గజ్వేల్‌లో ఆనాటి నుంచే లుకలుకలు
ABN , First Publish Date - 2023-02-12T00:15:44+05:30 IST
గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, ప్రత్యర్థి కౌన్సిలర్ల మధ్య నూతన మున్సిపాలిటీ భవనం ప్రారంభమైన నాటి నుంచే విభేదాలు బయటపడ్డాయి.
అవిశ్వాసంపై ఇరువర్గాలు కోర్టుకు?
గజ్వేల్, ఫిబ్రవరి 11 : అవిశ్వాసం విషయంలో అసంతృప్తి కౌన్సిలర్లు పట్టువీడడం లేదు. చైర్మన్‌ను దింపేవరకు బెట్టువీడమని చెబుతుండగా, చైర్మన్ సైతం అంతేవేగంగా పావులు కదుపుతూ తగ్గేదేలే అంటున్నారు. అయితే చైర్మన్‌కు, కౌన్సిలర్లకు మధ్య ఎప్పటినుంచో రగులుతున్న అసంతృప్తికి గల కారణాలు ఒక్కొక్కొటిగా పట్టణంలో చర్చకు వస్తున్నాయి. గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, ప్రత్యర్థి కౌన్సిలర్ల మధ్య నూతన మున్సిపాలిటీ భవనం ప్రారంభమైన నాటి నుంచే విభేదాలు బయటపడ్డాయి. నూతన భవనంలోకి మార్చిన సందర్భంలో చేసిన ఖర్చు విషయంలో మాటలయుద్ధం మొదలైంది. ఏకంగా సామాజిక మాధ్యమాల్లో చైర్మన్, పాలకవర్గ సభ్యులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసే వరకు వచ్చింది. ఈ క్రమంలోనే మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించగా, అధిష్ఠానం సీల్డ్ కవర్‌లో పంపిన వారిని కాదని వేరేవారిని పాలకవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ క్రమంలో చైర్మన్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన పలువురు కౌన్సిలర్లు అవినీతి ఆరోపణలు చేశారు. అప్పుడు చైర్మన్ వర్గం అదేతీరున ఆరోపణలను తిప్పికొట్టింది. కౌన్సిలర్ల వర్గం తమ బెట్టు నెగ్గించుకుని, అధిష్ఠానం నిర్ణయాన్ని పక్కనబెట్టేశారు. ఇప్పుడు కూడా ప్రత్యర్థి వర్గం కలిసికట్టుగా చైర్మన్‌ను దింపేందుకు ప్రయత్నిస్తున్నది.
అవిశ్వాసం విషయంలో చైర్మన్, ప్రత్యర్థి వర్గాలు కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. కౌన్సిలర్టు పెట్టిన అవిశ్వాసంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే కోర్టుకు వెళ్లాలన్న యోచనలో చైర్మన్ ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అసంతృప్త కౌన్సిలర్లు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని చూస్తున్నారు. ఇప్పటికే వారు లీగల్ ఒపీనియన్ సైతం తీసుకున్నట్లు సమాచారం.