ప్రయోగాలు చేసేదెలా?

ABN , First Publish Date - 2023-01-17T23:19:08+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వసతులు కరువయ్యాయి. అరకొర సదుపాయా లతో నెట్టుకురాలేక అధ్యాపకులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లోని ప్రయోగ శాలలు పనికిరాకుండా పోయాయి

ప్రయోగాలు చేసేదెలా?
అలంపూర్‌ జూనియర్‌ కళాశాలలోని ప్రయోగశాల

- రెండేళ్ళుగా నిధులు రాక ఇబ్బంది

- పూర్తి స్థాయిలో లేని పరికరాలు

- ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

అయిజ, జనవరి 17 : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వసతులు కరువయ్యాయి. అరకొర సదుపాయా లతో నెట్టుకురాలేక అధ్యాపకులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లోని ప్రయోగ శాలలు పనికిరాకుండా పోయాయి. పూర్తి స్థాయిలో పరికరాలు లేకపోవడం సమస్యగా మారింది. ఉన్నవి కూడా దుమ్ము పట్టి వృథాగా మారాయి. దీంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సైన్స్‌ విద్యార్థులు ఇబ్బంది పడుతు న్నారు. ప్రయోగాలు ఎలా చేయించాలో అర్థం కాక అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు. రసాయనాలు అయిపోయాయి. ఇంటర్‌ బోర్డు నుంచి నిధులు వస్తే తప్ప నూతన పరికరాలు కొనే పరిస్థితి లేదు.

అన్ని కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎనిమిది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఆరు కస్తూర్బాలు ఉన్నాయి. ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు 13 ఉన్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 3,444 మంది జనరల్‌, 694 మంది ఒకేషనల్‌ కోర్సు చదువుకుంటున్నారు. ద్వితీయ సంవత్సరంలో 3,233 మంది జనరల్‌, 589 మంది ఒకేషనల్‌ విద్యార్థులున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు ప్రయోగ పరీక్షలు నిర్వహించలేదు. ఈ విద్యా సంవత్సరంలో పూర్థి స్థాయి సిలబస్‌తో ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు ఆదేశించింది. దీంతో అధ్యాపకులు రెండేళ్లుగా మూలనపడ్డ ప్రయోగ వస్తువులు, పరికరాల దుమ్ము దులిపే పనిలో నిమగ్నమయ్యారు. భౌతిక శాస్త్ర ప్రయోగ పరికరాలు, రసాయన శాస్త్రం ప్రయోగాల్లో వాడే రసాయనాలు, జంతు, వృక్ష శాస్త్రాల ప్రయోగాల్లో వాడే వస్తు పరికరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయటానికి దాదాపు రూ.50.000 నుంచి రూ.80,000 వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అధ్యాపకులు తెలుపుతున్నారు. ఈ నిధులను ఇంటర్‌ బోర్డు కళాశాలలకు విడుదల చేసిన తర్వాతనే వాటిని కొనుగోలు చేసేందుకు అధ్యాపకులు చొరవ చూపుతున్నారు. ఇప్పటి వరకు బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే అంటున్నారు. ఈ తతంగం అంతా పూర్తయ్యేందుకు దాదాపు 15 నుంచి 25 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15 నుంచి ప్రయోగ పరీక్షలు నిర్వహిం చేందుకు ఇంటర్‌ బోర్డు టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఆలోగా ప్రభుత్వం స్పందించి ప్రయోగశాలలకు అవసరమైన నిధులు విడుదల చేయాలని అధ్యాపకులు, విద్యార్థులు కోరుతున్నారు.

ప్రయోగాల నిర్వహణ కష్ట సాధ్యం

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయోగ పరీక్షల నిర్వహణ కష్టసాధ్యం. ఇప్పటి వరకు నిధులు రాలేదు. మారిన సిలబస్‌కు అనుగుణంగా ప్రయోగాలు చేయించాల్సి ఉంటుంది. రసాయనాలు అయిపోయాయి. వస్తువులు, పరికరాలు పగిలిపోయాయి. మరి కొన్ని పనికి రాకుండా ఉన్నాయి. ప్రయోగాలకు సంబంధించిన పరికరాల కొనుగోలుకు వెంటనే నిధులు విడుదల చేయాలి.

- బండ్ల దేవేందర్‌రెడ్డి, జిల్లా ప్రైవేట్‌ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఏమైన నిధులు ఉంటే సర్దుబాటు చేసుకుని ప్రయోగాలకు సంబంధించిన వస్తువులు, పరికరాలను కొనుగోలు చేయాలని మౌఖికంగా ఆదేశించాం. అది కూడా సర్దుబాటు చేసుకునే వీలుంటేనే అని ఆయా కళాశాలల ప్రిన్స్‌పాల్‌లకు తెలిపాము. ప్రయోగాలకు అవసరమైన వస్తువులు, పరికరాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలి. ఇక్కడ పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

- హృదయరాజు, జిల్లా నోడల్‌ అధికారి

Updated Date - 2023-01-17T23:19:09+05:30 IST