చేప విత్తనం 5.40 కోట్లు

ABN , First Publish Date - 2023-06-28T00:34:48+05:30 IST

జలాశయాల్లో చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

చేప విత్తనం 5.40 కోట్లు

జలవనరుల్లో వదిలేందుకు సన్నాహాలు

మెదక్‌ జిల్లాలో 1,614 చెరువులు, 3 జలాశయాలు

16వేల మంది మత్స్యకారులు

మెదక్‌, జూన్‌ 26 : జలాశయాల్లో చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం ఏటా మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలోని జలవనరుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా జలవనరుల్లో వర్షపు నీరు చేరగానే చేప విత్తనం వదలడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలో 1,614 చెరువులు, కుంటలు.. హల్దీవాగు ప్రాజెక్టు, ఘనపూర్‌, పోచారం మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో చేపల పెంపకంపై ఆధారపడి 16వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 5.40 కోట్ల చేప పిల్లలు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలోకి ఈ వర్షాకాలంలో కొత్త నీరు చేరాక చేప పిల్లలను వదలనున్నారు. చెరువుల్లో 35 ఎం.ఎం నుంచి 40 ఎం.ఎం పరిమాణం గల చేప పిల్లలను వదలనున్నారు. జలాశయాల్లో 85-100 ఎం.ఎం పరిమాణం గల చేప పిల్లలను పెంచనున్నారు. రహు, బంగారు తీగ, బొచ్చె రకాల చేపలను పెంచడానికి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. గత సంవత్సరం జిల్లాలో 4.90 కోట్ల చేప విత్తనాన్ని పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

త్వరలోనే టెండర్ల ప్రక్రియ

జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టారు. మరో నెల రోజుల వ్యవధిలో టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. అనంతరం చేప విత్తన ఉత్పత్తి కేంద్రాలను అధికారులు పరిశీలించి విత్తన రకాలు, పరిమాణం, నాణ్యతను పరీక్షిస్తారు. ఆ తర్వాతే పంపిణీ చేపట్టనున్నారు.

నెల తరువాతే చేప విత్తన ఉత్పత్తి

తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన చేప విత్తన ఉత్పత్తి కేంద్రాల్లో మెదక్‌ ఒకటి. జిల్లా కేంద్రంలోని స్పాన్‌ ఉత్పత్తి కేంద్రంలో గత సంవత్సరం 4.50 కోట్ల స్పాన్‌(చేప విత్తనం)ను ఉత్పత్తి చేశారు. ఈ యేడు వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిసిన అనంతరం ఉత్పత్తి కేంద్రంలో చేప విత్తనాలను ఉత్పత్తి చేయనున్నారు.

ఉచితంగా పంపిణీ

-రజని, మత్స్యశాఖ అధికారి, మెదక్‌ జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార సహకార సంఘాల సభ్యులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ కూడా కమిషనరేట్‌ పరిధిలో కొనసాగనుంది. అనంతరం టెండరర్ల ఆధ్వర్యంలో చేప పిల్లలను తెప్పించుకొని ఆ తర్వాత పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - 2023-06-28T00:34:48+05:30 IST