తెలుగు రాష్ట్రాల్లోనే తొలి బగళాముఖి ఆలయం

ABN , First Publish Date - 2023-02-04T23:25:10+05:30 IST

తెలుగు రాష్ర్టాల్లోనే తొలి బగళాముఖి అమ్మవారి ఆలయాన్ని మెదక్‌ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే తొలి బగళాముఖి ఆలయం

శివ్వంపేటలో నిర్మాణం

ప్రతిష్ఠాపన ఉత్సవాలకు సిద్ధం

శివ్వంపేట: తెలుగు రాష్ర్టాల్లోనే తొలి బగళాముఖి అమ్మవారి ఆలయాన్ని మెదక్‌ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్నారు. దాతల సహకారంతో నిర్మాణ పనులు దాదాపు పూర్తవగా ప్రతిష్ఠాపన ఉత్సవాలకు సిద్ధమైంది. 8, 9, 10 తేదీల్లో నిర్వహించే విగ్రహ ప్రతిష్ఠ వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలో బగళాముఖి అమ్మవారి పీఠాలు మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి క్షేత్రాన్ని శివ్వంపేటలో నిర్మించాలని వేద పండితులు శాస్త్ర వెంకటేశ్వరశర్మ, వామనశర్మ సంకల్పించారు. అమ్మవారి ఆలయం నిర్మించ తలపెట్టి ఈ స్థలానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రముఖ వేద పండితుడు శాస్త్రుల విశ్వనాథశర్మ ఆధ్వర్యంలో ఇక్కడ వేద పాఠశాల కొనసాగింది. 1961లో శృంగేరి జగద్గురువు అభినవ విద్యార్థితస్వామి, 1985లో భారతీతీర్థస్వామి ఈ ప్రదేశాన్ని సందర్శించి పునీతం చేశారు. వేద పాఠశాల కొనసాగిన అదే స్థలంలో ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఇందుకు స్థల యజమానులు జడ్పీటీసీ పబ్బ మహే్‌షగుప్తా కుటుంబం సానుకూలంగా స్పందించి అప్పట్లో వేదపాఠశాల కొనసాగిన స్థలాన్ని ఆలయం కోసం ఉచితంగా అందజేశారు. దాతల సహకారంతో ఆలయ నిర్మాణానికి 2021 ఆగస్టు 31న శిలాన్యాసనం చేశారు. 18 నెలలుగా నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. మరోవైపు బాలాలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించే అమ్మవారి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని ఆలగడ్డలో ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకువచ్చారు. వేద పండితుల విశేష పూజల నడుమ ఆలయంలో అమ్మవారు కొలువుదీరనున్నారు.

Updated Date - 2023-02-04T23:25:16+05:30 IST