిటీ పరిధిలోని రాజనగరంలో చుంచుం బాబాగా అవతారమెత్తిన ఓ ప్రబుద్ధుడు కొరడాతో బాధితులను కొట్టడం, పసిపిల్లలను కాలితో తొక్కడం, చేతిలో తల్వారుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒక్క నిమ్మకాయ మంత్రించి ఇస్తే సుమారు రూ.2,000 వరకు వసూలు చేస్తున్నాడు. రెండేళ్ల నుంచి ఈ తంతు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న దెయ్యం పట్టిందని వశ్య తండాకు చెందిన మహిళను చిట్యాల రోడ్డులో ఉండే చికెన్‌ బాబా తీవ్రంగా కొట్టాడు. బాబా కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ మహిళ స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. బాబాపై పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కొంతమంది మధ్యవర్తులు వచ్చి కేసు కాకుండా రూ.60,000లకు రాజీ కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏళ్లుగా ఇదే పని..

కొందరు బాబాలు కనీసం 20 ఏళ్ల నుంచి ఈ మంత్రాలు, తంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వీరి వద్దకు నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచి కూడా బాధితులు వస్తున్నారు. వనపర్తి పట్టణంలోని రాజనగరం, చిట్యాల రోడ్డు, బండారు నగర్‌, పాన్‌గల్‌ రోడ్డు, రాంనగర్‌ కాలనీ, పాత బజార్‌, గాంధీనగర్‌, కేడీఆర్‌ నగర్‌లో ఈ బాబాలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా మండల పరిధిలోని పెద్దగూడెంలో ఇద్దరు, కడుకుంట్లలో నలుగురు, ఆత్మకూరు పట్టణంలో ఇద్దరు ఉన్నారు. అమరచింతలో ఓ ఆర్‌ఎంపీ అటు వైద్యంతో పాటు ఇటు మంత్రాలు చేస్తున్నారు. గతంలో రెండు కేసులు నమోదై, క్లీనిక్‌ను కూడా వైద్యారోగ్యశాఖ అధికారులు సీజ్‌ చేశారు. మదనాపూర్‌ మండలం దుప్పల్లిలో ఒకరు, గోపన్‌పేటలో ఇద్దరు బాబాలు కూడా ఇదే తరహా మంత్రాలు, సైతాన్‌ను వదలగొట్టడం వంటి పనులు చేస్తున్నారు. పెబ్బేరు మండలంలో తాయత్తులు కట్టడం, పిల్లలకు జబ్బులను నయం చేయడం, సంతానం లేని వారికి సంతానం కలిగించేందుకు పూజలు చేయడం నిత్యకృత్యంగా మారాయి. వాతలు తేలెట్టు కొట్టడం, స్థంబాలకు కట్టేసి చిత్ర హింసలు పెట్టడం, కడుపుపై తొక్కడం, కర్రలతో బాదడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.

బలవుతున్న అమాయకులు

గతంలో పలువురు బాబాలు ఇదే విధంగా పూజలు చేయడం ద్వారా కొన్నిచోట్ల అమాయకులు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం వాటిని నిర్మూలించి, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను నిర్వహించడం లేదు. గతంలో ప్రతీ ఊరిలో కళాజాత లాంటి కార్యక్రమాలు నిర్వహించి, గ్రామీణులకు మూఢాచారాలు, మంత్రాలు, తంత్రాలపై అవగాహన కల్పించేవారు. కానీ ప్రస్తుతం వాటిఫై ఫోకస్‌ పెట్టకపోవడంతో అమాయకులు బలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజలు వస్తున్నారు కదా అని ఆ బాబాలను చూసీచూడనట్లు వదిలేస్తే.. భవిష్యత్‌లో మరింత ఇబ్బందికరంగా పరిస్థితులు తయారయ్యే అవకాశం ఉంది.

పావురం రక్తంతో..

వనపర్తి లోని కేడీఆర్‌ నగర్‌లో ఉంటున్న ఓ బాబా డయాలసిస్‌ రోగికి నయం చేస్తానని చెప్పి పొట్టపై పావురాలను కోసి రక్తంతో వీపు, నడుముపై మర్దన చేశాడు. తనకు ఆ వ్యాధి తగ్గకపోగా ఇంకా వనపర్తి ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. నల్లకోడిని తిప్పడం, సాంబ్రాణి పొగ వేయడం, ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు మంత్రించి ఇవ్వడం, తాయత్తులు కట్టడం వంటి వాటికి వేలకు వేలు బాధితుల నుంచి వసూలు చేస్తున్నారు. వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెంలో ఒక బాబా చేష్టలు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటున్నాయి. ఐదారేళ్ల క్రితం ఓ చిన్నారిని ఈ పూజల పేరుతో తనకు చెందిన బంగ్లాలో బలి తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికీ ఆ బాబా దగ్గరకు వేల సంఖ్యలో ఏటా వస్తుంటారు. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు పోలీసులు, అధికారులకు కూడా మామూళ్లు వస్తాయనే విమర్శలు ఉన్నాయి. బిజినేపల్లికి చెందిన ఓ మహిళ మానసిక సమస్యల పరిష్కారం కోసం ఇటీవల పిల్లలతో కలిసి తరచూ బాబా వద్దకు రాగా, అందుకు ఆ బాబా మహిళను ఉపవాసం ఉండాలని చెప్పాడని తెలిసింది. ఆమె అలాగే పాటించింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో పెద్దగూడెం శివారులో తన సంతానంతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.

Updated Date - 2023-05-23T23:34:23+05:30 IST