22న పటాన్‌చెరుకు సీఎం రాక
ABN , First Publish Date - 2023-06-20T00:41:25+05:30 IST
పటాన్‌చెరు నియోజకవర్గంలో ఈ నెల 22న సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది.
200 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
కొల్లూరులో డబుల్‌బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
పటాన్‌చెరు/రామచంద్రాపురం, జులై 19: పటాన్‌చెరు నియోజకవర్గంలో ఈ నెల 22న సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. పట్టణంలో నిర్మించబోయే 200 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేస్తారు. రామచంద్రాపురం మండలం కొల్లూరులో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన 15,660 డబుల్‌బెడ్రూం ఇళ్ల సముదాయాలను ఆయన ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పటాన్‌చెరులో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ఆయన ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎస్పీతో కలిసి పరిశీలించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, కార్మికులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నందున పార్కింగ్ వసతి, భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుపుకునే ఇన్‌స్పెక్షన్ బంగ్లా, పార్కును పరిశీలించారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలోనే పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. పారిశ్రామికవాడ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు రుణపడి ఉంటామని అన్నారు.
కాలుష్య పీడిత ప్రాంతంలో కార్పొరేట్ వైద్యం
పటాన్‌చెరు : కాలుష్య పీడిత ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ఉద్దేశించిన 200 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పటాన్‌చెరు పట్టణంలో గురువారం ప్రారంభంకాబోతున్నది. సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నియోజకవర్గంలో పారిశ్రామికవాడల వల్ల సతమతమవుతున్న ప్రజలకు ఉచితంగా వైద్యం అందజేయాలని పర్యావరణ ఉద్యమకారులు 1990లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం ఈ విషయంపై నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ జరిపి, పరిశ్రమల ఆర్థిక సహాయంతో కార్ప్‌సఫండ్ ఏర్పాటుచేసి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 200 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ాలుష్యం వల్ల వచ్చే రుగ్మతలకు సమర్థవంతమైన చికిత్స చేయడమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లక్ష్యం. ట్రామాకేర్ సెంటర్, డయాలసిస్, డెర్మటాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, ప్లాస్టిక్‌సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలను ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు అగ్నిప్రమాదాల బాధితుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పక్కనే నాలుగెకరాల స్థలాన్ని కేటాయించారు. జీ ప్లస్ రెండు అంతస్తుల భారీ ఆసుపత్రి భవనం నిర్మించనున్నారు. ఆసుపత్రి నిర్మాణ బడ్జెట్ రూ. 185.55 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో పరిశ్రమల సీఎ్‌సఆర్ కోటా కింద రూ. 138.65 కోట్లు సేకరించారు. రూ. 46.22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నది. ఆసుపత్రి నిర్వహణ కోసం పరిశ్రమలు రూ. 50 కోట్లు కేటాయించనున్నాయి.