కాంట్రాక్టు కార్మికులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-02-24T23:18:53+05:30 IST
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి డిమాండ్, సంతకాల సేకరణ
జహీరాబాద్, ఫిబ్రవరి 24: వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీసం రూ.26 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్‌లో 8 సంవత్సరాలు గడిచినా వేతనాలు సవరించడం లేదన్నారు. దీంతో సుమారు కోటి మందికి పైగా కార్మికులు నష్టపోతున్నారని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేసినా కార్మికుల వేతనాలను సవరించడం లేదని వివరించారు. పరిశ్రమల యాజమాన్యాల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు సాధించాల్సి ఉంటుందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు 2021 జూన్‌లో ఐదు రంగాలకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినా వాటిని గెజిట్ చేయకపోవడంతో అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసినా ప్రభుత్వ స్పందించకుండా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పరిశ్రమలలో కాంట్రాక్లు కార్మికుల సంఖ్య నూటికి 90 శాతం ఉందన్నారు. కార్మికులకు సౌకర్యాలు, హక్కులు కల్పించకుండా యజమానులు వెట్టిచాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. తక్షణమే వారి వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని కోరారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రాజిరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కనకారెడ్డి, వీరయ్యగౌడ్, నసీర్, కార్మికులు పాల్గొన్నారు.