గద్వాల రైల్వే స్టేషన్‌కు మహర్దశ
ABN , Publish Date - Dec 14 , 2023 | 10:52 PM
దక్షిణమధ్య రైల్వే డివిజన్‌లో అతి పెద్ద రైల్వే స్టేషన్లలో గద్వాల రైల్వే స్టేషన్ ఒకటి. అంతేకాకుండా ఆదాయం సమకూర్చడంలో కూడా ఈ స్టేషన్ ప్రధానమైనది.
- అమృత్ భారత్ పథకానికి ఎంపిక
- రూ. 7 కోట్లతో స్టేషన్ ఆధునికీకరణ పనులు
గద్వాల, డిసెంబరు 14 : దక్షిణమధ్య రైల్వే డివిజన్‌లో అతి పెద్ద రైల్వే స్టేషన్లలో గద్వాల రైల్వే స్టేషన్ ఒకటి. అంతేకాకుండా ఆదాయం సమకూర్చడంలో కూడా ఈ స్టేషన్ ప్రధానమైనది. రాయిచూర్ రైల్వే లైన్ పూర్తి కావడంతో గద్వాల జంక్షన్‌గా మారింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టింది. దీంతో రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి.
దాదాపు 56 రైళ్ల రాకపోకలు
గద్వాల రైల్వే స్టేషన్ అతిపురాతనమైనది. దీనిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారు. రాయిచూర్ రైల్వే లైన్ ప్రారంభం కావడంతో ఇది జంక్షన్‌గా మారింది. ప్రస్తుతం దాదాపు 56కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే గద్వాల జిల్లా కేంద్రం కావడం, పట్టణం విస్తరించడంతో వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆదాయం పరంగా రైల్వే డివిజన్‌లో గద్వాల స్టేషన్‌కు మంచి పేరుంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్వయించుకున్నది. అందులో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ స్టేషన్‌ను అమృత్ భారత్ కింద ఎంపిక చేశారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు ఏడు కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చిస్తున్నారు. స్టేషన్ భవనాల ఆధునికీకరణ, ప్లాట్‌ఫారాల అభివృద్ధి, ఎస్క్యులేటర్లు, లిఫ్టులు, అధునాతన టాయిలెట్లు, పార్కింగ్ సౌకర్యం, గార్డెనింగ్, ఏసీ వెయిటింగ్ హాళ్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
ప్రధాని, రైల్వే శాఖ మంత్రికి కృతజ్ఞతలు
అమృత్ భారత్ కింద గద్వాల రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేయడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హర్షం ప్రకటిం చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ఆమె ఽధన్యవాదాలు తెలిపారు. దక్షిణమధ్య రైల్వే స్టేషన్లలో ప్రధానమైన గద్వాల స్టేషన్ నుంచి అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. వారి సౌకర్యార్థం ఆధునికీకరణ పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే చేనేత జరీ చీరలకు ప్రసిద్ధి గాంచిన గద్వాల, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.