మొక్కలతోనే మానవ మనుగడ

ABN , First Publish Date - 2023-06-19T23:13:00+05:30 IST

మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతీ ఒక్కరు ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ పేర్కొన్నారు.

మొక్కలతోనే మానవ మనుగడ
ఎకో పార్కులో మొక్క నాటి నీటిని పోస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, పాల్గొన్న కలెక్టర్‌ శ్రీహర్ష

- జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ

- ఘనంగా హరితోత్సవం

నారాయణపేట టౌన్‌, జూన్‌ 19 : మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతీ ఒక్కరు ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన హరితోత్సవంలో భాగంగా కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి నారాయణపేట శివారులోని ఎక్లాస్‌పూర్‌ ఎకో పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఎనిమిది సార్లు హరితహారం కార్యక్రమం కొనసాగిందని, ప్రస్తుతం తొమ్మిదవ విడత హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసి రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్‌ శ్రీహర్ష మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో 2019 నుంచి 2022 వరకు దాదాపు 1.20 కోట్ల మొక్కలు నాటగా, నాలుగు శాతం అటవీ సంపద పెరిగిందన్నారు. ఈ సారి 23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని డీఆర్డీఏ పరిధిలో 280, అటవీ శాఖ పరిధిలో పది నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా గ్రామస్థాయిలో పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎక్లాస్‌పూర్‌ పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ శ్రీహర్ష తనిఖీ చేసి, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి వీణావాణి, పుర చైర్‌పర్సన్‌ గందె అనసూయ, జిల్లా అధికారులు వేణుగోపాల్‌, జ్యోతి, మురళి, జాన్‌ సుధాకర్‌, శివప్రసాద్‌, ఎంపీపీ శ్రీనివాస్‌, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-19T23:13:00+05:30 IST