కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2023-05-07T23:54:12+05:30 IST
చేర్యాల, మే 7: ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ సందర్శనార్థం భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు.
చేర్యాల, మే 7: ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ సందర్శనార్థం భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించి కోనేరులో పుణ్యస్నానమాచరించారు. సంప్రదాయబద్ధంగా మల్లన్నకు బోనం నివేదించి చెలక, నజరు, ముఖమండప పట్నాలు రచించారు. పట్టువస్త్రాలు, బండారి, ఒడిబియ్యం సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. తమ కోరికలు ఈడేర్చమని వేడుకుంటూ గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టారు. అలాగే మల్లన్న సహోదరి ఎల్లమ్మతల్లికి కల్లు, బెల్లంపానకం సాకపెట్టి బోనం నివేదించారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసి తమ కష్టాలు తీర్చాలని వేడుకున్నారు.
రాజీవ్ రహదారి వద్ద ఎండలో ఇబ్బందులు
రాజీవ్ రహదారి రిక్వె్‌స్టస్టాప్ వద్ద నిలువనీడ లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిద్దిపేట, వేములవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలివెళ్లే భక్తులు స్వాగతతోరణం అవతలివైపున గంటల తరబడి ఎండలో నిలబడి తంటాలుపడ్డారు. షెల్టర్ ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులతో పాటు ఆలయవర్గాలు ఎవరూ చర్యలు తీసుకోకపోవం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.