భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం
ABN , First Publish Date - 2023-01-26T23:51:01+05:30 IST
భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
- గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల క్రైం, జనవరి 26 : భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషి వల్లే మనకు రాజ్యాంగం సిద్ధించిందన్నారు. జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పరేడ్ మైదానంలో ఎస్పీ రంజన్ రతన్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాంలతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన జిల్లా అధికారులకు, ఉద్యోగులకు కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించారు.
అలరించిన నృత్యాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో బాలభవన్ విద్యార్థులు ప్రదర్శించిన ధింసా నృత్యం అందరినీ ఆకట్టుకున్నది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ చేసిన సేవలను ప్రస్తుతిస్తూ సరస్వతీ విద్యామందిర్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆకట్టుకున్నది. ప్రగతి విద్యాలయం విద్యార్ధులు రంగేళి నృత్యాన్ని ప్రదర్శించారు. అనం తరం రెవెన్యూశాఖ, ఎస్పీ ఎలెవన్ జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ పోటీలో ఐదు వికెట్ల తేడాతో ఎస్పీ ఎలెవన్ జట్టు గెలుపొంది, ఫ్రెండ్షిప్ కప్‌ను కైవసం చేసుకున్నది. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, డీఎస్పీ రంగస్వామి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.