అందోలులో నువ్వా నేనా
ABN , First Publish Date - 2023-11-20T23:36:12+05:30 IST
నియోజకవర్గంలో అమీతుమీ తేల్చుకుంటున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్
స్థానికత, అభివృద్ధి ఎజెండాగా క్రాంతికిరణ్ పోరు
ప్రతీకారం కోసం రెట్టించిన కసితో దామోదర యుద్ధం
34 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన... ఇలా వచ్చి అలా ఇద్దరు దిగ్గజాలను మట్టి కరిపించిన యంగ్ టర్క్ ఈయన.. ఒకరు గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పం పూనితే.. మరొకరు మళ్లీ గెలిచి పైచేయి సాధించాలని పట్టువీడకుండా పోరాడుతున్నారు. వారే కాంగ్రెస్ నుంచి తొమ్మిదోసారి పోటీ చేస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి సిలారపు దామోదర రాజనర్సింహ, బీఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్. అందోలు శాసనసభ నియోజకవర్గం ఈ ఇద్దరిలో ఎవరికి పట్టం కడుతుందో ఆసక్తిగా మారింది.
జోగిపేట, నవంబరు 20 : భౌగోళికంగా, నైసర్గికంగా రాష్ట్రంలోనే పెద్ద, సంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం అందోలు. శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ పోరుకు సిద్ధమైంది. అందోలు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయిన నాలుగున్నర దశాబ్దాల నాటి నుంచి నియోజకవర్గంలో స్థానికులకు పోటీ చేసే అవకాశం రాలేదని అనే ఆలోచన రేకెత్తించి గత ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి అదే కార్డుతో గెలిచిన జర్నలిస్టు నాయకుడు చంటి క్రాంతికిరణ్ మరోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్(నిర్వహణ) కమిటీ చైర్మన్, ఉమ్మడి రాష్ట్ర చివరి ఉప ముఖ్యమంత్రి, ఇటీవలి కాలంలో మల్లన్నసాగర్ అంశంతో ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీని ఇరుకున పెట్టిన దామోదర రాజనరసింహ పోటీలో ఉన్నారు. తాను గెలిస్తే ముఖ్యమంత్రిని కావాలని భావిస్తున్న దామోదర... ఆయనను ఓడించి జైంట్ కిల్లర్‌గా పదవి పొందాలని చూస్తున్న క్రాంతికిరణ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. ఇక మాజీ మంత్రి, అందోలు మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ బీజేపీ నుంచి ఎన్నికల రంగంలో నిలిచి తాను ఉన్నానని గుర్తుచేస్తున్నారు. బీఎ్‌సపీ అభ్యర్థిగా ముప్పారం ప్రకాశ్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ వ్యూహం
దామోదరను ఎలాగైనా ఓడించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో వర్కవుట్ అయిన స్థానికత అంశాన్నే ఈసారి కూడా ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నది. బీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ గెలుపు బాధ్యతను ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్‌రావుకు అప్పగించింది. హరీశ్ మంత్రాంగం, క్రాంతికిరణ్ అండ్ కో యంత్రాంగంతో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ తమదైన శైలిలో రాజకీయం చేస్తోంది. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహించి ఆ పార్టీని కకావికలం చేయాలన్నది బీఆర్‌ఎస్ వ్యూహం. ఈ మేరకు దాదాపు ప్రతీ మండలంలోనూ నెలరోజులుగా ఏదో ఒక గ్రామం నుంచి కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు, నాయకులకు గులాబీ కండువాలు కప్పుతున్నారు. దీనికి అదనంగా బీజేపీలో నెలకొన్న టికెట్ల కుమ్ములాటను అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. ముఖ్యంగా బీజేపీలో టికెట్ ఆశించి భంగపడ్డ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాలయ్యతోపాటు, అదే టికెట్ ఆశించినప్పటికీ, తనకు కాకుండా తన తండ్రికి రావడంతో అలిగిన బీజేపీ అభ్యర్థి బాబూమోహన్ తనయుడు ఉదయ్ బాబూమోహన్ తదితరులను బీఆర్‌ఎస్ ఆకర్షించింది. వీరిద్దరినీ బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని కార్యకర్తల్లో జోష్‌ని పెంచింది. క్రాంతికిరణ్‌కు కేవలం నాలుగేళ్ల రాజకీయానుభవమే ఉన్నా, ప్రజలతో మమేకమై తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్తున్న ఆయన నేరుగా ప్రజల ఇళ్లల్లోకి వెళ్లి వరుసలు కలుపుతూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. తాను ఇక్కడి వాడినే అంటూ వారికి చెప్పుకుంటూ, అధికార పార్టీగా బీఆర్‌ఎస్ చేసిన పనులు వివరిస్తూ, పథకాలను పేర్కొంటూ ఓట్లడుగుతున్నారు. అంతేగాకుండా ప్రతీ గ్రామంలోనూ తన పర్యటన ఉండేలా క్రాంతికిరణ్.. తన ప్రచార షెడ్యూలును రూపొందించుకున్నారు. ఆయా గ్రామానికి సంబంధించిన అభివృదిధ పనుల వివరాలను ఒక పేపర్‌ఫై రాసుకుని వాటిని చదువుతూ... తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో తన హయాంలో చేపట్టిన అభివృద్ధిని విరిస్తున్నారు. నాలుగేళ్ళుగా ప్రజలకు అందుబాటులో ఉన్నానని, ఈసారి కూడా గెలిపిస్తే ఇలాగే ప్రజలతోనే ఉంటానని చెబుతూ సెంటిమెంట్‌కార్డును ప్రయోగిస్తున్నారు.
దామోదర ప్రతివ్యూహం
34 ఏళ్ల రాజకీయంతో అందోలు రాజకీయాల్లో పాతుకుపోయిన దామోదర రాజనర్సింహ కూడా బీఆర్‌ఎస్ వ్యూహాలకు దీటుగా ప్రతివ్యూహాలను పన్నుతూ రాజకీయం నెరుపుతున్నారు. అధికార పార్టీ చేస్తోన్న ఆపరేషన్ ఆకర్ష్‌ను అదే అంశంతో కొడుతున్నారు. ఇందులో భాగంగా బీఆర్‌ఎ్‌సలో బలమైన నేతలను కాంగ్రె్‌సలో చేర్చుకుంటున్నారు. బీఆర్‌ఎ్‌సకి చెందిన వట్‌పల్లి జడ్పీటీసీ పత్రి అపర్ణశ్రీకాంత్, రేగోడ్ మాజీ జడ్పీటీసీ గీతారాజేందర్‌పాటిల్ దంపతులు, అందోలు-జోగిపేట మున్సిపాలిటీలోని ముగ్గురు కౌన్సిలర్లను కాంగ్రె్‌సలో చేర్చుకుని బీఆర్‌ఎ్‌సకు షాక్ ఇచ్చారు. వలసలను ప్రోత్సహిస్తూ అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న దామోదర శైలి గతంతో పోలిస్తే భిన్నంగా ఉంది. గతంలో గ్రామంలో అందరినీ ఒక్కచోటకి పిలిచి, అక్కడే కూర్చుని మంతనాలు జరుపుతూ ఓట్లు అడిగేవారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా, తానే ప్రజల వద్దకు వెళ్లడం విశేషం. ప్రతీ గ్రామంలోనూ ఇంటింటికీ వెళ్లడం ముఖ్యంగా మహిళలే లక్ష్యంగా వారితో కలిసి నేలపై కూర్చుని కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ ఓట్లడుగుతున్నారు. అయితే దామోదర, లేకుంటే ఆయన తనయ త్రిష ప్రతీ గ్రామాన్ని చుట్ట్టేలా ప్రణాళికబద్ధంగా ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. ఈ మేరకు ప్రచార షెడ్యూలును రూపొందించుకుని పనిచేస్తున్నారు. ఇంతేగాకుండా, గ్రామాల్లోని యువకులు, వృద్ధులు, మధ్య వయస్కులను కలుస్తూ. తనకు ఇవే చివరి ఎన్నికలని పేర్కొంటూ, సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తాను మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మళ్ళీ గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధిస్తానని ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఓడినా, గెలిచినా 44 ఏళ్లుగా తన తండ్రి, తాను ఇదే నియోజకవర్గాన్ని అటిపెట్టుకుని ఉన్నాం తప్ప, అందోలును వీడలేదని తాను కూడా స్థానికుడినే అని చెబుతున్నారు.
కొద్దిపాటి క్యాడర్‌తోనే బాబూమోహన్
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబూమోహన్ ఎలాగైనా ప్రభావం చూపేందుకు కష్టపడుతున్నారు. అయితే బీజేపీ టికెట్ బాబూమోహన్‌కే మళ్లీ కేటాయించడంతో ఆయనను విభేదిస్తున్న పలువురు నేతలు దూరంగా ఉంటున్నారు. కొంతమంది ఇతర పార్టీల్లోకి వలస వెళుతున్నారు. ముఖ్యంగా బాబూమోహన్ తనయుడు ఉదయ్‌బాబూమోహన్, ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ జడ్పీ చైర్మన్ మాసనగారి బాలయ్య బీజేపీని వీడి బీఆర్‌ఎ్‌సలో చేరడం పెద్దదెబ్బగా మారింది. ఉన్న క్యాడర్‌లోనూ కొందరు ప్రచారంలో పాల్గొనడం లేదు. బాబూమోహన్ ప్రచారంలోనూ అంతగా ఊపు కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపుతారో వేచిచూడాలి.
నియోజకవర్గం : అందోలు (36) ఎస్సీ రిజర్వ్‌డ్
మొత్తం ఓటర్లు 2,45,409
పురుషులు 1,20,894
మహిళలు 1,24,510
ఇతరులు 5
పోలింగ్ కేంద్రాలు 313
సమస్యాత్మకం 84
మండలాల వారీగా ఓట్లు
మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
అందోలు 22,438 23,670 1 46,109
పుల్కల్ 10,937 11,389 - 22,326
చౌటకూరు 8,382 8,755 1 17,138
అల్లాదుర్గం 11,371 11,933 - 23,304
వట్‌పల్లి 12,452 12,602 1 25,055
టేక్మాల్ 13,725 14,724 - 28,450
రాయికోడ్ 16,136 15,650 1 31,787
మునిపల్లి 16,371 16,495 - 32,866
రేగోడ్ 9,081 9,292 1 18,374
సామాజిక వర్గాల వారీగా ఓటర్లు
సుమారుగా ఎస్సీలు 56వేలు, మాలలు 25వేలు, మాదిగలు 31వేలు, మైనార్టీలు 20 వేలు, ఎస్టీలు 12వేలు, గౌడ్‌లు 15వేలు, ముదిరాజ్‌లు 45వేలు, యాదవులు 30వేలు, రెడ్డిలు 26వేలు, ఇతర ఓసీలు 10వేలు, ఇతర బీసీలు 40వేల మంది ఉన్నారు.
2014లో వివరాలు
పోలైన మొత్తం ఓట్లు 1,79,290
బాబూమోహన్-బీఆర్‌ఎస్-87,087
దామోదర రాజనర్సింహ-కాంగ్రెస్-83,796
బుర్రి ఎల్లయ్య-బీజేపీ-3,062
2018 ఓట్ల వివరాలు
పోలైన మొత్తం ఓట్లు 1,98,120
క్రాంతికిరణ్-బీఆర్‌ఎస్-1,04,229
దామోదర రాజనర్సింహ-కాంగ్రెస్-87,764
బాబూమోహన్-బీజేపీ-2,404
కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ
అనుకూలతలు
- 34 ఏళ్ల రాజకీయ అనుభవం
- సొంత ఛరిష్మా
- సంప్రదాయ ఓటర్లు
- గతంలో మంత్రిగా చేపట్టిన అభివృద్ధి, పటిష్ట క్యాడర్
- వరుసగా రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతి
- ప్రభుత్వ వ్యతిరేకత
- క్రాంతికిరణ్‌తో విభేదించిన బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రె్‌సలో చేరడం
- యువతలో విపరీతమైన క్రేజ్
- నిరుద్యోగులు, ఉద్యోగుల్లోని ప్రభుత్వ వ్యతిరేకత
- గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉంటాననే ప్రచారం
ప్రతికూలతలు
- నమ్మినవారికి రాజకీయంగా ఏమీ చేయలేదనే అపవాదు
- నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించకపోవడం, సీనియర్ల కినుక
బీఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్
అనుకూలతలు
- అధికార పార్టీ అభ్యర్థి కావడం
- స్థానికుడు కావడం
- భేషజం లేకపోవడం
- బీఆర్‌ఎస్ హయాంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి,
- ఇంటింటికీ చేరిన సంక్షేమ పథకాలు
- మంత్రి హరీశ్ మంత్రాంగం
ప్రతికూలతలు
- బలమైన ప్రత్యర్థితో తలపడడం
- కేడర్‌లో కొద్దిపాటి అసంతృప్తి
- తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు
బీజేపీ అభ్యర్థి బాబూమోహన్
అనుకూలతలు
- కొద్దోగొప్పో ఉన్న బీజేపీ అభిమాన ఓట్లు
- అవినీతి ఆరోపణలు లేకపోవడం
- కేంద్ర ప్రభుత్వ పథకాలు
ప్రతికూలతలు
- కోపిష్టిగా పేరు పడడం
- అంతంతమాత్రంగా బీజేపీ కేడర్
- సొంత కొడుకే పార్టీ మారడం
- సీనియర్లతో విభేదాలు
- ఉన్న కొద్దిపాటి కేడర్ అంతా వ్యతిరేకించి ఇతర పార్టీల్లోకి వలసలు